వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పష్టీకరణ
30 వేల మందికి రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయి
సాంకేతిక సమస్యలు, డేటా తప్పుడు నమోదే కారణం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే దానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 30 వేల మంది రైతులకు రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయని మంత్రి చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక సమస్య, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమిస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారు గతంలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
15న వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ!
ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేసిన వాళ్లు ఈ రోజు రుణమాఫీపై మాట్లాడడం ఏమిటని తుమ్మల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తోందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు.
సకాలంలో ప్రాజెక్టులు ఫుల్..
ఈ ఏడాది సకాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయంటూ మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు కేంద్రం సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment