సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్నటి(శుక్రవారం) వరకు జరిగినవి బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోస్ చేసే వాటిలా ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీలో జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సమావేశాలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై చర్చనే జరగలేదు. నాకు అవకాశమే ఇవ్వలేదు. అన్యాయంగా నేను మాట్లాడకుండా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏరోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారు. మార్షల్స్‌ను పెట్టి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బయటికి పంపించారు.
.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు, హావభావాలు మొత్తం చూసి నాకు బాధేసింది. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషను సైతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలది పైచేయి అవుతుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసి, చర్చను మరుగున పడేశారు. ఈ సభ మొత్తం జరిగింది మాజీ సీఎం కేసీఆర్‌ణు తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, మమ్మల్ని బెదిరించటంతోనే సరిపోయింది.
.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. జాబ్ క్యాలండర్‌లో స్పష్టత లేదు. రైతు భరోసా నిధుల మాటే లేదు. జాబ్ క్యాలండర్‌కు చట్టబద్దత ఏది? రుణమాఫీ అంశం క్లారిటీ లేదు. మైక్ ఇవ్వరు, అడిగితే మార్షల్స్‌ను పెట్టి ఎత్తిపడేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఆయన అంటున్నారు. భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. అసెంబ్లీ లో మహిళ ఎమ్మెల్యేలు కంట తడి పెట్టుకున్నారు. ఏం మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం అన్నారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చానని సబితా ఇంద్రారెడ్డి బాధపడుతూ చెప్పారు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment