ఖరీఫ్, రబీ రుణ లక్ష్యం రూ.30,435 కోట్లు
* దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.13,009 కోట్లు
* రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కసరత్తు దాదాపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంట రుణాల మంజూరు లక్ష్యం రూ.30,435 కోట్లుగా ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తుది కసరత్తు చేస్తోంది. నాబార్డు ప్రతిపాదనల ప్రకారం ఈ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసినట్లు ఎస్‌ఎల్‌బీసీ వర్గాలు తెలిపాయి. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో రుణ లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా... ఈసారి రూ.2,635 కోట్లు అదనంగా నిర్ణయించారు. ఇక దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, అనుబంధ రుణాల లక్ష్యాన్ని రూ.13,009 కోట్లుగా నిర్ధారించారు.
గతేడాది దీర్ఘకాలిక రుణాల లక్ష్యం రూ.7,494.30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే ఈసారి దీర్ఘకాలిక రుణ లక్ష్యాన్ని పెంచుతున్నారని ఎస్‌ఎల్‌బీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే పంట రుణాలతో బ్యాంకులకు అనేక తలనొప్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ అంటూ ప్రభుత్వాలు అనేక పథ కాలు ప్రకటించడంతో తమకు ఆర్థికపరమైన చిక్కులు వస్తున్నాయనేది బ్యాంకర్ల ప్రధాన ఆరోపణ. అంతేకాదు పంట పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా రుణాలు పూర్తిగా వసూలయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
అందువల్లే పంట రుణాలను వీలైనంత తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బోర్లు, బావులు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం తీసుకొనే దీర్ఘకాలిక రుణాలకు ప్రభుత్వ పథకాలేవీ వర్తింప చేయడంలేదు. పైగా మధ్య స్థాయి, ధనిక రైతులే ఎక్కువగా దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటారు. కాబట్టి వారి నుంచి వసూలు చేసుకోవడం ఇబ్బందేమీ కాదని, అందుకే దీర్ఘకాలిక రుణాలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరువులో మొండిచెయ్యి..
రాష్ట్రంలో ఓవైపు కరువు విలయ తాండ వం చేస్తోంటే... మరోవైపు బ్యాంకులు రుణాల్వికుండా చేతులెత్తేశాయి. 2015-16లో తెలంగాణలో పంట రుణ లక్ష్యం రూ.27,800 కోట్లుకాగా.. ఇచ్చింది రూ.17,492 కోట్లే (62.92%)నని ఎస్‌ఎల్‌బీసీ నివేదికే తెలియజేసింది. అందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.18,092.68 కోట్లకుగాను రూ. 12,938.74 కోట్లు (71.51%)... రబీ లక్ష్యం రూ.9,707.48 కోట్లకుగాను రూ.4,553.56 కోట్లు (46.91శాతం) ఇచ్చారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు పెరగడం గమనార్హం. 2015-16లో దీర్ఘకాలిక రుణ లక్ష్యం రూ.7,494.30 కోట్లు కాగా... బ్యాంకులు రూ.5,541.67 కోట్లు (73.95%) ఇచ్చాయి.