సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంట రుణాల లక్ష్యంలో రూ.ఏడు వేల కోట్లు తక్కువగా ఇచ్చినట్లు బ్యాంకర్ల కమిటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు బుధవారం 204వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీలో రూ.42,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.2,272 కోట్లు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు వివరించారు. కౌలు రైతులకు రూ.7,500 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. సెప్టెంబర్ వరకు రూ.3,367 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1,01,564 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి త్రైమాసికంలో రూ.31,007 కోట్లు అందించినట్లు తెలిపారు.
వ్యవసాయ రుణాల లక్ష్యంలో 30.53 శాతాన్ని అధిగమించినట్లు బ్యాంకర్లు తెలిపారు. ‘పసుపు–కుంకుమ’ పథకం కింద (అప్పుగా ఇచ్చే రూ.10 వేలు) నగదును లబ్ధిదారులకు 15వ తేదీలోగా చెల్లించాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. చివరి విడతగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒకొక్కరికి రూ.2 వేల చొప్పున.. మొత్తం రూ.1,814.82 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. త్వరగా నగదు పంపిణీని పూర్తి చేయకుంటే బ్యాంకుల దగ్గర నిరసన తెలపాల్సిందిగా స్వయం సహాయక సంఘ సభ్యులకు పిలుపునిస్తానని సీఎం హెచ్చరించారు. తిత్లీ బాధితులకు పరిహారం సవ్యంగా అందేలా, అవసరమైన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలని సీఎం బ్యాంకర్లకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతంలో పాడైపోయిన కరెన్సీ నోట్ల స్థానంలో కొత్తవి ఇవ్వాలని, పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. విదేశీ విరాళాల కోసం ఇంటర్నేషనల్ గేట్‌వే ఏర్పాటుకు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు.
బీజేపీపై దాడిని పెంచండి
బీజేపీపై దాడిని మరింత ముమ్మరం చేయాలని మంత్రులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై బీజేపీ నాయకులు తనపైనా, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని, అవసరమైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారిపై ఫిర్యాదులు చేయాలని సూచించారు. ప్రతి వేదికపైనా బీజేపీని విమర్శించడమే పనిగా మాట్లాడాలని, దీనివల్లే పార్టీకి ఉపయోగం ఉంటుందన్నారు. సీబీఐలో జరుగుతున్న వ్యవహారాలను ఉదాహరణగా చూపి ప్రధానిపై విమర్శలు చేయాలని సూచించారు. నవంబర్ 11న చెన్నయ్‌లో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సీబీఐలో పరిణామాలపై ప్రధాని సమాధానం చెప్పాలి
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి జాతికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. సీబీఐలో నెలకొన్న పరిణామాలను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ నేతలు ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చబోయి తప్పుమీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిని దాడులతో భయపెట్టాలని చూస్తోందని, సీబీఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి విధుల నుంచి తొలగించడం చూస్తే బీజేపీ పాలనలో ఏ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయడంలేదనిపిస్తోందని పేర్కొన్నారు. అర్ధరాత్రి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన విధానం చూస్తే.. ఈ ప్రభుత్వం తమను ప్రశ్నించిన, నిష్పక్షపాతంగా వ్యవహరించిన ఏ వ్యవస్థనూ బతకనీయదనిపిస్తోందని తెలిపారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పని పేర్కొన్నారు. ఏ చట్టం కింద, ఏ అధికారం కింద సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నాకు కృతజ్ఞులై ఉండాలి
ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతగా 2019 ఎన్నికల వరకు డ్వాక్రా మహిళలు నా గురించే ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను ఎన్నికల్లో విజయం సాధించని పక్షంలో మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వారిని బెదిరించారు. ‘మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు రూ.10 వేలు ఇచ్చారో లేదో గానీ, మీ అన్నగా ప్రతి ఒక్కరికి పది వేలు ఇచ్చాను’ అని అన్నారు. ప్రభుత్వం పసుపు– కుంకుమ పథకం (అప్పుగా ఇచ్చే రూ.10 వేలు) అమలు చేసినందుకు కృతజ్ఞతగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద సన్మాన కార్యక్రమం జరిగింది. వాస్తవంగా ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు.
నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్వాక్రా సంఘాల రుణాన్ని మాఫీ చేయలేదు. ఇటీవల మంత్రి సునీత అసెంబ్లీలో అధికారికంగా దీనిపై లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. అయితే, రుణమాఫీ హామీ బదులు ప్రభుత్వం ప్రతి మహిళలకు రూ. 10 వేల చొప్పున నాలుగు విడతల్లో నిధులు ఇచ్చింది. ఈ డబ్బులను మహిళలు తీసుకొని వాడుకుంటే దానిని అప్పుగా పరిగణిస్తామంటూ 2015లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ సీఎంకు సన్మానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రెండు ప్రభుత్వ విభాగాలు 11 జిల్లాల నుంచి 400 మంది డ్వాక్రా మహిళలను విజయవాడకు తరలించాయి. తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ.. డ్వాక్రా మహిళలు, వారి భర్తలు, వారి పిల్లలతో కలిసి 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 175 చోట్లా తమ ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే వాళ్లు తాను చెప్పిన మాట వింటారని.. లేకపోతే, వాళ్ల మాట తాను వినాల్సి ఉంటుందని చెప్పారు.
నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారు
దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమాజంలో అశాంతి, అభద్రత ఏర్పడిందని, బీజేపీ పద్ధతి లేని రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. గత నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారని ఆరోపించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జిలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీబీఐతో సహా అన్ని సంస్థలను బీజేపీ గందరగోళం చేసిందని, ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. కేంద్రాన్ని కాచుకుంటూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
31 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు
ఈ నెల 31వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని, ఇప్పుడున్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉపయోగించాలో అక్కడ వినియోగించుకుంటామని, అప్పజెప్పిన పనులు సంబంధిత వ్యక్తులు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు మనదే కావాలని, గెలిస్తేనే అనుకున్న అభివృద్ధి సాధించగలమన్నారు. మిషన్–2019 ఎలక్షన్ మన లక్ష్యమని, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని, మిగిలిన వారిని వేరే విధంగా వినియోగిస్తామని చెప్పారు. గ్రామ వికాసం 31.6 శాతం మాత్రమే జరిగిందని, మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి చేయాలన్నారు. లక్షమంది సేవామిత్రలకు నవంబర్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఓటర్ల నమోదును ముమ్మరం చేయాలని చంద్రబాబు చెప్పారు. కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో బొల్లినేని కృష్ణయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment