సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బీఆర్‌ఎస్ పాలనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన.
‘‘గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. కానీ, బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలిని మేము హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించే హామీలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక 31,768 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు అని భట్టి అన్నారు.
ఒకానొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు. అయినా భట్టి తన ప్రసంగం కొనసాగించారు.
2024-25 బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment