Harikiran
-
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
రైతులకు తోడుగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ అన్నారు. ‘పొలాలు బీడు–ఏదీ రైతుకు తోడు’ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సాయం కోసం ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక చేపట్టడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. సీజన్ ప్రారంభానికి నెల రోజులు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐసీఏఆర్, సీఆర్ఐడీఏ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆర్బీకే, మండల, జిల్లా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో చర్చించి జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేశామన్నారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద ఇతర పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు 80 శాతం రాయితీపై విత్తనాలను సిద్దం చేసామన్నారు. జూలై నెలలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుకు సైతం 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేశామన్నారు. ఈ విధంగా ఆర్హత, అవసరం ఉన్న రైతులను గుర్తించి ఆ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించామన్నారు. వ్రర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తారని చెప్పారు. కాగా.. ఖరీఫ్–2023లో ఇప్పటివరకు సాగైన పంటలను ప్రస్తుత వాతావరణంలో నిలదొక్కుకొని ఆశించిన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన పంట యాజమాన్య పద్ధతులపై జిల్లా రిసోర్స్ సెంటర్స్, కేవీకే, ఏఆర్ఎస్, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలతో రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇలా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుంటే.. రైతులను ఆందోళనకు గురిచేసేలా, ప్రభుత్వం బురద జల్లే రీతిలో లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. -
పారదర్శకంగా పంటల బీమా
సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్పష్టం చేశారు. ‘ఉచిత పంటల బీమా.. అంతా మాయ’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను జాయింట్ అజమాయిషీ కింద ఈ పంటలో నమోదు చేయడంతోపాటు 93 శాతం రైతుల బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు రసీదు కూ డా ఇస్తున్నామన్నారు. కొత్తగా ఎవరి పేర్లను చేర్చడం, తీ సేయడం కానీ చేయడం లేదన్నారు. ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మంది అర్హత పొందితే. వారికి రూ.1, 117.21 కోట్ల బీమా పరిహారాన్ని జూలై 8న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేస్తా్తర న్నారు. ఈ పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లుగా లబ్ధి పొందుతున్న రైతులను అయోమయానికి గురిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు నిత్యం అబద్ధాలను అచ్చు వేస్తోందన్నారు. 30 వేల పంట కోత ప్రయోగాలు చేశాం దిగుబడి ఆధారిత పంట నష్టం అంచనాలను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పంట కోత ప్ర యోగాలు చేసినట్టు హరికిరణ్ పేర్కొన్నారు. వాతా వరణ ఆధారిత పంట నష్టం అంచనా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,817 వాతావరణ కేంద్రాల్లో నమోదైన సమాచారాన్ని (అధిక/లోటు వర్షపాతం, ఉష్ణోగ్రతలు) పరిగణనలోకి తీసుకుని బీమా పరిహారాన్ని లెక్కించామన్నారు. సత్యదూరమైన ఇలాంటి కథనాలతో రైతులను గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
రైతు భరోసాకు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: 2023–24 సీజన్‌కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హత పొందినవారు, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమాన రైతులు, అటవీ భూసాగుదారులు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా ఈ పథకం ద్వారా మే నెలలో తొలి విడత పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం అర్హత పొందినవారు సమీప ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. తమ దరఖాస్తులను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేసుకునేందుకు ఈ నెల 3 వరకు గడువునివ్వగా 90,856 మంది భూ యజమానులు, 6,632 మంది అటవీ భూసాగుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు 2022–23లో రైతు భరోసా కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 12 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 15 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. వారికి ఈ ఏడాది కూడా యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతేడాది లబ్ధి పొంది ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
అంతా బాగున్నా అసత్యాల సేద్యమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో చుక్కనీరు చూడని పెన్నాతో సహా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఏటా సగటున అదనంగా 14 లక్షల టన్నుల దిగుబడులు మూడేళ్లుగా వస్తున్నాయంటే ఏ స్థాయిలో పంటలు సాగవుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. గడిచిన ఖరీఫ్ సీజన్లో కూడా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదవుతోందని ఓ వైపు ముందస్తు అంచనాలు చెబుతుంటే సాగు విస్తీర్ణం తగ్గడానికి వర్షాభావ పరిస్థితులే కారణమంటూ ‘పొడిగట్టిన సేద్యం’ శీర్షికన మంగళవారం ఈనాడులో ప్రచురించిన కథనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అధికం.. మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం ఖరీఫ్–2022 సీజన్లో 805.7మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 800.9మి.మీ. కురిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షపాతం 680 మి.మీ.లు కాగా, 712మి.మీ. నమోదైంది. అనంతపురం, సత్యసాయి, కాకినాడ, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఉద్యాన పంటలకు సర్కారు ప్రోత్సాహం ఇక ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 112.97 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 111.43 లక్షల ఎకరాలు. తగ్గిన విస్తీర్ణం కేవలం 1.54 లక్షల ఎకరాలు మాత్రమే. అదే వ్యవసాయ పంటల వరకు చూస్తే సాధారణ విస్తీర్ణం 85.32 లక్షల ఎకరాలు కాగా, 79.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ మేరకు తగ్గిన విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో ఉద్యానపంటల సాధారణ విస్తీర్ణం 27.64 లక్షల ఎకరాలు. కానీ, సాగైన విస్తీర్ణం 31.12 లక్షల ఎకరాలు. దాదాపు 3.48 లక్షల ఎకరాలకుపైగా పెరిగింది. మిగిలిన విస్తీర్ణంలో పట్టు తదితర పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లోనూ ఉద్యాన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2019–20లో 90,844 ఎకరాలు, 2020–21లో 1,42,565 ఎకరాలు, 2021–22లో 1,51,742 ఎకరాల మేర కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. దిగుబడులు కూడా 288 లక్షల టన్నుల నుంచి 328 లక్షల టన్నులకు చేరాయి. ఖరీఫ్–2021లో ఆçహార ధాన్యాల ఉత్పత్తి 160 లక్షల టన్నులుంటే, ఖరీఫ్–2022లో 186లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని ముందస్తు అంచనా వేశారు. డ్రైస్పెల్స్ పేరుతో ‘ఈనాడు’ కాకిలెక్కలు ఇక కనీసం 21రోజులపాటు వర్షపాతం నమోదు కాకపోవడాన్ని డ్రై స్పెల్ అంటారు. ఏటా సీజన్లో డ్రై స్పెల్స్ నమోదు కావడం సర్వసాధారణం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తప్ప డ్రై స్పెల్స్ వచ్చినంత మాత్రాన కరువు ఛాయలున్నట్లు కాదు. సీజన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, పంటలు దెబ్బతినే స్థాయిలో కనీసం 2–5 వారాల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు (డ్రై స్పెల్) కొనసాగితే ఆ ప్రభావం పంటల దిగుబడిపై చూపుతుంది. టీడీపీ హయాంలో కరువు మండలాలు ప్రకటించని ఏడాది లేదనే చెప్పాలి. కానీ, గత మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేవు. వాస్తవాలిలా ఉంటే.. డ్రై స్పెల్స్ వల్లే సాగు విస్తీర్ణం తగ్గిందంటూ కాకిలెక్కలతో రైతులను గందరగోళ పరిచేలా ‘ఈనాడు’ ఎప్పటిలాగే ఓ కథనాన్ని వండి వార్చింది. డ్రై స్పెల్స్ వల్ల నష్టం వాటిల్లలేదు పొడి వాతావరణం (డ్రై స్పెల్) ఏర్పడినా ఏ విధమైన తేమ ఒత్తిడికి పంటలు గురికాలేదు. పంట నష్టం వాటిల్లలేదు. వివిధ కారణాలవల్ల తగ్గిన వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల ఖరీఫ్–2022 సీజన్లో 3.48 లక్షల ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లారు. రైతులను గందరగోళ పరిచేలా ఈనాడు కథనాలు ప్రచురిస్తోంది. ‘పొడిగట్టిన సేద్యం’ కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
పంటల బీమాలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. యూనివర్సల్ కవరేజ్ కింద నోటిఫైడ్ పంటలను సాగు చేసే రైతులందరికీ వర్తింపజేస్తున్నామని చెప్పారు. పంటల బీమా అమల్లో ఏపీ ప్రభుత్వ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన నాలుగో ఇండియా క్రాప్ ఇన్సూరెన్స్ మార్కెట్ సెమినార్లో ‘మెరుగైన భవిత కోసం పంటల బీమా – సాంకేతిక భాగస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చలో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నామన్నారు. సీజన్ ముగియకుండానే పంటల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ–పంట ఆధారంగా రాష్ట్రంలో సాగవుతున్న ప్రతి ఎకరా పంటను నమోదు చేయడమే కాదు.. రైతులందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని మూడేళ్లుగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం స్ఫూర్తితో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమల్లో పలు మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా–పీఎంఎఫ్‌బీవై పథకాలను అనుసంధానం చేసి దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేస్తున్నామని, వాతావరణ ఆ«ధారిత పంటలకు మాత్రం గతంలో మాదిరిగా కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్‌లు సెటిల్ చేస్తుందని హరికిరణ్ వివరించారు. -
రైతులకు యూసీఐఎల్ అన్యాయం చేస్తోంది
సాక్షి, కడప సిటీ: ‘యురేనియం ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదు.. ప్రారంభంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగడం లేదు. బాధితులకు పరిహారం, ఉద్యోగాలు అందలేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులను చేయడం లేదు. వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని వేముల మండలం తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, మబ్బుచింతలపల్లె, కేకే కొట్టాల, కనంపల్లె, వేల్పుల తదితర యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వందలాది మంది బాధిత గ్రామాల ప్రజలు కడప కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం వేముల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజులపాటు ఆందోళనలు చేపట్టినా యూసీఐఎల్ యాజమాన్యం కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. అభివృద్ధి పనులను విస్మరించారన్నారు. 70 శాతం ఉద్యోగాలు యురేనియం బాధిత ప్రాంత రైతులకే కేటాయించాలన్నారు. సరిహద్దులు నిర్ణయించిన మేరకు భూములన్నీ తీసుకోవాలన్నారు. టైలింగ్‌పాండ్ వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతోందని, కలుషిత నీటితో పంటలు దెబ్బతినడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పర్యవేక్షణ బావులు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలన్నారు. భూగర్భ జలాలు శుద్ధి చేస్తేగానీ పంటలు పండవన్నారు. అంతవరకు రైతులకు నష్టపోయిన పంట నష్టాన్ని నిరంతరాయంగా చెల్లిస్తూనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం కోల్పోయిన రైతులందరికీ తగు రీతిలో ఉపాధి కల్పించాలన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారంతోపాటు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దని, బాధిత గ్రామాల్లోని రైతులతో కమిటీ వేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హరికిరణ్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యురేనియం బాధిత గ్రామాల నాయకులు, వైఎస్సార్సీపీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరిస్తేనే... డిమాండ్లు పరిష్కరించమంటే యురేనియం ప్రాజెక్టు యాజమా న్యం కాలయాపన చేస్తోంది. అన్ని డిమాండ్లు పరిష్కరిస్తేనే యురేనియం బాధిత గ్రా మ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చే స్తాం. ప్రజాభిప్రాయసేకరణ అసలు ఒప్పుకోం. కమిటీ వేసి సమస్యలన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. – మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ, రాచగుంటపల్లె, వేముల మండలం ప్రజాభిప్రాయ సేకరణ వద్దు యురేనియం ప్రాజెక్టు యాజమాన్యం జనవరి 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ముందుకు వెళితే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తాం. యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో కమిటీ ఏర్పాటు చేసి డిమాండ్లను పరిష్కరిస్తేనే అంగీకరిస్తాం. – నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల కన్వీనర్, వేముల -
కలెక్టర్‌నైనా అమ్మానాన్నకు బిడ్డనే..
అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న.. బాల్యంలో చందమామ రావే అంటూ ఆకాశమే హద్దుగా అమ్మ చేసే ఉపదేశం, నాన్న గుండెలపై ఆడుకున్న క్షణాలు మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు తల్లిదండ్రులు.. వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై వారి ప్రేమ అపూర్వమైనది.. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.. నేడు నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.. –సాక్షి ప్రతినిధి, కడప తల్లిదండ్రులందరికీ పేరెంట్స్‌డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా తండ్రి డాక్టర్ విజయ్‌కుమార్ (గైనకాలజిస్ట్ కమ్ ఎండోస్కోపిక్ సర్జన్), ప్రభుత్వ వైద్యునిగా రిటైర్డ్, తల్లి పద్మజలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైఫ్‌లో ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చూశారు. ‘నీ ఇష్టమైనదే చదువు. అందుకోసమే సన్నద్ధమై లక్ష్యం సాధించాలి’ అని చెప్పేవారు.కష్టపడితేనే సుఖం ఉంటుందని మార్గనిర్దేశం చేసేవారు. విమానంలో వెళ్లే స్థోమత ఉన్నా రైళ్లోనే ప్రయాణించమని చెప్పేవారు. ఏసీ కోచ్‌లో వెళ్లే అవకాశం ఉన్నా స్లీపర్‌లోనే పంపేవారు. కార్లున్నా ఆటోలోనే వెళ్లమనేవారు. ఏ పనైనా మనం చేసి చూపించిన తర్వాతనే అవతలి వాళ్లకు చెప్పి చేయించుకోవాలనేవారు. నా ఉద్యోగంలో నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. నాన్న స్ట్రిట్...అమ్మ గారాబం. పరిస్థితి బ్యాలెన్స్‌గా ఉండేది. నేను ఒక జిల్లాకు కలెక్టర్ అయినా అమ్మానాన్నల బిడ్డనే. రోజూ ఫోన్లో మాట్లాడతారు...టైంకు భోం చేశావా అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త అంటారు... ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. వారు లేకపోతే పెద్దవారు లేరన్న భరోసా పోతుంది. వారికి ఏమి కావాలో చూసుకోవాలి. మేము మీకు ఉన్నామన్న భరోసా కల్పించాలి. అప్పుడే వారు ఎక్కువ కాలం మనతో ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల కోసం పరితపిస్తుంటారు.. పిల్లలు పుట్టగానే ఉజ్వల భవిష్యత్తు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నట్లు కలగంటారు. జీవితంలో క్షణం తీరిక లేకుండా బిడ్డల అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. గొప్పవాళ్లుగా తీర్చే ప్రయత్నంలో పుస్తెలు తాకట్టు పెట్టి, ఫీజులు కట్టిన తల్లులు ఉన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నలెందరో ఉన్నారు. మనకు జన్మనిచ్చి.. నిలబడటానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి ఇంత మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం! వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో కలగకుండా చూసుకుంటే చాలు కదా! అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకునేది. ఉద్యోగ రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారి, ఒక్క నిమిషం పలకరించినా కన్నవారు సంతోషిస్తారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అమ్మా నాన్నలు.. నిజంగా అమృత మూర్తులే. అందుకే మన పురాణాలు ‘మాతృ దేవోభవ... పితృదేవోభవ’అంటూ ఉపనిషత్తులు దేవతల స్థాయినిచ్చి గౌరవించాయి. ఆదివారం నేషనల్ పేరెంట్స్‌డే సందర్భంగా ప్రముఖుల తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే... –సాక్షి నెట్వర్క్, కడప తల్లిదండ్రులతో ఎస్పీ అన్బురాజన్(ఫైల్) తోడు–నీడలా అమ్మానాన్న మాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. నేను నాల్గవ తరగతి చదివేప్పుడు ఇతరుల పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి కాయ కోసుకుని తిన్నదీ గుర్తే....అప్పుడు తోట వాచ్మెన్ వచ్చి అరవడంతోపాటు మా నాన్న(కు) నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తెచ్చి థర్డ్ డిగ్రీ చూపించారు. అప్పటి నుంచి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతిలో కోయంబత్తూరులో ఐఏఎస్, ఐపీఎస్ (సివిల్స్)కు ప్రిపరేషన్ గురించి అవగాహన సదస్సు జరిగింది. దానికి కలెక్టర్, కమిషనర్లతో పెద్ద స్థాయి అధికారులు హాజరయ్యారు. మా నాన్న హెడ్మాస్టర్ కావడంతో నన్ను ఒక మంచి స్థాయిలో నిలుపాలన్న ఆశయంతో అక్కడికి తీసుకెళ్లి నాలో స్ఫూర్తి రగిలించారు. సివిల్స్‌లో మూడుసార్లు దగ్గరగా వచ్చి మిస్ అయిన సందర్భంలో అమ్మ షణ్ముగవల్లీ (టీచర్) చూపిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. బాధలో ఉన్న నాకు ఆమె వెన్నంటే ఉండడంతోపాటు ఓదారుస్తూ మళ్లీ సివిల్స్‌లో నిలబడేలా చేసింది. ఆమె చూపిన ప్రోత్సాహం.... నాన్న స్ఫూర్తి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరినీ మరిచిపోలేను. పేరెంట్స్‌డే సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. – కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ, కడప మా కోసం నాన్న దూరంగా గడిపేవారు... మాది రాజస్తాన్‌లోని జయపూర్.. నాన్న జశ్రాం మర్మట్ సీజీఎస్టీలో సూపరింటెండెంట్..అమ్మ విమల గృహిణి..కుటుంబాన్ని నడపడానికి నాన్న చాలా కష్టపడేవారు. పెద్ద కుటుంబం మాది. కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు వెళ్లాలనేది నాన్న మనస్తత్వం. జీవన గమనంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే నేను సివిల్స్...చెల్లి ఐఐటీ కోచింగ్ కోసం ప్రిపేరవుతుంటే అమ్మ మాతో ఉండేది. మాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకునేది. తరచూ మా ఇద్దరికీ మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ ఉండేది. పెద్ద కుటుంబంలో నాన్న ఒక్కరిదే సంపాదన. మా అవసరాలకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. మా చదువుల సమయంలో వారెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నాన్న, అమ్మ తోడ్పాటుతో ఐఎఎస్(2019 బ్యాచ్)కు ఎంపికయ్యాను. తొలిసారి అసిస్టెంట్ కలెక్టర్‌గా కడపకు వచ్చాను. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో సన్నిహితంగా ఉండాలి.. స్నేహితుల మాదిరిగా కలిసిపోతే ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలతో మాట్లాడుతుండాలి. వారి అభిరుచులు..ఆకాంక్షలను గుర్తించగలిగాలి.. అలా చేస్తే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదని నా అభిప్రాయం. మా తల్లిదండ్రులు ఇలానే చేశారు. జీవితం ఒక్కసారే వస్తుంది..దాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని మా అమ్మ చెప్పే మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. -వికాస్ మర్మట్, అసిస్టెంట్ కలెక్టర్, కడప అమ్మ ఆదర్శం.. నాన్న లక్ష్యం మాది రేణిగుంట మండలంలోని ఓ గ్రామం. నాన్న ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి పారిశ్రామికవేత్త. కుటుంబంలో ఒకరిని అయినా ఉన్నత స్థానంలో నిలపాలని కలలు గన్నారు. అందుకు అనుగుణంగా నాన్న సోదరుడిని ఐఏఎస్‌లో పెద్ద స్థానంలో నిలబెట్టారు. అయితే మా కుటుంబంలోనూ ఒకరైనా ఉండాలన్న తలంపు నాన్నలో బలంగా ఉండింది. నన్ను సివిల్స్ వైపు నడిపించారు. ఆ రోజుల్లో సివిల్స్ త్రుటిలో మిస్సయినా తర్వాత గ్రూప్–1లో స్థానం సాధించాను. నాన్న లక్ష్యమంతా కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా ఉండి పేద వర్గాలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని సివిల్స్ వైపు ప్రోత్సహించారు. అమ్మ సావిత్రి కూడా ఆడపిల్లలు ఆర్థికంగా బాగుండాలని చెబుతూ ఉండేది. అందుకు చదువే ముఖ్యం అని చెప్పేవారు. ఐఏఎస్ క్యాడర్ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. భర్త రోహిత్ కూడా అండగా నిలిచారు. మా బాగు కోసం పరితపించిన కుటుంబ పెద్దలను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ తల్లిదండ్రులు చూపిన దారిలోనే పయనిస్తున్నాను. – ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్, కడప పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి మా తండ్రి చంద్రకాంత్‌వర్మ (మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవారు). తల్లి జ్ఞానేశ్వరి (రిటైర్డ్ స్కూలు టీచర్). ఇద్దరూ నన్నెంతగానో ప్రోత్సహించారు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా తల్లి గారు మరింత మద్దతు పలికారు. ఇంజనీరింగ్ ఐఐటీలో చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి నాకు అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని అందించేవారు. అమ్మ నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుని మరింతగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. అది చేయలేనపుడు ఏం సాధించినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు దేనికీ పనికి రాడు. –సాయికాంత్‌వర్మ, జేసీ (అభివృద్ధి), కడప వారి కష్టం మాకు రాకూడదని... మాది వేంపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె. దిగువ మధ్యతరగతికి చెందిన సన్నకారు రైతుకుటుంబం. మా తల్లిదండ్రులు ఓబుల్‌రెడ్డి, గంగమ్మలకు మేము ముగ్గురు సంతానం. నేను పెద్దవాడిని, నాతరువాత తమ్ముడు, చెల్లెలు. అప్పట్లో మా పరిస్థితులు ఎలా ఉండేవంటే స్టోరు బియ్యం ఎప్పుడు ఇస్తారా ? అని ఎదురు చూసేవాళ్లం. మాకోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడేవారు. నేను ఇంటర్లో ఉండగా నాన్న చనిపోయారు. అప్పుడు మా చదువు బాధ్యతలను అమ్మ తన భుజస్కంధాలపైన వేసుకుంది. వ్యవసాయం చేసే అమ్మ అతికష్టం మీద చదివించింది. మా పెద్దనాన్న కూడా మాకు సహకరించారు. పిల్లలు సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని స్వయంగా చూశాను. పీజీ చివరి సంవత్సరంలో అమ్మ కూడా చనిపోయింది. ఎంఏ ఎకనామిక్స్ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పించమని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన గ్రూప్స్ రాయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. గ్రూప్స్ ప్రిపరేషన్‌కు అయ్యే ఖర్చుల విషయాలన్ని వైఎస్సార్ చూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న తల్లిదండ్రులు నేను ఈస్థాయికి చేరుకోక ముందే కాలం చేయడం నన్ను ఎప్పటికీ బాధిస్తుంటుంది. ఎప్పుడూ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకండి. –ధర్మచంద్రారెడ్డి, ఆర్డీఓ, రాజంపేట విలువలే పునాదిగా పెంచారు.. మా తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోవిందరెడ్డి (విశ్రాంత ఎల్ఐసీ మేనేజర్) విలువలే పునాదిగా పెంచారు. మనకు ఉన్న దాంట్లో పదిమందికి సాయం చేయడం నేర్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్ విద్య అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేశాను. మా ఇంట్లో నాతో పాటు మా బంధువులు, తెలిసిన వారు కూడా కలిసిమెలిసి చదుకునేవాళ్లం. అందరినీ అమ్మ బాగా చూసుకునేది. 1984లో ఇంజినీరింగ్‌లో మహిళలు చదవడం తక్కువగా ఉండేది. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్న సమయంలో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. 1984–88 విద్యాసంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఏకైక మహిళా విద్యార్థిని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 27 సంవత్సరాలకు పైగా బోధనా రంగంలో రాణించగలిగాను. ప్రస్తుతం వైవీయూకు వైస్ చాన్సలర్‌గా ఉన్నతస్థానంలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు నేర్పిన జీవితపాఠాలే మార్గదర్శకం. వారు నేర్పిన విలువలనే మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్సలర్, వైవీయూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది మా సొంతూరు పుల్లంపేట మండలం వత్తలూరు. అమ్మ కృష్ణవేణి, నాన్న రామ్మోహన్‌రాజు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. నేను చివరి వాడిని. మా ముగ్గురినీ ప్రయోజకుల్ని చేయాలని అమ్మా, నాన్న బాగా తపన పడ్డారు. చిన్నప్పుడు బడిలో అమ్మ, నాన్న వద్దనే మేము చదువుకున్నా, అందరి పిల్లల్లానే మమ్మల్ని చూసేవారు. చదవకుంటే కొట్టేవారు. అప్పట్లో అమ్మ, నాన్నకు తక్కువ జీతాలు అయినా మాలో ఎవరికీ చిన్నలోటు కూడా చేయలేదు. పెద్దన్నయ్య చక్రధర్‌రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రెండో అన్నయ్య శశిధర్‌రాజు విద్యుత్‌శాఖలో సబ్ఇంజనీర్, నేను రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం అన్నదమ్ములం రాజంపేటలో ఒకేచోట నివాసముంటున్నాం. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా ఉన్నతిని చేసిన ఆయన ఎంతో సంతోషించారు. అమ్మకు ఏలోటు రానివ్వకుండా కంటికి రెప్పాలా చూసుకుంటున్నాం. -ఈ.భానుమూర్తిరాజు, రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి ప్రతి అడుగులోనూ వారి శ్రమే.. నాపేరు రాచకుంట నాగరాజు. నేను కోడూరులోని అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానంలో హెడ్‌గా విధులు నిర్వస్తిన్నా. సొంతూరు పులివెందుల. నాన్న ఇడుపులపాయ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు రాచకుంట నారాయణ, లక్ష్మీదేవి శ్రమనే కనపడుతుంది. మూడునెలలక్రితం అమ్మ కాలం చేశారు. ఇప్పటికీ వారు పడిన కష్టం, త్యాగం గుర్తుచేసుకుంటూ ఉంటాను. మార్గదర్శకులు మా అమ్మానాన్నలే నా జీవిత ఔన్నత్యానికి మార్గదర్శకులు. నాన్న చిత్తూరు జిల్లాలోని మా గ్రామానికి సర్పంచ్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అమ్మ గృహిణిగానేగాక నాన్నకు రాజకీయాల్లో స్నేహితురాలిగా ఉంటూ ప్రోత్సహించారు. బిడ్డల బాగోగుల కోసం ఎంత శ్రద్ధ చూపారో గ్రామం అభివృద్దికి కూడా అదే స్థాయిలో కృషి చేశారు. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించి నన్ను అందులోనే చదివించారు. చదువుకు మించిన ఆస్తి లేదని బోధించారు. కష్టాలు వచ్చినపుడు సవాలుగా స్వీకరించి విజయం సాధించేవారు పట్టువదలవద్దని నూరిపోశారు. చదువు వరకు పాఠశాల గురువులు మార్గదర్శకులైతే నా జీవితానికి ఉపయుక్తమైన మార్గదర్శనం చేసింది అమ్మా నాన్నలే! నాన్న ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి ఉత్తమ సర్పంచ్‌గా అవార్డును స్వీకరించారు. మా దంపతులం కూడా అమ్మనాన్నను ఆదర్శంగా తీసుకున్నాం. – శంకర్ బాలాజీ, అసిస్టెంట్‌కమిషనర్, జిల్లా దేవదాయశాఖ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారి కలలను సాకారం చేసినప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది. మానాన్న ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా చూడాలన్నది వారి ఆశ. ఈక్రమంలో చదివించేందుకు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా. మాసొంతూరు నందలూరు. విద్యాభ్యాసం రాజంపేటలోనే సాగింది. ఎంబీఏ హైదరాబాద్‌లో చేశా. ఆ తరువాత గ్రూప్స్ రాసి డీఎస్పీ అయ్యాను. ఇప్పుడు గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్నా. అమ్మా, నాన్నల కోరిక వల్లే నేను ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నా. యూత్‌కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘‘ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టవద్దు’’. నిజమైన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు తల్లిదండ్రులే. – సుప్రజ, డీఎస్పీ, గుంటూరు –(రాజంపేట టౌన్) -
వైఎస్సార్ జిల్లా: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు..
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్ , ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని తెలిపారు. ప్రైవేట్ వాహనాల ద్వారా రవాణాను నిషేధించామని పేర్కొన్నారు. ఒకే చోట 10 మందికి మించి గుమికూడి ఉండకూడదని తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడిసిన్, కూరగాయల అమ్మకాలు తప్ప మిగతా వ్యాపారాలన్నీ బంద్ చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ ఈ నెల 31 వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గించాలని చెప్పారు. బ్యాచ్‌లుగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. రైళ్లు, ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేశామన్నారు. జిల్లాలోని అన్ని షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, జిమ్స్, స్విమ్మింగ్ ఫుల్స్ మూసివేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. (కరోనా కట్టడికి మేము సైతం..) వారందరు కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.. ‘‘గల్ఫ్ దేశాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం మన జిల్లాకు చెందిన వారు వెనక్కి వచ్చారు...దాదాపు 2,805 మంది వివిధ దేశాల నుండి జిల్లాకి వచ్చారు.. వలంటీర్ల ద్వారా వారి సమాచారం సేకరించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం. వారందరు కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని’’ ఆయన కోరారు. ప్రభుత్వ సూచనలు అమలు చేసి.. ప్రజలను అప్రమత్తం చేయడానికి మండలంలో తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని.. 08562- 254259, 259179 ఈ రెండు నంబర్లలో ఎప్పుడైనా సంప్రదించవచ్చని వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రేషన్ సరుకులను ఈ నెల 29న ప్రతి లబ్ధి దారునికి అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. (తెలంగాణలో 30కి చేరిన కరోనా కేసులు) అదే స్ఫూర్తి కొనసాగించాలి: ఎస్పీ జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో ఏప్రిల్ 5 వరకు అదే కర్ఫూ కొనసాగించాలని.. ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ప్రజల మంచి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. జాతరలు, దేవరలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పోలీసులు అనుమతి లేనిదే జాతరలు నిర్వహించకూడదని తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడిసిన్, ఇతర నిత్యావసర వస్తువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించకూడదని తెలిపారు. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేసిన వారిపై ప్రొద్దుటూరులో కేసు నమోదు చేశామని చెప్పారు. అధికారిక సమాచారం లేకుండా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్‌లు చేయరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. -
‘వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించం’
సాక్షి, వైఎస్సార్ కడప : నేటి నుంచి (శనివారం) జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 9వ తేదీ నుంచి 11 తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తామని, 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 24న ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. (ఏపీ: ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్ విడుదల) కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘24 న తేదీ ఉదయం 8 నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 1985 పోలింగ్ స్టేషన్ గుర్తించాము. జిల్లా స్థాయిలో 20 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ చేపడతాము.. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశాము. ఎన్నికలకు 10879 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. 1821 బాక్సులు అదనంగా కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపాము. ప్రతి పోలింగ్ బూత్‌లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తాం. మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏ మునిసిపాలిటీ కి సంబంధించి అక్కడే జరుగుతాయి. 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏవి కూడా కోర్టులో కేసులు లేవు. అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయి. రాజంపేట, బద్వేలు ఎన్నికలకు హైకోర్టు స్టే వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’. అని పేర్కొన్నారు. (‘ఆయన సిగ్గు, శరం లేని మనిషి’) ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా ఎక్కడా అక్రమంగా డబ్బులు, మద్యం తరలిస్తే, పంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా ఎక్కడా ప్రచారం నిర్వహించరాదని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే పక్క జిల్లాల నుంచి ఫోర్స్‌ను వాడుకుంటామని తెలిపారు. 6 వేల మంది భారీ పోలీసు బలగాలతో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నట్లు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. (ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే) స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక ప్రకటన -
ఆ కథనాలు అవాస్తవం..
సాక్షి, కడప: ఇళ్ల పట్టాలపై కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురించడం బాధాకరమని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను వెనక్కి తీసేసుకుంటున్నారంటూ వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కథనాలు నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికి ఇళ్లు, ఉగాది నాటికి ఇంటి స్థలాలు ఇస్తామని ఆయన తెలిపారు. 2500 ఎకరాలు భూమిని గుర్తించాం.. ఇంటి స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాలు భూమిని గుర్తించామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉన్న చోట పట్టా భూములు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. 300 ఎకరాల పట్టా భూమిని సేకరించామని.. ఈ పథకం ద్వారా భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. -
సీఎం ఆశయసాధనకు కార్యరూపం
సాక్షి, కడప: ‘‘సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆయన సొంత జిల్లాలో పనిచేయడం మధురానుభూతి’’ అని కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. సిబ్బందిని పలకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాక్షి : కొత్త ఏడాది ప్రభుత్వ లక్ష్యాలేమిటి? కలెక్టర్ : ఈ ఏడాదిలో జిల్లాలోని రైతులందరికీ సాగునీరు అందించడమే ప్రధాన ఎజెండా. వైఎస్ హయాంలో నెలకొలి్పన గాలేరు–నగరి సుజల స్రవంతి ఫేజ్–2 పనులను రివర్స్ టెండరింగ్‌లో ఖరారు చేశాం. పనులను పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తాం. ఫేజ్–1లో వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో పిల్ల కాలువలను పూర్తి చేస్తాం. సాక్షి : గండికోట పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? కలెక్టర్ : గండికోట ప్రాజెక్టు పరిధిలో ఆర్అండ్ఆర్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. త్వరలో 20 టీఎంసీలు నిలుపాలన్నది లక్ష్యం. గండికోట పరిధిలో రూ. వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి విడతలో రూ. 140 కోట్లు కేటాయించారు. ముంపు వాసులకు ఈ పరిహారం చెల్లిస్తా. సాక్షి : కొత్త ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి చేస్తారు? కలెక్టర్ : కుందూ, తెలుగుగంగ ఎత్తిపోతల, రాజోలి ఆనకట్టల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇటీవలే శంకుస్థాపన చేశారు. 15 కిలోమీటర్ల పొడవున్న రాజోలి బండ్ నిర్మాణానికి అవసరమైన 400 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నాం. కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 60 ఎకరాలను సేకరిస్తున్నాం. సాక్షి : జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ఎప్పుడు? కలెక్టర్ : ఈ పథకానికి కూడా సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారు. సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంది. అనంతరం పథకం పనులకు టెండర్లు పిలుస్తాం. చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులకు నీరిస్తాం. సాక్షి : నాడు–నేడు అమలు ఎలా? కలెక్టర్ : నాడు–నేడు ద్వారా జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడతలో 1048 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి 200 అంచనాలు సిద్ధమయ్యాయి. మరో 900 ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అంచనాలు పూర్తి కాగానే పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సోషియల్æ కాంట్రాక్టు కింద పనులు చేపడతాం. సాక్షి : పేదలకు వైద్య సేవలు అందించేందుకు తీసుకునే చర్యలు? కలెక్టర్ : ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 400 సబ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. 150 సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరో 250 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. 150 కొత్త సబ్ సెంటర్లకు స్థలాలు సేకరిస్తున్నాం. కొత్త భవనాలు నిర్మిస్తాం. సాక్షి : పులివెందుల మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? కలెక్టర్ : మెడికల్ కళాశాలకు స్థల సేకరణ పూర్తయింది. డిజైన్ అయ్యాక టెండర్లు పిలుస్తాం. కడపలో కేన్సర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిమ్స్‌లో స్థలం సిద్ధంగా ఉంది. డిజైన్ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. సాక్షి : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు ఎప్పుడు? కలెక్టర్ : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు స్థలం ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రిమ్స్ ఎదురుగా 10 ఎకరాల స్థలం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపి రెండు సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ కట్టేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి : అభివృద్ధి పనుల సంగతేమిటి? కలెక్టర్ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో రూ. 30–40 కోట్లతో మురుగు కాలువలను ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నాం. వీటితోపాటు ఒక్కో నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నాం. సాక్షి : గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి? కలెక్టర్ : జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ. 40 లక్షలతో కొత్త భవనాలు, రూ. 30 లక్షలతో పాత భవనాల విస్తరణ, రూ. 25 లక్షలతో పాత భవనంపై కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నాం. ఒక్కొక్క సచివాలయాన్ని 2600 స్కోయర్ ఫీట్‌తో నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 280 కొత్త సచివాలయాలు మంజూరు చేశాం. వచ్చే జూలై, ఆగస్టు నాటికి వీటిని పూర్తి చేస్తాం. సాక్షి : పేదల గృహాల మంజూరు ఎప్పుడు? కలెక్టర్ : జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 1750 ఎకరాలను గుర్తించాం. ఇది 70 వేల మందికి సరిపోతుంది. ఇంకా 350 ఎకరాల స్థలం అవసరం ఉంది. సాక్షి : ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చేయబోతోంది? కలెక్టర్ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే జమ్మలమడుగు వద్ద స్టీల్ ప్లాంటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులు మొదలవుతాయి. రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కొప్పర్తి వద్ద ఈసీ క్లియరెన్స్ పూర్తి కాగానే ఆరు వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. సాక్షి : రోడ్ల విస్తరణ ఎప్పుడు మొదలు పెట్టనున్నారు? కలెక్టర్ : రేణిగుంట–కడప ఫోర్‌లేన్ హైవేను కర్నూలు ఫోర్‌లేన్ హైవేకు అనుసంధానం చేస్తున్నాం. భూసేకరణ మొదలు పెట్టాం. బెంగుళూరు–పులివెందుల రోడ్డు ముద్దనూరు వరకు విస్తరిస్తున్నాం. సాక్షి : కొత్త రైల్వేలైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? కలెక్టర్ : కడప–బెంగుళూరు రైల్వేలైన్ భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం పూర్తయింది. రైతులకు పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపాం. సాక్షి : పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? కలెక్టర్ : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలందరికీ ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. జనవరి 3 నుంచి 1259 రకాల వ్యాధులకు, ఏప్రిల్ 1 నుంచి క్యాన్సర్‌తోపాటు పలు రకాల తీవ్ర వ్యాధులకు సైతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించనున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 21,550 మంది రోగులకు రూ. 55 కోట్లతో వివిధ రకాల ఆపరేషన్లు చేశాం. అలాగే వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా 15 వేల మందికి కంటి అద్దాలు ఇచ్చాం. మరో రెండు వేల మందికి ఆపరేషన్లు చేయబోతున్నాం. సాక్షి : ఆసరా అమలు తీరు ఎలా ఉంది? కలెక్టర్ : ఆసరా పథకం ద్వారా 836 జబ్బులతో బెడ్డుమీద ఉన్న వారికి నెలకు రూ. 5000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. సాక్షి : జిల్లాలో రూ. ఐదు వేల పెన్షన్ ఎవరెవరికి ఇస్తున్నారు? కలెక్టర్ : లెప్రసీ, పెరాలసిస్ స్టేజీ–3, 4, 5, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, రెండు బోదకాలు ఉన్న 15 వేల మందిని గుర్తించాం. వీరందరికీ రూ. 5 వేల పెన్షన్ ఇస్తున్నాం. సాక్షి : గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? కలెక్టర్ : జిల్లాలో 8547 గ్రామ సచివాల ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, 400 పో స్టులు మినహా మిగిలినవన్నీ భర్తీ చేశాం. ఖా ళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నాం. సాక్షి : సీఎం జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? కలెక్టర్ : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి పరుగులు పెడుతున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా లక్ష్యాలను సాధిస్తా. ముఖ్యమంత్రి బాటలోనే అంతా ముందుకు సాగుతున్నాం. ఇది మంచి అనుభూతి. ఇక్కడ చేస్తున్న పని జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. సాక్షి : ప్రజాప్రతినిధులతో సమన్వయం ఎలా ఉంది? కలెక్టర్ : వైఎస్సార్ జిల్లాలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మొదలుకొని అందరితో సమన్వయం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి సందేశం. సాక్షి : అవినీతి అక్రమాలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? కలెక్టర్ : పాలనలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇది పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లింది. ఆ దిశగానే అందరం ముందుకు సాగుతున్నాం. కిందిస్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పాలన సాగుతోంది. సాక్షి : ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? కలెక్టర్ : ముఖ్యమంత్రి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. మేం చెప్పింది వింటారు. కరెక్ట్ అనిపిస్తే వెంటనే నిర్ణయం ఉంటుంది. నేను కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, చంద్రబాబు నాయుడు పాలన చూశాను. ఇలా ఎవరూ ఉండరు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంత నిబద్ధతతో పనిచేసే వారిని నేను చూడలేదు. సాక్షి :పెన్షన్లు తొలగిస్తున్నారన్న అపోహ కరెక్టేనా? కలెక్టర్ : పెన్షన్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నెలకు జిల్లాలో పెన్షన్ల ద్వారా ఇచ్చే మొత్తం రూ. 60–70 కోట్లకు పెరిగింది. వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల 15 వేలకు పైగా కొత్త పెన్షన్లు రానున్నాయి. సాక్షి :స్థానిక ఎన్నికల ప్రణాళిక సిద్ధమా? కలెక్టర్ : జిల్లాలో గత నాలుగైదు ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. అదే నిబద్దతతో, నిష్పక్షపాతంగా, పోలీసుల సహకారంతో స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తాం. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సైతం సిద్ధం చేశాం. -
‘దారి’ దొరికింది
కడప సిటీ: కొట్రాళ్ల దళితవాడకు దారి దొరికింది.ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం దొరికింది.ఏకంగా తారు రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి.జిల్లా కలెక్టర్ హరి కిరణ్ స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి రూ.92 లక్షల నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పి.యదుభూషణ్‌రెడ్డి ఈ విషయం తెలిపారు.సంబేపల్లె మండలం దుద్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్రాళ్ల దళితవాడలో రోడ్డు లేక పోవడంతో పడుతున్న కష్టాలపై సాక్షిలో శుక్రవారం ‘మరో దారి లేదు’ అనే శీర్షికన అ వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ చొరవ తీసుకుని డ్వామా పీడి యదుభూషణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ రామలింగారెడ్డిలను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి శుక్రవారం సాయంత్రమే ఆదేశాలు కూడా జారీ చేశారు. పంచాయతీ రాజ్ పనులు చేపట్టగా నిధులు మాత్రం ఉపాధి హామీ నుండి రూ.82.80 లక్షలు,డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(డిఎంఎఫ్) కింద రూ.9.20 లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.త్వరలో రోడ్డు పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అధికారులు శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. -
జిల్లా కలెక్టర్‌గా బాబు
నగరపాలక సంస్థ కమిషనర్‌గా వీరపాండ్యన్ కర్నూలు జేసీగా హరికిరణ్ నియామకం జేసీగా శేషగిరిబాబు ప్రస్తుత జేసీ మురళి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ విజయవాడ/విజయవాడ సెంట్రల్ : జిల్లా నూతన కలెక్టర్‌గా అహ్మద్ బాబు నియమితులయ్యారు. ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జేసీ జె.మురళితోపాటు నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 37 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులోభాగంగా జిల్లాకు నూతన కలెక్టర్‌ను నియమించడంతోపాటు జాయింట్ కలెక్టర్, ప్రస్తుతం ఇన్చార్జి కలెక్టర్‌గా ఉన్న జె.మురళిని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్, గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆయన స్థానంలో ఎంవీ శేషగిరిబాబును నియమించింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, బిల్ అలర్ట్ తదితర అంశాల్లో తనదైన శైలిలో వ్యవహరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జి.వీరపాండ్యన్ నియమితులయ్యారు. వీరపాండ్యన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెర్ఫ్‌లో అదనపు సీఈవోగా పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వీరపాండ్యన్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులైన జి.వీరపాండ్యన్ గతంలో ఖమ్మం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, గూడూరు, నెల్లూరు సబ్‌కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వ ర్తించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే బ్యాచ్ కావడంతో ప్రస్తుత కమిషనర్ హరికిరణ్‌తో మంచి స్నేహసంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగరంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సదస్సులో వీరపాండ్యన్ పాల్గొన్నారు. అప్పుడే బదిలీ ఉత్తర్వులు విడుదల కావ డంతో వీరపాండ్యన్ విజయవాడ వస్తున్నారంటూ ఐఏఎస్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చనడిచింది.