కన్న తల్లిని.. జన్మభూమిని మరవకండి
ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఏ రాష్ట్రం, దేశంలో స్థిరపడినా కన్న తల్లిని, జన్మభూమిని మరువవద్దని, అలా చేస్తే మన జాతికి ద్రోహం చేసినట్లేనని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన తానా యువ-2014 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు, సంస్కృతికి పెద్దపీట ఉందని, అందుకే మనం ఏ దేశంలో స్థిరపడినా తెలుగువారంతా ఒక్కటేనని చాటాలని అన్నారు.
ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ శక్తి మన భారత దేశానికి ఉందని, అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువత అత్యంత సమర్థులు అని కొనియాడారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఉత్సాహాన్ని రేపుతాయని, ఇందుకు పూనుకున్న కాటేపల్లి నవీన్‌బాబు మున్ముందు ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఖమ్మం గుమ్మానికి వందనం : సినీహీరో నారారోహిత్
ఖమ్మం గుమ్మానికి వందనం.... నాకు ఖమ్మంతో అనుబంధం ఉంది... అంటూ నారారోహిత్ మాట్లాడగా అక్కడ ఉన్న యువకులు కేకలు వేశారు. తాను ఖమ్మంలోని మమత కళాశాలలో విద్యనభ్యసించానని, తనకు చాలా మంది ఖమ్మంలో మిత్రులున్నారని, చాలా కాలం తర్వాత ఖమ్మానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. తాను తీసిన ప్రతినిధి సినిమాలో రాజకీయాల్లోని కుళ్లును ఎలా బయట పెట్టాలో చిన్న ప్రయత్నం చేసి విజయవంతం సాధించానని, అదే స్ఫూర్తితో యువత కూడా రాజకీయాలను శాసిస్తూ ముందుకు సాగాలని అన్నారు.
మనమంతా ఒకట్టేగా : కామెడీయన్ శ్రీనివాసరెడ్డి
నేను జిల్లా వాసినేగా... మనమంతా ఒకట్టేగా అంటూ అంటూ కామెడీయన్ శ్రీనివాసరెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నగర వాసిగా సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఉన్నతస్థాయి ఎదగడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం స్వచ్ఛ భార్త్ కార్యక్రమం నడుస్తోందని, దానిలో యువత కూడా తలా ఒక చేయి వేసి క్లీన్ అండ్ గ్రీన్‌కు సహకరించాలని అన్నారు.
మహాసభలను విజయవంత చేయండి : తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్
తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 40 ఏళ్లు పూర్తిచేసుకుందని, ప్రతి రెండేళ్లకు నిర్వహించే తానా మహాసభలు అమెరికాలోని డిట్రాయిట్‌లో జులై 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ పేర్కొన్నారు. అందులో భాగంగానే తానా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం 20వ తానా మహాసభల పోస్టర్‌ను సీనిహీరో నారారోహిత్, రాజకీయ కురువృద్ధుడు చేకూరి కాశయ్యలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కాటేపల్లి నవీన్‌బాబు ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, సీక్వెల్‌రిసార్ట్స్ ఎండీ రవిమారుత్, మాజీ మంత్రి కొండబాల కోటేశ్వరరావు, తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, తానా ప్రముఖులు కొడా లి నరేన్, తాళ్ళూరి జయశేఖర్, జయరాం కోమటి, సతీష్ వేమన, గంగాధర్‌రెడ్డి, జంపా ల చౌదరి, తాతా మధుసూధన్, అంజ య్యచౌదరి, లింగమనేని అనిల్, జగ్గంపూడి రాము, తానా ఇండియా కో ఆర్డినేటర్ ప్రసా ద్, అశోక్ పల్లా, నందిపాటి హేమరావు, తాళ్ళూరి రాజా, తోట రాము, ఇండోకట్టర్ మేనేజింగ్ డెరైక్టర్ గిరి, దొడ్డా రవి పాల్గొన్నారు.