ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటుకు ప్రభుత్వం యోచన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులోని ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫోర్త్ సిటీ’కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నారని తెలిసింది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం...
హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫోర్త్ సిటీ అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. ఆయా విభాగాల ఏర్పాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, తలెత్తిన ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగనుంది.
సింగిల్ విండో విధానం ఉండేలా...
కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావడంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ అదీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది. దీనివల్ల భూములు సమీకరణ, కేటాయింపు, అనుమతుల మంజూరు, మౌలిక వసతుల అభివృద్ధి.. ఇలా ప్రతి అంశంలోనూ సింగిల్ విండో విధానం అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సుదీర్ఘకాలం సజావుగా సాగేలా...
‘గ్రేటర్’పరిధిలో రోడ్డు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాత నగరం, ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందిన కొత్త నగరంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా కొత్త హంగులు సంతరించుకుంటున్న ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌తోపాటు పశి్చమ ప్రాంతంలోనూ సమస్యలు తప్పట్లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా సమకాలీన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ సైతం రూపొందించాలని యోచిస్తోంది. కనిష్టంగా రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం అవసరమైతే ప్రత్యేక అ«థారిటీతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అధ్యయనం చేయించే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు...
త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండనున్నాయని తెలిసింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ సహా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సిబ్బంది, చట్టబద్ధతపైనా నిర్ణయాలు ఉండనున్నాయి. ప్రస్తుతానికి హైడ్రాను కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా పిలిచే జీవోతో ఏర్పాటు చేశారు. దీనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించాలంటే చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం తీసుకోనుంది. దీని ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ అయ్యాక ఆర్డినెన్స్ జారీ చేయనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో హైడ్రా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాలోకి నేరుగా నియమించుకొనే, డిప్యుటేషన్‌పై తీసుకొనే సిబ్బందిపైనా కేబినెట్‌లో నిర్ణయం ఉండనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment