విత్తుకు విత్తమేది? | Telangana Farmers Problems for Crop Loans from Banks in rabi season | Sakshi
Sakshi News home page

విత్తుకు విత్తమేది?

Published Sat, Oct 29 2016 2:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

విత్తుకు విత్తమేది? - Sakshi

విత్తుకు విత్తమేది?

► రైతన్నకు నయా పైసా అందని రబీ రుణం
► కాలం కలిసొచ్చినా కరుణించని బ్యాంకులు
► రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది శూన్యం
► ప్రభుత్వం ముందు సై.. రైతుల ముందు నై
► పుష్కలంగా నీళ్లున్నా సొమ్ము లేక అన్నదాత విలవిల
► పెట్టుబడుల కోసం అప్పులు.. తప్పని ‘ప్రైవేటు’ తిప్పలు
► బ్యాంకులపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలం
 
 
సాక్షి, హైదరాబాద్‌: కాలం కలిసొచ్చింది.. వర్షాలు దండిగా కురిశాయి.. చెరువులు, బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గింజ వేస్తే చాలు చేలన్నీ పైర్లతో కళకళలాడుతాయి... కానీ రైతన్న చేతిలో చిల్లిగవ్వ లేదు.. విత్తుకు విత్తం(సొమ్ము) లేదు.. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. రబీ సీజన్‌ మొదలై నెల  కావస్తున్నా పంట రుణం కింద నయా పైసా ఇవ్వలేదు. రైతులు గత్యంతరం లేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మళ్లీ చేయి చాచాల్సి వస్తోంది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ. 29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్‌ లక్ష్యంలో బ్యాంకులు కేవలం రూ. 11,546 కోట్లే ఇచ్చాయి. రబీలో రైతులకు విరివిగా రుణాలిస్తామని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకర్లు హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నందున మాఫీకి సంబంధించిన సొమ్ముపై రైతులను బలవంతం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఆర్థిక మంత్రి ఈటల బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. అయినా బ్యాంక్‌లు తమ వైఖరి మార్చుకోలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రబీ సీజన్‌ మొదలైనా ఇప్పటివరకు రైతులకు ఒక్కపైసా పంట రుణాలు ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు.

మాఫీ బూచీ చూపి..
రుణమాఫీ సొమ్ము పూర్తిగా చెల్లించకపోవడం వల్లే పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామంటూ బ్యాంకులు చేస్తున్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. వడ్డీ సహా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చినా బ్యాంకర్లు దాన్నే బూచీగా చూపడం సరికాదని కాదని మంత్రి పోచారం అన్నారు.  మూడో విడత రుణమాఫీలో సగమే (రూ.2,020 కోట్లు) విడుదల చేశారని.. మిగతా రూ.2,020 కోట్ల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన సగంతో పాటు వచ్చే ఏడాది చెల్లించాల్సిన బకాయిలను కూడా ముందుగానే చెల్లిస్తామని బ్యాంకర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సాగు లక్ష్యం 30 లక్షల ఎకరాలు..
ఈ సెప్టెంబర్‌లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ నెలలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా... 361.5 మి.మీ. కురిసింది. ఏకంగా 180 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలో 30 వేల చెరువులు నిండాయి. నాగార్జునసాగర్‌ మినహా గోదావరి, కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 11.74 మీటర్ల లోతులో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8.98 మీటర ్లలోనే అందుబాటులో ఉన్నాయి. అంటే 2.76 మీటర్లు పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రబీలో 31 లక్షల ఎకరాలకు పక్కాగా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద మరో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించింది. వాస్తవంగా రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి 17.33 లక్షల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 3.70 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. అలాగే ఈ సీజన్‌లో 42.85 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించాలని లక్ష్యంగా ప్రకటించారు. అందులో ధాన్యం ఒక్కటే 31.4 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక పప్పుధాన్యాలు 1.73 లక్షల టన్నులు పండించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు వరకు మొత్తంగా అన్ని రకాల పంటలు కలిపి 2.27 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. రబీ లక్ష్యాల మేరకు ఏర్పాట్లు చేయడంలో బ్యాంకులు, వ్యవసాయశాఖ విఫలమయ్యాయి. వ్యవసాయశాఖ ఇప్పటికీ శనగ విత్తనాలను కూడా అందించలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
పాత జిల్లాల వారీగా 2016–17 రబీ రుణాల లక్ష్యం (రూ.కోట్లలో..)
జిల్లా లక్ష్యం
ఆదిలాబాద్‌          1,174.99
కరీంనగర్‌            1,724.24
వరంగల్‌             1,286.55
ఖమ్మం              1,100.93
నల్లగొండ            1,289.86
మహబూబ్‌నగర్‌  1,874.41
రంగారెడ్డి              836.69
మెదక్‌               1,123.64
నిజామాబాద్‌      1,229.24
––––––––––––––––
మొత్తం           11,640.55
––––––––––––––––

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement