తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు తమను ‘‘అప్రధానమైన’’ పోస్టుల్లో నియమిస్తున్నారనీ, సీనియారిటీ లేకపోయినా ఇతరులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారనీ, తమ పట్ల వివక్ష చూపుతున్నారనీ, ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం అవసరమైనప్పుడు బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయి. వారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని, మరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని– తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని, తమపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి, వీరంతా తమకప్పగించిన ఏ బాధ్యతనైనా, అది ఏ శాఖకు సంబంధించినదైనా అరమరికలు లేకుండా, ప్రధానమా? అప్రధానమా? అని ఆలోచించకుండా విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి.
అలా కాకుండా ఆరోపణలు చేయడం సమంజసమా?
1995 సెప్టెంబర్ నెలలో నాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డెప్యుటేషన్ మీద ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడకు చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. కారణం, ఆ సంస్థ చిరునామా కనుక్కోవడం కూడా చాలా కష్టమైంది. అప్పట్లో ఆ సంస్థలో పోస్టింగ్ అంటే ఒక పనిష్మెంట్ లాగా భావించేవారు. ఒక ఏడాదిన్నర తరువాత నేనక్కడ పనిచేస్తున్నప్పుడే, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర మీడియా సలహాదారుడిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్‌గా, ఊర్మిళా సుబ్బారావు అనే మరో ఐఏఎస్ అధికారిణి అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
వీళ్ళిద్దరినీ అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిం చినవారికి, వాళ్లిచ్చిన జవాబు, విశ్రాంతిగా పనిచేసుకోవడానికని. కానీ, ఆ తరువాత జరిగిందేమిటి? 1995లో ఎవరికీ అంతగా తెలియని ఆ శిక్షణా సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంస్థగా, ప్రపంచ శిక్షణా సంస్థల చిత్రపటంలో అతిప్రధానమైన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దానికి కారణం.. పనిష్మెంట్ పోస్టింగ్ అని ఇతరులు భావించిన చోటే, పీవీఆర్కే ప్రసాద్, ఊర్మిళా సుబ్బారావులు అపారమైన నిబద్ధతతో ఆ సంస్థను అంచెలంచలుగా అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పుడు పనిచేయడం అంటే ఒక పెద్ద క్రెడిట్‌గా భావిస్తారు.
పీవీ నరసింహారావును మంత్రిమండలిలోకి తీసుకునే ముందర ఆయనకేం పోర్ట్ ఫోలియో కావాలని అడిగిన ఇందిరాగాంధీ, రక్షణ శాఖ కానీ, విదేశాంగ శాఖ కానీ, మరేదైనా మంచి శాఖ కానీ ఆయన అడుగుతాడని భావించారు. దానికి భిన్నంగా విద్యాశాఖ కోరుకున్నాడట! అదేంటి అలాంటి అప్రధానశాఖ అడిగావంటే, ప్రభుత్వంలో ఏదీ అప్రధానమైన శాఖ కాదని జవాబిచ్చాడు పీవీ. ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆ శాఖను పీవీ.
స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండవసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, మునిసిపల్ శాఖ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించి, అప్పటి ఆ శాఖా మంత్రితో (స్వర్గీయ కోనేరు రంగారావు) రాజీనామా చేయించి, సంబంధిత ఐఏఎస్ అధికారి సి.అర్జున్ రావును, అందరూ అప్రధానమైందని భావించే ‘విపత్తుల నిర్వహణ’ శాఖకు కార్యదర్శిగా బదిలీ చేయించారు సీఎం. కొన్నాళ్లకే మే నెల 13, 1990న భయంకర పెనుతుఫాను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. విపత్తుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అర్జున్‌రావు, తన అసమాన ప్రతిభతో వేలాదిమంది ప్రాణాలు కాపాడడానికి ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా, సహాయ–పునరావాస చర్యలు అద్భుతంగా చేపట్టి ‘విపత్తుల నిర్వహణ’ ప్రాధాన్యతను లోకానికి తెలియచెప్పాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి ప్రముఖ మ్యాగజైన్ ఆయన మీద ప్రత్యేక కథనం రాసింది. ప్రభుత్వ శాఖల్లో అన్నీ ప్రధానమైనవే. కాకపోతే వాటిని నిర్వహించేవారి సత్తాను బట్టి, వారి–వారి కృషిని బట్టి, సమయ–సందర్భాలను బట్టి, ఒక్కో శాఖకు ప్రధానమైనదిగానో, అప్రధానమైనదిగానో తాత్కాలికంగా గుర్తింపు వస్తుంది. తన శాఖ అప్రధానమైనది కాదని నిరూపించాల్సిన బాధ్యత దాన్ని నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిదే!
గతంలో, ఉమ్మడి రాష్ట్రంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజ కీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందారన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. ‘సమర్ధత‘ కన్నా, ‘చొరవ‘, ‘పలుకుబడి‘ ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకున్నారని అనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత అలాంటి అవకాశం కోల్పోయిన కొందరు బహుశా తమను అప్రధానమైన శాఖలకు బదిలీ చేశారని ఆరోపిస్తున్నట్లు అర్థమవుతున్నది. వీరిలాంటి కొందరు గతంలో పదవిలో వున్న సీఎంల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించుకోగలిగినవారైతే, ఇంకొందరు తెలుగుదేశం హయాంలో, కాంగ్రెస్ హయాంలో, చాలా కాలం ఒకే పోస్టులో ఉంటూ అధికారం, పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొనలేకపోతున్నారేమో! ఏదేమైనా, ఫలానా పోస్టు ప్రాధాన్యతకలదని, మరోటి మామూలుదని ఎవరైనా ఐఏఎస్ అధికారి భావించడమంటే వారి అవగాహనా లోపమే అనాలి.
ఐఏఎస్‌కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుంచి వైద్య శాస్త్రం వరకు, ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ వుంటుంది కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన అగత్యం లేదు.
ఏడాదికి పైగా శిక్షణానంతరం ఏదో ఒక సబ్ డివిజన్‌లో, సబ్ కలెక్టర్‌గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. సబ్ కలెక్టర్‌గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవలేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలామంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, జాయింటు కలెక్టరుగా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత, సుమారు ఏడెనిమిదేళ్లకు, జిల్లా కలెక్టర్‌గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవులకుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా ఉండవు. అఖిల భారత సర్వీసులలో ఐఏఎస్ కున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక ‘జిల్లా కలెక్టర్’ గా పని చేయడమే.
కలెక్టర్ పదవిని సుమారు పదేళ్లపాటు, వివిధ జిల్లాలలో చేపట్టి శాఖాధిపతులుగానో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగానో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు కొందరైనా రాజధానికి చేరుకుంటారు. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత, అటు పిమ్మట సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు–సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగానో నియామకం కావ డం. ఆ అవకాశం అతి కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. మిగిలిన పోస్టులన్నీ ఒకేరకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నవనే అనాలి.
అందుకే, ఇటీవల బదిలీ అయిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అప్రాధాన్యత పోస్టిం గులు ఇచ్చారనడం సరైంది కాదు. అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటే, అది వారి అవగాహనా రాహిత్యమే అనాలి. ఉదాహరణకు తమకు అప్రధానమైన పోస్టింగులు ఇచ్చారని ఆరోపణ చేస్తున్న వారి నూతన శాఖలను పరిశీలిస్తే వాటిలో ఏదీ అప్రధానమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. వీరిలో ఒకరు గతంలో కలెక్టర్‌గా, ఆబ్కారీ కమిషనర్‌గా, రెవెన్యూశాఖ ముఖ్య (ప్రత్యేక ప్రధాన) కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఎస్సీ–ఎస్టీ కమిషన్‌కు కార్యదర్శి అయ్యారు. మారుతున్న సమాజంలో, సమాజంలోని బలహీన వర్గాలవారికి చేయూతను అందించాల్సిన ఈ సమయంలో బహుశా దీనికంటే మంచి ప్రాధాన్యత కల పోస్టు లేదేమో! అలాగే మరొకరిని పోస్టింగ్ చేసిన మునిసిపల్ శాఖ అయినా, ఇంకొకళ్ళను పోస్టు చేసిన హోం శాఖ అయినా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ అయినా, ఆర్కైవ్స్ శాఖ అయినా. అన్నీ ప్రధానమైనవే.. ఆలోచించి చూస్తే. కాదేదీ అప్రధానమైంది.
వనం జ్వాలా నరసింహారావు, వ్యాసకర్త ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి 80081 37012
Comments
Please login to add a commentAdd a comment