
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. యూనివర్సల్ కవరేజ్ కింద నోటిఫైడ్ పంటలను సాగు చేసే రైతులందరికీ వర్తింపజేస్తున్నామని చెప్పారు. పంటల బీమా అమల్లో ఏపీ ప్రభుత్వ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన నాలుగో ఇండియా క్రాప్ ఇన్సూరెన్స్ మార్కెట్ సెమినార్‌లో ‘మెరుగైన భవిత కోసం పంటల బీమా – సాంకేతిక భాగస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చలో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నామన్నారు. సీజన్ ముగియకుండానే పంటల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు.
ఈ–పంట ఆధారంగా రాష్ట్రంలో సాగవుతున్న ప్రతి ఎకరా పంటను నమోదు చేయడమే కాదు.. రైతులందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని మూడేళ్లుగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం స్ఫూర్తితో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమల్లో పలు మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు.
ఈ ఏడాది నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా–పీఎంఎఫ్‌బీవై పథకాలను అనుసంధానం చేసి దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేస్తున్నామని, వాతావరణ ఆ«ధారిత పంటలకు మాత్రం గతంలో మాదిరిగా కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్‌లు సెటిల్ చేస్తుందని హరికిరణ్ వివరించారు.