ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి
వ్యవసాయ మీటర్లు నిలిపేయాలి
ఏపీ రైతు సంఘం డిమాండ్
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది.
రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది.
రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.
చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలి
రాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment