సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, వేం నరేందర్‌రెడ్డి, సీఎస్
రైతుల జాబితా, రుణాల వివరాలు సిద్ధం చేయండి
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రుణమాఫీకి విధి విధానాలు రూపొందించండి
అవసరమైన నిధులు, ఇతర వివరాలతో ప్రణాళిక సిద్ధం చేయండి
పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు లబ్ధి కలిగేలా ఉండాలి
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి అవసరమైన లెక్క అంతా సిద్ధం చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో రేవంత్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్పష్టమైన ప్రణాళికతో రండి..
బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేలి్చచెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఒకేసారి మాఫీతో ఇబ్బంది అంటూ..!
రుణమాఫీకి నిధుల జమ విషయంలో ఇబ్బందులను కొందరు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచి్చనట్టు తెలిసింది. సుమారు రూ.35 వేల కోట్ల వరకు నిధులను జమ చేయడం అంత సులువైన విషయం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది.
రుణాలున్న ప్రతీ రైతుకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు తయారు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇప్పటివరకు కొన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాల సమాచారం వచి్చందని, మిగతావాటి నుంచి కూడా డేటా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment