సీఎం ఆశయసాధనకు కార్యరూపం | Kadapa Collector Harikiran Interview In Sakshi | Sakshi
Sakshi News home page

సీఎం ఆశయసాధనకు కార్యరూపం

Published Sun, Jan 5 2020 8:47 AM | Last Updated on Sun, Jan 5 2020 8:47 AM

Kadapa Collector Harikiran Interview In Sakshi

ప్రింటింగ్‌ విధానం గురించి అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ హరికిరణ్, చిత్రంలో సిబ్బంది

సాక్షి, కడప:  ‘‘సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆయన సొంత జిల్లాలో పనిచేయడం మధురానుభూతి’’ అని కలెక్టర్‌ హరికిరణ్‌ పేర్కొన్నారు. ‘కాఫీ విత్‌ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ‘సాక్షి’ యూనిట్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించారు. సిబ్బందిని పలకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

సాక్షి : కొత్త ఏడాది ప్రభుత్వ లక్ష్యాలేమిటి? 
కలెక్టర్‌ : ఈ ఏడాదిలో జిల్లాలోని రైతులందరికీ సాగునీరు అందించడమే ప్రధాన ఎజెండా. వైఎస్‌ హయాంలో నెలకొలి్పన గాలేరు–నగరి సుజల స్రవంతి ఫేజ్‌–2 పనులను రివర్స్‌ టెండరింగ్‌లో ఖరారు చేశాం. పనులను పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తాం. ఫేజ్‌–1లో వామికొండ, సర్వరాయసాగర్‌ పరిధిలో పిల్ల కాలువలను పూర్తి చేస్తాం. 

సాక్షి : గండికోట పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు?
కలెక్టర్‌ : గండికోట ప్రాజెక్టు పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. త్వరలో 20 టీఎంసీలు నిలుపాలన్నది లక్ష్యం. గండికోట పరిధిలో రూ. వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి విడతలో రూ. 140 కోట్లు కేటాయించారు. ముంపు వాసులకు ఈ పరిహారం చెల్లిస్తా.

సాక్షి :  కొత్త ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి చేస్తారు?
కలెక్టర్‌ : కుందూ, తెలుగుగంగ ఎత్తిపోతల, రాజోలి ఆనకట్టల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇటీవలే శంకుస్థాపన చేశారు. 15 కిలోమీటర్ల పొడవున్న రాజోలి బండ్‌ నిర్మాణానికి అవసరమైన 400 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నాం. కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 60 ఎకరాలను సేకరిస్తున్నాం.

సాక్షి :  జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానం  ఎప్పుడు? 
కలెక్టర్‌ : ఈ పథకానికి కూడా సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారు. సర్వే పూర్తి చేసి డీపీఆర్‌ సిద్ధం చేయాల్సి ఉంది. అనంతరం పథకం పనులకు టెండర్లు పిలుస్తాం. చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులకు నీరిస్తాం. 

సాక్షి :  నాడు–నేడు అమలు ఎలా? 
కలెక్టర్‌ : నాడు–నేడు ద్వారా జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడతలో 1048 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి 200 అంచనాలు సిద్ధమయ్యాయి. మరో 900 ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అంచనాలు పూర్తి కాగానే పేరెంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో సోషియల్‌æ కాంట్రాక్టు కింద పనులు చేపడతాం. 

సాక్షి :  పేదలకు వైద్య సేవలు అందించేందుకు తీసుకునే చర్యలు? 
కలెక్టర్‌ : ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 400 సబ్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. 150 సబ్‌ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరో 250 సబ్‌ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. 150 కొత్త సబ్‌ సెంటర్లకు స్థలాలు సేకరిస్తున్నాం. కొత్త భవనాలు నిర్మిస్తాం. 

సాక్షి :  పులివెందుల మెడికల్‌ కళాశాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? 
కలెక్టర్‌ : మెడికల్‌ కళాశాలకు స్థల సేకరణ పూర్తయింది. డిజైన్‌ అయ్యాక టెండర్లు పిలుస్తాం. కడపలో కేన్సర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిమ్స్‌లో స్థలం సిద్ధంగా ఉంది. డిజైన్‌ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. 

సాక్షి :  ఎల్వీ ప్రసాద్‌ ఐ  ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు ఎప్పుడు? 
కలెక్టర్‌ : ఎల్వీ ప్రసాద్‌ ఐ  ఇన్‌స్టిట్యూట్‌కు స్థలం ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రిమ్స్‌ ఎదురుగా 10 ఎకరాల స్థలం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపి రెండు సంవత్సరాల్లో  ఇన్‌స్టిట్యూట్‌ కట్టేలా చర్యలు తీసుకుంటాం.  

సాక్షి :  అభివృద్ధి పనుల సంగతేమిటి? 
కలెక్టర్‌ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో రూ. 30–40 కోట్లతో మురుగు కాలువలను ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నాం. వీటితోపాటు ఒక్కో నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నాం. 

సాక్షి : గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి? 
కలెక్టర్‌ : జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ. 40 లక్షలతో కొత్త భవనాలు, రూ. 30 లక్షలతో పాత భవనాల విస్తరణ, రూ. 25 లక్షలతో పాత భవనంపై కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నాం. ఒక్కొక్క సచివాలయాన్ని 2600 స్కోయర్‌ ఫీట్‌తో నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 280 కొత్త సచివాలయాలు మంజూరు చేశాం. వచ్చే జూలై, ఆగస్టు నాటికి వీటిని పూర్తి చేస్తాం. 

సాక్షి :  పేదల గృహాల మంజూరు ఎప్పుడు? 
కలెక్టర్‌ : జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 1750 ఎకరాలను గుర్తించాం. ఇది 70 వేల మందికి సరిపోతుంది. ఇంకా 350 ఎకరాల స్థలం అవసరం ఉంది.  

సాక్షి :  ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చేయబోతోంది? 
కలెక్టర్‌ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే జమ్మలమడుగు వద్ద స్టీల్‌ ప్లాంటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులు మొదలవుతాయి. రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కొప్పర్తి వద్ద ఈసీ క్లియరెన్స్‌ పూర్తి కాగానే ఆరు వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. 

సాక్షి :  రోడ్ల విస్తరణ ఎప్పుడు మొదలు పెట్టనున్నారు? 
కలెక్టర్‌ : రేణిగుంట–కడప ఫోర్‌లేన్‌ హైవేను కర్నూలు ఫోర్‌లేన్‌ హైవేకు అనుసంధానం చేస్తున్నాం. భూసేకరణ మొదలు పెట్టాం. బెంగుళూరు–పులివెందుల రోడ్డు ముద్దనూరు వరకు విస్తరిస్తున్నాం. 

సాక్షి : కొత్త రైల్వేలైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? 
కలెక్టర్‌ : కడప–బెంగుళూరు రైల్వేలైన్‌ భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం పూర్తయింది. రైతులకు పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపాం. 

సాక్షి :  పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? 
కలెక్టర్‌ : వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలందరికీ ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. జనవరి 3 నుంచి 1259 రకాల వ్యాధులకు, ఏప్రిల్‌ 1 నుంచి క్యాన్సర్‌తోపాటు పలు రకాల తీవ్ర వ్యాధులకు సైతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించనున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 21,550 మంది రోగులకు రూ. 55 కోట్లతో వివిధ రకాల ఆపరేషన్లు చేశాం. అలాగే వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా 15 వేల మందికి కంటి అద్దాలు ఇచ్చాం. మరో రెండు వేల మందికి ఆపరేషన్లు చేయబోతున్నాం. 

సాక్షి :  ఆసరా అమలు తీరు ఎలా ఉంది? 
కలెక్టర్‌ : ఆసరా పథకం ద్వారా 836 జబ్బులతో బెడ్డుమీద ఉన్న వారికి నెలకు రూ. 5000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. 

సాక్షి : జిల్లాలో రూ. ఐదు వేల పెన్షన్‌ ఎవరెవరికి ఇస్తున్నారు? 
కలెక్టర్‌ : లెప్రసీ, పెరాలసిస్‌ స్టేజీ–3, 4, 5, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, రెండు బోదకాలు ఉన్న 15 వేల మందిని గుర్తించాం. వీరందరికీ రూ. 5 వేల పెన్షన్‌ ఇస్తున్నాం. 

సాక్షి : గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? 
కలెక్టర్‌ : జిల్లాలో 8547 గ్రామ సచివాల ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా, 400 పో స్టులు మినహా మిగిలినవన్నీ భర్తీ చేశాం. ఖా ళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నాం.

సాక్షి : సీఎం జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? 
కలెక్టర్‌ : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి పరుగులు పెడుతున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా లక్ష్యాలను సాధిస్తా. ముఖ్యమంత్రి బాటలోనే అంతా ముందుకు సాగుతున్నాం. ఇది మంచి అనుభూతి. ఇక్కడ చేస్తున్న పని జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. 

సాక్షి : ప్రజాప్రతినిధులతో సమన్వయం ఎలా ఉంది? 
కలెక్టర్‌ : వైఎస్సార్‌ జిల్లాలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో మొదలుకొని అందరితో సమన్వయం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి సందేశం. 

సాక్షి : అవినీతి అక్రమాలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? 
కలెక్టర్‌ : పాలనలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇది పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లింది. ఆ దిశగానే అందరం ముందుకు సాగుతున్నాం. కిందిస్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పాలన సాగుతోంది.

సాక్షి : ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? 
కలెక్టర్‌ : ముఖ్యమంత్రి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. మేం చెప్పింది వింటారు. కరెక్ట్‌ అనిపిస్తే వెంటనే నిర్ణయం ఉంటుంది. నేను కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, చంద్రబాబు నాయుడు పాలన చూశాను. ఇలా ఎవరూ ఉండరు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంత నిబద్ధతతో పనిచేసే వారిని నేను చూడలేదు. 

సాక్షి :పెన్షన్లు తొలగిస్తున్నారన్న అపోహ కరెక్టేనా? 
కలెక్టర్‌ : పెన్షన్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నెలకు జిల్లాలో పెన్షన్ల ద్వారా ఇచ్చే మొత్తం రూ. 60–70 కోట్లకు పెరిగింది. వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల 15 వేలకు పైగా కొత్త పెన్షన్లు రానున్నాయి. 

సాక్షి :స్థానిక ఎన్నికల ప్రణాళిక సిద్ధమా? 
కలెక్టర్‌ : జిల్లాలో గత నాలుగైదు ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్‌ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. అదే నిబద్దతతో, నిష్పక్షపాతంగా, పోలీసుల సహకారంతో స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తాం. బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సులు సైతం సిద్ధం చేశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement