వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు | Decision of State Level Bankers Committee For agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు

Published Thu, Jun 20 2024 1:37 AM | Last Updated on Thu, Jun 20 2024 1:37 AM

రుణ ప్రణాళిక విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల

రుణ ప్రణాళిక విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం 

2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళిక ఖరారు 

మొత్తం రూ.6.33 లక్షల కోట్ల రుణాలు 

ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు.. రుణ ప్రణాళిక ఆవిష్కరించిన భట్టి విక్రమార్క, తుమ్మల 

బ్యాంకర్లకు మానవీయ కోణం ఉండాలన్న డిప్యూటీ సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. 

బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్‌ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు.  

త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ 
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్‌ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు.  

సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల 
వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. 

వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్‌ పామ్‌ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ కమల్‌ ప్రసాద్‌ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్‌ చింతల, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేశ్‌కుమార్, ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ దేబశిష్‌ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 

రుణాల కేటాయింపులు ఇలా... 
– 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు 
– ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు 
– వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు 
– వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు 
– సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు 
– గృహ రుణాలు రూ.10,768 కోట్లు 
– విద్యా రుణాలు రూ.2,706 కోట్లు 
– ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు 
– 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) 
– మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) 
– పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు)  
– వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement