పాలేరులా పనిచేస్తా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ర్ట రోడ్లు, భవనాలు, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కామేపల్లి, కారేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సతుపల్లిలో జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ.. ప్రజలకు పాలేరుగా పనిచేస్తానని అన్నారు.
సత్తుపల్లి : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యానికి.. సహసానికి మెచ్చి.. తెలంగాణ పునర్‌నిర్మాణంలో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే కాంక్షతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన నాకు మీ ఆదరాభిమానాలతో.. ఆశీర్వదించారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మీ సేవకుడిగా.. పాలేరులా పని చేస్తా.’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం తుమ్మల అభినందన సభ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం సత్తుపల్లి ప్రజలు ఇచ్చిన భిక్షఅని అన్నారు. మీ ఆశీర్వాద బలంతో ఎన్నో పదవులు వచ్చాయని భావోద్వేగానికి లోనయ్యారు. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలలో.. సుఖాలలో నా వెంట నడిచిన వారికి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానన్నారు.
త్వరలో సీఎం కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తా
జిల్లాలోని పాల్వంచ, మణుగూరులో నిర్మించనున్న థర్మల్ పవర్‌ప్లాంట్ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తానని తుమ్మల చెప్పారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులతో తెలంగాణకు రవాణా సంబంధాలు పెంపొందించి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో ముందుంచేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.
వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారనిమ అన్నారు. 44వేల చెరువులను బాగుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రహదారులు లేని గ్రామాలు ఇకపై ఉండవన్నారు. జిల్లాకు కనీస మౌలిక వసతులతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బయ్యారం ఖనిజాలతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించి తీరుతామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా భరించానని అన్నారు.
అగ్రగామిగా జిల్లా
కామేపల్లి: అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలబెడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పండితాపురం సంత నుంచి మున్సిబ్‌జంజర వరకు 14.26 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్‌వై నిధులు రూ. 8.62 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు, ముచ్చర్ల రామస్వామి గుట్ట వద్ద సీపీడబ్ల్యుఎస్ నిధులు రూ. 20 కోట్లతో చేపట్టే సమగ్ర మంచినీటి సరఫరా పథకానికి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముచ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో కామేపల్లి మండలాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.
మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా
కారేపల్లి: ‘మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా. ఇప్పుడు మళ్ళీ మంత్రిని అయ్యా..మీ కోసం ఇంకా కష్ట పడుతా.’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కారేపల్లి మండలం రొట్టమాకురేవు నుంచి మంగళితండా వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ.7.31 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.200 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.200 కోట్లు, గోదావరి పుష్కరాల నిమిత్తం రోడ్లకు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
జై జగన్ అని నినదించిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్
సభలో వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతూ జై జగన్ అని నినదించారు. దీంతో సభా వేదిక పై ఉన్న వారు, సభా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఎమ్మెల్యే వెంటనే తేరుకుని సారీ.. సారీ.. అంటూ ముగించారు. కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, బాణోతు మదన్‌లాల్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, నలమల వెంకటేశ్వరరావు, పాలడుగు శ్రీనివాస్, మదార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.