
ప్రపంచ యువతకు భారత్ సమ్మిట్ పిలుపు
రాజకీయాల విషయంలో యువత సానుకూల నిర్ణయం తీసుకోవాలి
అసమానత, వృద్ధిలో అస్థిరత తదితర అంశాలపై దృష్టిపెట్టాలి
సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి
తొలిరోజు సదస్సులో కీలక అభిప్రాయాలు వెలువరించిన వక్తలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను యువత అపార్థం చేసుకోవద్దని, రాజకీయాలపై ఏవగింపు ధోరణితో కాకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను వెతుక్కోవడం ద్వారా సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలని భారత్ సమ్మిట్–2025 పిలుపునిచ్చింది. అసమానత, వాతావరణ మార్పులు, వృద్ధిలో అస్థిరత అనే అంశాలపై దృష్టి సారించేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. ‘ఓటింగ్‌లో పాల్గొనడం, గళమెత్తడం, రాజకీయాల్లో చేరడం’ అనేవి నేటి యువతకు మార్గదర్శకాలుగా నిలవాలని కోరింది.
యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు కృష్ణ అళవారు సంధానకర్తగా శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘యువత..రేపటి రాజకీయాలు’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ వంశీకృష్ణ, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిలతో పాటు పలు దేశాలకు చెందిన ఉదయ్‌భాను చిబ్, అరెనా విలియమ్స్, లినేశ్‌సెల్యు అందాన్, మెరీనా హే, జేమ్స్ స్టీవ్ సెరానో, జీసస్ తాపియాలు ప్యానలిస్టులుగా వ్యవహరించిన ఈ గోష్టి పలు కీలక అభిప్రాయాలకు వేదికయింది. వక్తలు వెలిబుచి్చన అభిప్రాయాలివే..
పరిస్థితులను యువత అధిగమించాలి
⇒ రాజకీయాలంటే అవినీతి అని యువత అనుకుంటోంది. ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి విస్మరించే పారీ్టల వైఖరి వారికి వెగటు పుట్టిస్తోంది. అయితే ఈ కారణాలతో యువత రాజకీయాల నుంచి దూరం జరగకూడదు. వీటిని అధిగమించేలా యువత కంకణం కట్టుకోవాలి.
⇒ చదువుకునేటప్పుడే యువతకు రాజకీయాలు అలవడాలి. వారు వివిధ వృత్తుల్లోకి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరితే ప్రయోజనం ఉండదు. అందుకే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి.
⇒ సోషల్ మీడియా యువతను బాగా ప్రభావితం చేస్తోంది. పలు సామాజిక మాధ్యమాల ద్వారా హింస, విద్వేషపూరిత ప్రసంగాలకు యువత ప్రభావితమవుతోంది. ఇది మంచిది కాదు. చెడును ప్రోత్సహించే ఎలాంటి సామాజిక మాధ్యమాలనైనా యువత అధిగమించగలగాలి.
⇒ వాతావరణ మార్పు అనే అంశాన్ని యువత సీరియస్‌గా తీసుకోవాలి. ఇందుకోసం చట్టాలు చేసే క్రమంలో యువత భాగస్వామ్యం కావాలి. యువత ముందున్న ప్రస్తుత రాజకీయ కర్తవ్యం వాతావరణ మార్పులపై పోరాటమే.
⇒ యువత ఎంత గట్టిగా అరిచిందన్నది ముఖ్యం కాదు. ఎంత నిఖార్సుగా పోరాడిందన్నదే ముఖ్యం.
వారసత్వం ఇంకెన్నాళ్లు?
చర్చాగోష్టిలో భాగంగా డొమినిక్ రిపబ్లిక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై ప్రశ్నించారు. తన కుటుంబం నుంచి ఒక ఎంపీనో, మంత్రినో ఉంటే ఆ కుటుంబ సభ్యులు మళ్లీ అవే పదవుల్లోకి వెళుతున్నారని, అలాంటప్పుడు సామాన్యులకు అవకాశాలెలా వస్తాయో ప్యానలిస్టులు చెప్పాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో పనిచేసి ఎంపీని అయ్యానని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నానని, కష్టపడిన వారికి రాజకీయాల్లో అవకాశాలు వస్తాయనేందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అయితే వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారని, ఆ పరిస్థితిని కాదనలేమని పొన్నం అభిప్రాయపడ్డారు.
మరో రెండు అంశాలపైనా చర్చ
తొలిరోజు భారత్ సమ్మిట్‌లో భాగంగా మరో రెండు అంశాలపై కూడా చర్చాగోషు్టలు జరిగాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటె మోడరేటర్‌గా జరిగిన ‘నిజం వర్సెస్ ఊహాజనితం: తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం’పై జరిగిన చర్చాగోష్టిలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగి్వజయ్‌సింగ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ మోడరేటర్‌గా వ్యవహరించిన ‘బహుళపక్ష వాదం’ అనే అంశంపై చర్చాగోష్టిలోనూ పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.