గీత దాటారు.. | ruling MLA's cross the election code | Sakshi
Sakshi News home page

గీత దాటారు..

Published Tue, Mar 4 2014 2:37 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

ruling MLA's cross the election code

సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వారు గీత  దాటారు. కోడ్‌కు తాము అతీతులమంటూ ఆయా నియోకజవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ‘రాజకీయం’ చేశారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క తమ నియోజవర్గాల్లో హడావిడిగా పనులకు ప్రారంభోత్సవాలు చేసి కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు.

ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గమైన మధిర మండలంలో ఉదయం నుంచి రాత్రి వరకు పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పరంపర కొనసాగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే  మండలంలోని నిదానపురం, జూలిముడి, మడుపల్లి, చిలుకూరు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఖాజీపురంలో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో ఇదే మండలం నాగవరప్పాడు గ్రామంలో రూ.7 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 ఎంపీ నామా నాగేశ్వరరావు నిధులతో వైరా మండలం పుణ్యపురంలో రూ.3 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ పుల్లమ్మతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక పినపాక మండలం కరకగూడెం పంచాయతీ రాయన్నపేట -1, రాయన్నపేట -2 గ్రామాల్లో రూ. 8 లక్షలతో చేపట్టాల్సిన పనులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు కోడ్ అమల్లోకి వచ్చాకే  శంకుస్థాపన చేశారు. ఇంత జరుగుతున్నా, కోడ్ అమల్లో ఉందని తెలిసినా అధికారులు తమకేమీ తెలియదన్నట్లుగా ఎమ్మెల్యేల ఆదేశాలకు జీహుజూర్ అంటూ కళ్లుమూసుకోవడం గమనార్హం.

 తుమ్మలపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు..
 ఖమ్మం పట్టణంలో రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రకాశ్‌నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా .. బ్రిడ్జిని ప్రారంభించి  కోడ్ ఉల్లంఘించారని నేరుగా ఎన్నికల కమిషనర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు ఆర్‌వీఎస్‌ఎన్ (కూల్‌హోం) ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్స్ ద్వారా కమిషనర్‌కు తుమ్మలపై ఫిర్యాదు లేఖ పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఈ విషయమై విచారణ జరిపి.. వాస్తవమని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ప్రజాప్రతినిధులు హడావిడిగా పనులకు శంకుస్థాపనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకే  రూ. లక్షల పనులకు ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో శంకుస్థాపన చేశారని పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు సమస్యల పట్ల స్పందించని ఎమ్మెల్యేలు.. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయడంపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 స్పష్టంగా చెప్పినా...
 రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయయే నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉదయం 10.30 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా(మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలతో పాటు జరగని ప్రాంతాలలోనూ) ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. అయినా ఇదేమీ పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి రాత్రి వరకు తమ నియోకజవర్గాలలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు, నూతనంగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంలో పోటీ పడ్డారు. ఎన్నికల కోడ్ వెలువడిన అనంతరం పౌరులంతా సమానమే అని చట్టం చెబుతున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం వాటిని తోసిరాజని తమ ‘పనులను’ ఆదరబాదరగా చక్కబెట్టడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement