హైదరాబాద్: దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈనెల 9వ తేదీన న్యూ ఎనర్జీ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఈరోజు(సోమవారం) జెన్ కో ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
‘దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ పాలసీ(New Energy Policy) దోహదం చేస్తుంది. మిగులు విద్యుత్‌తో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. గత పది సంవత్సరాలుగా న్యూ ఎనర్జీ పాలసీని గత సర్కార్ విస్మరించింది. 20 వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నాం. ఒడిస్సా నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం,. రామగుండంలో జెన్ కో- సింగరేణి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర జీఎస్‌డీపీలో ప్రధాన పాత్ర ఎనర్జీదే. దీనిపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్(BRS Party) దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు’ అని తెలిపారు.
కేలండర్ ప్రకారమే ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు.
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు.
సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment