
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ అన్నారు. ‘పొలాలు బీడు–ఏదీ రైతుకు తోడు’ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సాయం కోసం ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక చేపట్టడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. సీజన్ ప్రారంభానికి నెల రోజులు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐసీఏఆర్, సీఆర్‌ఐడీఏ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆర్బీకే, మండల, జిల్లా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో చర్చించి జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేశామన్నారు.
అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద ఇతర పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు 80 శాతం రాయితీపై విత్తనాలను సిద్దం చేసామన్నారు. జూలై నెలలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుకు సైతం 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేశామన్నారు. ఈ విధంగా ఆర్హత, అవసరం ఉన్న రైతులను గుర్తించి ఆ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించామన్నారు. వ్రర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తారని చెప్పారు.
కాగా.. ఖరీఫ్–2023లో ఇప్పటివరకు సాగైన పంటలను ప్రస్తుత వాతావరణంలో నిలదొక్కుకొని ఆశించిన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన పంట యాజమాన్య పద్ధతులపై జిల్లా రిసోర్స్ సెంటర్స్, కేవీకే, ఏఆర్‌ఎస్, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలతో రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇలా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుంటే.. రైతులను ఆందోళనకు గురిచేసేలా, ప్రభుత్వం బురద జల్లే రీతిలో లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు.