సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అభివృద్ధి పరంగా జిల్లాను పరుగులు తీయించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉంటున్న పలు కీలక పోస్టులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జిల ఏలుబడిలో ఉన్న ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించే విషయమై పరిశీలన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా పలు కారణాల వల్ల జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోవడంతో పూర్తిస్థాయి అధికారుల నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధి పరంగా జిల్లాను అగ్రగామిగా ఉంచాలంటే అన్ని కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు ఉండి తీరాల్సిందేనని మంత్రి తుమ్మల నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఏయే శాఖల కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. అనే విషాయాన్ని జిల్లా అధికారయంత్రాంగంతో చర్చించినట్లు తెలుస్తోంది.
కీలకమైన ఖమ్మం నగర పాలక సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, సోషల్ వెల్ఫేర్ డీడీ వంటి కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేకపోవడం వల్ల పాలనాపరంగా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జిల్లాలో విశిష్ట సేవలు అందించిన అధికారులలో కొందర్ని తిరిగి జిల్లాకు తీసుకురావడానికి అధికార పార్టీ నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లాలో కీలక శాఖల కోసం మరోవైపు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులే తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
జిల్లాపై అవగాహన, వారి పనితీరు ప్రాతిపదికగా తీసుకుని ఖమ్మం నగర పాలక సంస్థకు గ్రూప్-1 అధికారిని లేదా ఐఏఎస్ అధికారిని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన డీఆర్‌డీఏ పీడీ పదవి కోసం భారీ పైరవీలు సాగుతున్నాయని సమాచారం. పలు ప్రధాన శాఖలకు జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ శాఖల పనితీరు మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
పలు కీలక ఫైళ్లను చూసే తీరిక, క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఓపిక కొందరు ఇన్‌చార్జి అధికారులకు ఉండటం లేదన్న అపవాదు గత కొన్ని నెలలుగా వినపడుతోంది. తమ సొంత శాఖల వ్యవహారాలు చక్కదిద్దడానికి ఇచ్చే ప్రాధాన్యం కొందరు అధికారులు ఇన్‌చార్జిగా ఉన్న శాఖలకు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఫైళ్లతో రోజుల తరబడి జిల్లా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
తలకు మించినభారం
కొత్తరాష్ట్రంలో ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. వాటిని సక్రమంగా అమలు చేయడం ఇన్‌చార్జి అధికారులకు భారంగా మారింది. మాతృశాఖలో పనులు చక్కపెట్టడంతో పాటు మరో శాఖ బాధ్యతలు చూడటం వారికి తలనొప్పిగా మారింది. పలు సమీక్ష సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకరికే రెండు శాఖల బాధ్యతలు ఉండటంతో పనిభారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు ఓ అధికారి చెప్పారు.
అవగహన లేక ఇబ్బందులు
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ పలు పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న అధికారులకు అవగహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అజమాయిషీ లేక, కిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేయలేక నానాతంటాలు పడుతున్నారు. ఆయా శాఖల్లో పాలనపై పర్యవేక్షణ కుంటుపడుతోంది. కొందరు అధికారులు ఇన్‌చార్జి పాలనతో అందినకాడికి మెక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇన్‌చార్జిల పాలనలో ఉన్న కీలక శాఖలు ఇవే..
ఖమ్మం కార్పొరేషన్‌కు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థకు కమిషనర్ లేక పోవడంతో మెప్మా పీడీ వేణుమనోహర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నగరపాలక సంస్థకు పూర్తిస్థాయి మేనేజర్ సైతం లేకపోవడంతో ఇన్‌చార్జితోనే నెట్టకొస్తున్నారు.
పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి లేకపోవడంతో డీఎల్పీవో రవీందర్‌తోనే పంచాయతీ పాలన సాగుతోంది.
డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి బదిలీపై వెళ్ళడంతో ఆమెస్థానంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్‌నాయక్ కొనసాగుతున్నారు.
గృహ నిర్మాణ శాఖ పీడీ రాందేవ్‌రెడ్డి బదిలీపై వెళ్ళడంతో మధిర డీఈగా పని చేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. - ఎస్సీ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి సెలవుపై వెళ్లడంతో సీపీవో డీడీ జెడ్. రాందాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
జిల్లా పరిషత్ డెప్యూటి సీఈవో కర్నాటి రాజేశ్వరి, ఏఓ అప్పారావులు ఇన్‌చార్జులుగానే విధులు నిర్వహిస్తున్నారు.
డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి కూడా ఇన్‌చార్జి విధుల్లోనే కొనసాగుతున్నారు.
కీలక అధికారులేరీ..?
Published Tue, Dec 23 2014 2:16 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement