సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఖరీఫ్, రబీతో కలిపి బ్యాంకర్లు రైతులకు లక్ష్యాన్ని మించి పంట రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్మును కూడా చెల్లిస్తామని ప్రకటించడంతో బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేశాయి. నిజానికి గత ఏడాది ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.51,240 కోట్లు కాగా.. రూ.51,511 కోట్లను అందించాయి. అలాగే.. గత రబీలో పంట రుణాలు రూ.32,760 కోట్లకుగాను రూ.37,762 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 115.27 శాతం. మొత్తం వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది రూ.1,15,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,13,997 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 99.13 శాతం.
సర్కారు దన్నుతో రుణాలకు బ్యాంకుల ఆసక్తి
ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ కలిపి రూ.94,524 కోట్లు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.18,323 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. అలాగే, ఖరీఫ్, రబీ కలిపి వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.34,036 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.1,639 కోట్లను మంజూరు చేశాయి. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకులు కూడా పంట రుణాలను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.
గత ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు
Published Mon, Aug 3 2020 4:39 AM | Last Updated on Mon, Aug 3 2020 4:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment