మూడో వంతు రైతులకే రుణాలు | One third of the farmers got loans | Sakshi
Sakshi News home page

మూడో వంతు రైతులకే రుణాలు

Published Sun, Aug 6 2017 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మూడో వంతు రైతులకే రుణాలు - Sakshi

మూడో వంతు రైతులకే రుణాలు

► 36 లక్షల మందిలో 12 లక్షల మందికే పంట రుణాలు
► ఖరీఫ్‌ మొదలై రెండు నెలలైనా పట్టించుకోని బ్యాంకులు
► చేసేదిలేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్న రైతన్నలు


సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి కన్నెర్ర.. బ్యాంకర్ల చిన్న చూపు రైతులను కుంగదీస్తున్నాయి. ఓవైపు వర్షాలు రాక వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటం.. మరోవైపు పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకి నాశనం చేస్తుంటే కాపాడుకోలేని నిస్సహాయ దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

పంటలకు పురుగు మందులు, ఎరువులు కొనాలంటే బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మూడో వంతు మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఖరీఫ్‌లో ప్రతీ ఏడాది సరాసరి 36 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు కేవలం మూడో వంతు అంటే 12.42 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలిచ్చాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ పంట రుణ లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా, జూలై 31 నాటికి బ్యాంకులు రూ.10,514 కోట్లే రుణాలిచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

సర్కారు బకాయిలు రూ.271 కోట్లు
మరోవైపు బ్యాంకర్లు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాల బకాయిలు రూ.271 కోట్లు ఇంకా విడుదల చేయలేదని మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం మంజూరు చేసినా ఆ సొమ్ము ఇప్పటికీ విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల నిర్లిప్తత రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులకు పంట రుణాలు మంజూరు చేసినా బ్యాంకుల్లో కరెన్సీ లేక డబ్బు చేతికి ఇవ్వడం లేదు. రైతు ఖాతాల్లోనే ఆ రుణ నగదును జమ చేసి వట్టి చేతులతో పంపిస్తున్నారు. దీంతో రైతులు ఆ నగదు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.


23,851  కోట్ల రూపాయలు   –  ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ పంట రుణ లక్ష్యం
10,514 కోట్ల రూపాయలు జూలై 31 నాటికి బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు
80.42  లక్షల ఎకరాలు –  రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైంది

వడ్డీ చెల్లించాల్సిందే..
రాష్ట్రంలో ఇప్పటివరకు 80.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 43.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 3.95 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 10.70 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తం ఖరీఫ్‌ పంటల సాగు 74 శాతం పూర్తి కాగా, అందులో పత్తి పంట విస్తీర్ణం 104 శాతానికి చేరుకుంది.

అయితే ఈ స్థాయిలో పంటల సాగు జరిగితే రుణాలు మాత్రం సగానికి కూడా చేరుకోలేదు. పైగా రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకం అమలవుతున్నా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. కొత్త రుణం సంగతి దేవుడెరుగు, తీసుకున్న రుణాలకు వడ్డీ వసూలు చేస్తూ పీడిస్తు న్నాయి. కొన్నిచోట్ల కొత్త రుణం ఇస్తూనే, ఆ రుణం సొమ్ము నుంచే వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో బ్యాంకులకు నచ్చజెప్పడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement