పంటరుణాలపై బ్యాంకర్లకు మంత్రి తుమ్మల హెచ్చరిక... ఒకేరోజు భారీగా మంజూరు చేసిన రుణాలపై విచారణ
అర్హులైన రైతులందరికీ నెలలోగా రుణమాఫీ
రైతుభరోసాపై అందరితో చర్చించి ముందుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.
వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.
రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్‌లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment