Bankers Committee
-
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
మూడేళ్లలో రూ.87,877 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతోంది. సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రూ.87,877 కోట్ల మేర బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. 2021 మార్చి నాటికి బ్యాంకుల్లో రూ.3.85 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది జూన్ నాటికి రూ.4.73 లక్షల కోట్లకు పెరిగాయి. పెరిగిన జీవన ప్రమాణాలు.. వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల జీవనోపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మదుపు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతోపాటు జగనన్న పాల వెల్లువ ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తూ జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలు సాధికారతతో తమ కాళ్లపై నిలబడేలా వివిధ వ్యాపార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ కార్యక్రమాలతో 2021 మార్చి నుంచి ఏటా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో విశాఖలో అత్యధికంగా డిపాజిట్లు ఉండగా నూతన జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా డిపాజిట్లున్నాయి. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
మారుమూల పల్లెల్లోనూ బ్యాంకులు!
సాక్షి, విశాఖపట్నం: మారుమూల పల్లెల్లోనూ బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లకు మించి బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాలు 186 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ గుర్తించింది. ఆ జాబితాను స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి సమర్పించింది. దీనిపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఎస్ఎల్బీసీ సన్నద్ధమవుతోంది. మూడు వేల లోపు, ఆ పైన జనాభా కలిగిన గ్రామాల్లో బ్యాంకు శాఖల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సంబంధిత జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్ల (ఎల్డీఎం)కు సూచించింది. దీనికి అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల వారీగా ఆయా లీడ్ బ్యాంకులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, పల్నాడు, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ 186 గ్రామాలున్నాయి. వీటిలో ఎక్కువ గ్రామాలు అల్లూరి, మన్యం, కాకినాడ, పల్నాడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. తొలి దశలో 11 పల్లెల్లో.. తొలి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మారుమూల పల్లెల్లో కొత్తగా బ్యాంకు శాఖలు (ఏపీజీవీబీ–2, బ్యాంక్ ఆఫ్ బరోడా–1, కెనరా బ్యాంకు–1, డీసీసీబీ–1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–3, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–3 చొప్పున) ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సూచించింది. అయితే వీటిలో ఇప్పటివరకు ఏపీజీవీబీ (రాజవొమ్మంగి/లబ్బర్తి), బ్యాంక్ ఆఫ్ బరోడా (మారేడుమిల్లి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎటపాక), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొయ్యూరు)ల్లో శాఖలను ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో జనాభా ఆధారంగా బ్యాంకు సేవలు అందని ఆరు గ్రామాల్లో బ్యాంకు శాఖలు తెరవాలని ఆ జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (జియ్యమ్మవలస–బొమ్మిక), బ్యాంక్ ఆఫ్ బరోడా (కొమరాడ–గంగిరేగులవలస), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కురుపాం–మొండెంకల్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (పాచిపెంట–మత్తుమూరు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (పాచిపెంట–పి.కోనవలస), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (భావిుని–గురండి) ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సత్వరమే కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సంబంధిత బ్యాంకు యాజమాన్యాలను కోరింది. మూడు వేలకు పైగా జనాభా.. మరోవైపు మూడు వేలకు పైగా జనాభా కలిగి ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సేవలకు నోచుకోని గ్రామాల్లోనూ కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) ఎస్ఎల్బీసీకి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రంలో అలాంటి గ్రామాలు 21 వరకు ఉన్నాయని 26 మంది ఎల్డీఎంలు ఎస్ఎల్బీసీకి నివేదించారు. -
కొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకుల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లీడ్ బ్యాంకులను కేటాయించింది. వీటికి లీడ్ జిల్లా మేనేజర్లను నియమించాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. జిల్లాల వారీగా ఆయా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా కార్యాలయాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరింది. ఈ మేనేజర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాల అమలు, వాటి సమన్వయ బాధ్యతను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయాలకు అవసరమైన నైపుణ్య సిబ్బందితో పాటు కంప్యూటర్లను ఏర్పాటుచేయాలని ఇటీవల బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆయా బ్యాంకులకు సూచించింది. నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని లీడ్ జిల్లా మేనేజర్లుగా నియమించాలని కోరింది. నైపుణ్య సిబ్బంది కొరత ఉంటే ఆ సేవలను బయట నుంచి పొందడానికి అనుమతిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. జిల్లాల్లో వివిధ బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన నిమిత్తం సమావేశాలు నిర్వహించేందుకు, వాటికి హాజరయ్యేందుకు వీలుగా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా వాహనాలూ సమకూర్చాల్సిందిగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించింది. -
బ్యాంకుల వద్ద నిరసనలకు పిలుపునిస్తా
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంట రుణాల లక్ష్యంలో రూ.ఏడు వేల కోట్లు తక్కువగా ఇచ్చినట్లు బ్యాంకర్ల కమిటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు బుధవారం 204వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీలో రూ.42,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.2,272 కోట్లు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు వివరించారు. కౌలు రైతులకు రూ.7,500 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. సెప్టెంబర్ వరకు రూ.3,367 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1,01,564 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి త్రైమాసికంలో రూ.31,007 కోట్లు అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రుణాల లక్ష్యంలో 30.53 శాతాన్ని అధిగమించినట్లు బ్యాంకర్లు తెలిపారు. ‘పసుపు–కుంకుమ’ పథకం కింద (అప్పుగా ఇచ్చే రూ.10 వేలు) నగదును లబ్ధిదారులకు 15వ తేదీలోగా చెల్లించాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. చివరి విడతగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒకొక్కరికి రూ.2 వేల చొప్పున.. మొత్తం రూ.1,814.82 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. త్వరగా నగదు పంపిణీని పూర్తి చేయకుంటే బ్యాంకుల దగ్గర నిరసన తెలపాల్సిందిగా స్వయం సహాయక సంఘ సభ్యులకు పిలుపునిస్తానని సీఎం హెచ్చరించారు. తిత్లీ బాధితులకు పరిహారం సవ్యంగా అందేలా, అవసరమైన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలని సీఎం బ్యాంకర్లకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతంలో పాడైపోయిన కరెన్సీ నోట్ల స్థానంలో కొత్తవి ఇవ్వాలని, పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. విదేశీ విరాళాల కోసం ఇంటర్నేషనల్ గేట్‌వే ఏర్పాటుకు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. బీజేపీపై దాడిని పెంచండి బీజేపీపై దాడిని మరింత ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై బీజేపీ నాయకులు తనపైనా, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని, అవసరమైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారిపై ఫిర్యాదులు చేయాలని సూచించారు. ప్రతి వేదికపైనా బీజేపీని విమర్శించడమే పనిగా మాట్లాడాలని, దీనివల్లే పార్టీకి ఉపయోగం ఉంటుందన్నారు. సీబీఐలో జరుగుతున్న వ్యవహారాలను ఉదాహరణగా చూపి ప్రధానిపై విమర్శలు చేయాలని సూచించారు. నవంబర్ 11న చెన్నయ్‌లో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీబీఐలో పరిణామాలపై ప్రధాని సమాధానం చెప్పాలి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి జాతికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. సీబీఐలో నెలకొన్న పరిణామాలను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ నేతలు ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చబోయి తప్పుమీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిని దాడులతో భయపెట్టాలని చూస్తోందని, సీబీఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి విధుల నుంచి తొలగించడం చూస్తే బీజేపీ పాలనలో ఏ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయడంలేదనిపిస్తోందని పేర్కొన్నారు. అర్ధరాత్రి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన విధానం చూస్తే.. ఈ ప్రభుత్వం తమను ప్రశ్నించిన, నిష్పక్షపాతంగా వ్యవహరించిన ఏ వ్యవస్థనూ బతకనీయదనిపిస్తోందని తెలిపారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పని పేర్కొన్నారు. ఏ చట్టం కింద, ఏ అధికారం కింద సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు కృతజ్ఞులై ఉండాలి ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతగా 2019 ఎన్నికల వరకు డ్వాక్రా మహిళలు నా గురించే ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను ఎన్నికల్లో విజయం సాధించని పక్షంలో మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వారిని బెదిరించారు. ‘మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు రూ.10 వేలు ఇచ్చారో లేదో గానీ, మీ అన్నగా ప్రతి ఒక్కరికి పది వేలు ఇచ్చాను’ అని అన్నారు. ప్రభుత్వం పసుపు– కుంకుమ పథకం (అప్పుగా ఇచ్చే రూ.10 వేలు) అమలు చేసినందుకు కృతజ్ఞతగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద సన్మాన కార్యక్రమం జరిగింది. వాస్తవంగా ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్వాక్రా సంఘాల రుణాన్ని మాఫీ చేయలేదు. ఇటీవల మంత్రి సునీత అసెంబ్లీలో అధికారికంగా దీనిపై లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. అయితే, రుణమాఫీ హామీ బదులు ప్రభుత్వం ప్రతి మహిళలకు రూ. 10 వేల చొప్పున నాలుగు విడతల్లో నిధులు ఇచ్చింది. ఈ డబ్బులను మహిళలు తీసుకొని వాడుకుంటే దానిని అప్పుగా పరిగణిస్తామంటూ 2015లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ సీఎంకు సన్మానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రెండు ప్రభుత్వ విభాగాలు 11 జిల్లాల నుంచి 400 మంది డ్వాక్రా మహిళలను విజయవాడకు తరలించాయి. తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ.. డ్వాక్రా మహిళలు, వారి భర్తలు, వారి పిల్లలతో కలిసి 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 175 చోట్లా తమ ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే వాళ్లు తాను చెప్పిన మాట వింటారని.. లేకపోతే, వాళ్ల మాట తాను వినాల్సి ఉంటుందని చెప్పారు. నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారు దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమాజంలో అశాంతి, అభద్రత ఏర్పడిందని, బీజేపీ పద్ధతి లేని రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. గత నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారని ఆరోపించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీబీఐతో సహా అన్ని సంస్థలను బీజేపీ గందరగోళం చేసిందని, ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. కేంద్రాన్ని కాచుకుంటూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 31 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ఈ నెల 31వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని, ఇప్పుడున్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉపయోగించాలో అక్కడ వినియోగించుకుంటామని, అప్పజెప్పిన పనులు సంబంధిత వ్యక్తులు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు మనదే కావాలని, గెలిస్తేనే అనుకున్న అభివృద్ధి సాధించగలమన్నారు. మిషన్–2019 ఎలక్షన్ మన లక్ష్యమని, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని, మిగిలిన వారిని వేరే విధంగా వినియోగిస్తామని చెప్పారు. గ్రామ వికాసం 31.6 శాతం మాత్రమే జరిగిందని, మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి చేయాలన్నారు. లక్షమంది సేవామిత్రలకు నవంబర్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఓటర్ల నమోదును ముమ్మరం చేయాలని చంద్రబాబు చెప్పారు. కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో బొల్లినేని కృష్ణయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఖరీఫ్, రబీ రుణ లక్ష్యం రూ.30,435 కోట్లు
* దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.13,009 కోట్లు * రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కసరత్తు దాదాపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఈసారి ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాల మంజూరు లక్ష్యం రూ.30,435 కోట్లుగా ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తుది కసరత్తు చేస్తోంది. నాబార్డు ప్రతిపాదనల ప్రకారం ఈ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసినట్లు ఎస్ఎల్బీసీ వర్గాలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రుణ లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా... ఈసారి రూ.2,635 కోట్లు అదనంగా నిర్ణయించారు. ఇక దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, అనుబంధ రుణాల లక్ష్యాన్ని రూ.13,009 కోట్లుగా నిర్ధారించారు. గతేడాది దీర్ఘకాలిక రుణాల లక్ష్యం రూ.7,494.30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే ఈసారి దీర్ఘకాలిక రుణ లక్ష్యాన్ని పెంచుతున్నారని ఎస్ఎల్బీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే పంట రుణాలతో బ్యాంకులకు అనేక తలనొప్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ అంటూ ప్రభుత్వాలు అనేక పథ కాలు ప్రకటించడంతో తమకు ఆర్థికపరమైన చిక్కులు వస్తున్నాయనేది బ్యాంకర్ల ప్రధాన ఆరోపణ. అంతేకాదు పంట పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా రుణాలు పూర్తిగా వసూలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అందువల్లే పంట రుణాలను వీలైనంత తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బోర్లు, బావులు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం తీసుకొనే దీర్ఘకాలిక రుణాలకు ప్రభుత్వ పథకాలేవీ వర్తింప చేయడంలేదు. పైగా మధ్య స్థాయి, ధనిక రైతులే ఎక్కువగా దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటారు. కాబట్టి వారి నుంచి వసూలు చేసుకోవడం ఇబ్బందేమీ కాదని, అందుకే దీర్ఘకాలిక రుణాలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరువులో మొండిచెయ్యి.. రాష్ట్రంలో ఓవైపు కరువు విలయ తాండ వం చేస్తోంటే... మరోవైపు బ్యాంకులు రుణాల్వికుండా చేతులెత్తేశాయి. 2015-16లో తెలంగాణలో పంట రుణ లక్ష్యం రూ.27,800 కోట్లుకాగా.. ఇచ్చింది రూ.17,492 కోట్లే (62.92%)నని ఎస్ఎల్బీసీ నివేదికే తెలియజేసింది. అందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.18,092.68 కోట్లకుగాను రూ. 12,938.74 కోట్లు (71.51%)... రబీ లక్ష్యం రూ.9,707.48 కోట్లకుగాను రూ.4,553.56 కోట్లు (46.91శాతం) ఇచ్చారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు పెరగడం గమనార్హం. 2015-16లో దీర్ఘకాలిక రుణ లక్ష్యం రూ.7,494.30 కోట్లు కాగా... బ్యాంకులు రూ.5,541.67 కోట్లు (73.95%) ఇచ్చాయి. -
మాఫీపై స్పష్టత ఇవ్వండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన బ్యాంకర్లు మాఫీకి బ్యాంకులు సహకరించాలనే విజ్ఞప్తితో సరిపెట్టిన ఆర్థిక మంత్రి {పభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు చెల్లించలేదన్న బ్యాంకర్లు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపైనా స్పష్టతకు విజ్ఞప్తి బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ బాగా పడిపోరుుందని ఆందోళన మాఫీ ప్రక్రియ విధివిధానాలపై నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం కేవలం నివేదిక సమర్పణకే పరిమితమైన ఎస్ఎల్బీసీ భేటీ ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు చెల్లించలేదన్న బ్యాంకర్లు హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీపై.. మంగళవారం నాటి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ప్రకటించడంతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడానికి ముందుకు రావడం లేదని, తద్వారా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రుణ మాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కేవలం రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలన్న విజ్ఞప్తితో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సరిపెట్టారు. 186వ ఎస్ఎల్బీసీ సమావేశం ఆంధ్రా బ్యాంక్ కేంద్ర కార్యాలయం పట్టాభి భవన్లో జరిగింది. సమావేశానికి ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె.కల్రా అధ్యక్షత వహించారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ సి.దొరస్వామి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర ఆర్థిక శాఖ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసరావు, ఆర్బీఐ రీజినల్ డెరైక్టర్ కె.ఆర్.దాస్, నాబార్డ్ సీజీఎం జిజి మెమ్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ పడిపోయిందనే విషయాన్ని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా తన 10 నిమిషాల ప్రసంగంలో ఐదుసార్లు ప్రస్తావించారు. రుణమాఫీకి సహకరించాలి: యనమల రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ఆర్థిక మంత్రి కోరారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం బ్యాంకర్లతో చర్చించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎస్ఎల్బీసీ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా రుణమాఫీ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినా ఇప్పటివరకు కేవలం 38 శాతమే రుణ వితరణ జరిగిందని, కనీసం రబీ సీజన్లో అయినా మెరుగ్గా రుణాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు లక్ష్యం రూ.25,888 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.5,593 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏపీ పరిస్థితి తారుమారరుు్యంది: కల్రా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద లక్ష్యానికి మించి ఖాతాలు తెరవడంలో బ్యాంకులు విజయం సాధించాయని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా చెప్పారు. మరోవైపు రుణాల మంజూరులో అధికభాగంగా ఉండే వ్యవసాయ రుణాల వితరణలో బ్యాంకులు విఫలమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఆశతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడం/రెన్యువల్ చేసుకోవడానికి విముఖత చూపించడం వల్లే బ్యాంకుల వ్యాపార పరిమాణం తగ్గిపోయిందని చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 56,019 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7,263 కోట్లు(12.97 శాతం) మాత్రమే ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని అధిగమించే రాష్ట్రంగా ఏపీకి పేరుందని, కానీ ఈ ఏడాది పరిస్థితులు తారుమారయ్యాయని, ఫలితంగా రైతులతో పాటు బ్యాంకులకూ నష్టం కలిగిందన్నారు. వ్యవసాయ రుణాలు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ)గా మారడంతో బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతినడంతో పాటు బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాల సమగ్ర సమాచారాన్ని అక్టోబర్ 10కి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు కింద కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో తిరిగే 30 రైళ్లపై రాతల ద్వారా ప్రచారం చేయనున్నట్లు నాబార్డు సీజీఎం తెలిపారు. వడ్డీ లేని రుణాలపై విధానమేంటో చెప్పండి వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని ఎస్ఎల్బీసీ కన్వీనర్ దొరస్వామి కోరారు. ఖరీఫ్ 2013-14కు సంబంధించి పంట రుణాలకు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ అమలు జరిగిందని, అరుుతే రబీకి సంబంధించి ఎలాం టి నిర్ణయం వెలువరించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించకుంటే రైతులతో పాటు ప్రభుత్వంపైనా భారం పడుతుందన్నారు. అయితే దీనిపై మంత్రు లు యనమల, ప్రత్తిపాటి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. -
ఎక్కడ ఏ పంట వేశారో ఎలా చెప్పగలం?
స్పష్టం చేసిన ఎస్ఎల్బీసీ వెనక్కు తగ్గిన సర్కారు ఆన్లైన్ ఫార్మాట్లో మళ్లీ మార్పులు! హైదరాబాద్ ఏ పంట వేశారనే వివరాలను చెప్పడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. : రైతులు ఏ సర్వే నంబర్లో దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సంబంధిత ఫార్మాట్ నుంచి ఆ అంశాన్ని తొలగించింది. రైతులు బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాల మాఫీకి సంబంధించి.. ఏ సర్వే నంబర్లో ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారో వివరించాలని సూచిస్తూ ఆ మేరకు ఆన్లైన్ ఫార్మాట్లో పొందుపరిచారు. అయితే రెండురోజుల క్రితం ఆర్థిక శాఖ జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపైనే చాలాసేపు చర్చ జరిగింది. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారనేది రైతులకే తెలియదని, అలాంటి సమాచారం తాము ఏ విధంగా ఇవ్వగలమని బ్యాంకర్లు పేర్కొన్నారు. తమ భూమిలో ఒకపక్క ఒక పంట, మరోపక్క మరో పంట వేసినట్లు రైతులకు తెలుసునని, సర్వే నంబర్ల వారీగా అంటే మాత్రం రైతులే చెప్పలేరని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు. ఆన్లైన్ ఫార్మాట్లో ఆ అంశాన్ని పూరిస్తే గానీ మిగతా సమాచారం సైతం ప్రభుత్వానికి రాదని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాట్ నుంచి సదరు అంశాన్ని తొలగిస్తూ అందులో మార్పులను చేసింది. ఏ బ్యాంకు నుంచీ చేరని సమాచారం ఇప్పటివరకు ఏ బ్యాంకు నుంచి కూడా పూర్తి స్థాయిలో రుణాల వివరాలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్ ఫార్మాట్లో ప్రత్యేక వెబ్‌సైట్‌కు చేరలేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం రోజుకో, రెండురోజులకో ఒకసారి కొత్త కొత్త షరతులు విధిస్తూ, అందుకు అనుగుణంగా ఆన్లైన్ ఫార్మాట్లో మార్పులు చేయడమేనని బ్యాంకర్లు అంటున్నారు. ఆగస్టు 14వ తేదీన రుణ మాఫీ మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం.. 14 రోజుల్లో మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రుణాల వివరాలను అందజేయాలని పేర్కొంది. ఆ 14 రోజులు ముగిసిన తరువాత ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ఆ మార్పుల మేరకు ఆన్లైన్ ఫార్మాట్‌ను రూపొందించారు. ఈ నెల 15వ తేదీలోగా సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సూచించారు. తిరిగి 15వ తేదీన బంగారం రుణాల మాఫీకి సంబంధించి ఏ సర్వే నంబర్లో ఏ పంట వంటి కొత్తగా మరో మూడు షరతులను విధిస్తూ అందుకు అనుగుణంగా ఆన్లైన్ ఫార్మాట్లో మార్పులు చేసింది. ఈ నెల 25వ తేదీలోగా తాజా మార్పులకు అనుగుణంగా రైతుల రుణ వివరాలను అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. తాజాగా రైతులు ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారనే వివరాలు ఇవ్వలేమని బ్యాంకర్లు స్పష్టం చేయడంతో సోమవారం మళ్లీ ఫార్మాట్లో మార్పులు చేసింది. అందుకు అనుగుణంగా బ్యాంకర్లు వివరాలను అందజేయాల్సి ఉంది. -
పేదల కోసమే... జనధన యోజన
ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఖాతా ఇంటిల్లిపాదికీ రూ. లక్ష ప్రమాదబీమా కలెక్టర్ రఘునందన్‌రావు విజయవాడ : ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతాను ప్రారంభించే విధంగా ప్రధానమంత్రి జనధన యోజనను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం రఘునందన్‌రావు సూచించారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సబ్- కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రధానమంత్రి జనధన యోజనను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ధన యోజనను ప్రవేశపెట్టారని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 60 వేల బ్యాంకు ఖాతాలు తెరిచే లక్ష్యానికిగానూ 75 వేలకు పైగా ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో బ్యాంకింగ్ లావాదేవీలు ధనికులకు మాత్రమే పరిమితమయ్యేవని, ప్రస్తుత ఆర్థిక విధానంలో పేదవారికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సైతం సంపూర్ణ ఆర్థిక చేకూర్పులో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఖాతాదారునికి వారు జమచేసిన మొత్తానికి వడ్డీ అందుతుందని, లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నట్లుగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అవసరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని రకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే నిర్వహిస్తారన్నారు. సామాన్య ప్రజలు నగదును తమవద్ద ఉంచుకోకుండా బ్యాంకు ఖాతాలో దాచుకోవడం వల్ల భద్రత ఏర్పడుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అన్నారు. ఇండియన్ బ్యాంక్ డీజీఎం, లీడ్ బ్యాంక్ కన్వీనర్ ఎంఆర్ రఘునాథరావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రతి ఇంటిలో రెండు బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడి, రాజమండ్రి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బిజినెస్ కరస్పాండెంట్లు గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలను ఏ విధంగా నిర్వహిస్తారో డెమో ద్వారా వివరించారు. ఖాతాలను తెరచిన ఖాతాదారులకు బ్యాంకు పాసు పుస్తకాలను కలెక్టర్, జేసీ, బ్యాంకు అధికారులు అందజేశారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఆర్వి.నరసింహారావు, నాబార్డు ఏజీఎం మధుమూర్తి, బ్యాంక్ కంట్రోలింగ్ ఆఫీసర్లు, బ్యాంకింగ్, బీమా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.