రైతులకు రూ.13 వేల కోట్ల పంట రుణాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని రైతులకు పంట రుణాల రూపంలో రూ.13వేల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తాజా రబీ సీజన్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతులు పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తరలించేందుకు సదుపాయాలు కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
రైతుకు ప్రయోజనం కలిగించే ఫసల్ బీమా పథకం కింద రాష్ట్రంలో 25 లక్షల మందికిగాను 8 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ స్వస్థత కార్డులు 31 శాతం మందికే జారీ అయ్యాయని, ఈ ప్రక్రియపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉత్పత్తిని పెంచాలని, ప్రస్తుతం రూ.40 వేల కోట్ల నూనె, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే శిశు కేటగిరీలో లక్ష్యాలను పెంచి ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.