చిన్న గిడ్డన్న (ఫైల్), రాజేశ్వరరెడ్డి (ఫైల్), మల్లయ్య (ఫైల్)
గోనెగండ్ల/ నందికొట్కూరు/ గూడూరు రూరల్/ బొమ్మనహాళ్: వరుస పంట నష్టాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాల క్షేపం చేస్తోంది. దీంతో దిక్కుతోచని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనంతపురంలో మరొకరు తనువు చాలించారు. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపడుతున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన బెస్త మల్లయ్యకు(58) ఐదెకరాల పొలం ఉంది. వర్షాభావంతో నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర లభించలేదు. ఈ ఏడాదీ వేసిన పత్తి వర్షాల్లేక ఎండిపోయింది. దీంతో సాగుకు, కుటుంబ పోషణ నిమిత్తం చేసిన ప్రైవేట్ అప్పులు దాదాపు రూ.6లక్షలకు చేరాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వీటిని తీర్చే మార్గం కానరాక ఆదివారం రాత్రి పురుగు మంది సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మల్లయ్య మరణించాడు.
పంటలు పండక.. అప్పులు తీర్చలేక..
నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) నాలుగేళ్లుగా పంట నష్టాలను చవిచూశాడు. రెండేళ్ల క్రితం అప్పులు తీర్చేందుకు ఐదెకరాల సొంత భూమి అమ్మినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నా పంటలు సక్రమంగా పండలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా చేరాయి. బంగారు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు కూడా తీసుకున్నాడు. అప్పులన్నీ తలకు మించిన భారం కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న రాజేశ్వరరెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పొలంలోనే పురుగుమందు సేవించి..
ఇదే జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన చాకలి చిన్న గిడ్డన్న (45) తనకున్న 2.25 ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగుచేసేవాడు. మూడేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి కనిపించక ఈ నెల 7న పొలంలోనే పురుగుల మందు తాగాడు. రైతులు, కూలీలు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.
పంటను కాపాడుకోలేక...
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన దాసరి హనుమంతప్ప కుమారుడు దాసరి నాగరాజు(24)కు 1.5 ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి చికిత్సకు రూ.3.50 లక్షల దాకా అప్పు చేశాడు. బ్యాంకుల్లో పంట రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా వడ్డీలకే సరిపోయింది. దీంతో కొంతకాలం బళ్లారిలో కూలీగా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల గ్రామం చేరుకుని వరి సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపుగా ఉన్న పంటను కాపాడుకునేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడం.. అప్పటికే అప్పులు ఎక్కువవడంతో అప్పు దొరికే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment