వ్యవసాయ మంత్రి తుమ్మల స్పష్టికరణ
కుటుంబాల గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రాతిపదిక
రేషన్‌కార్డు లేని రుణ ఖాతాలు 6 లక్షలు ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
గత ప్రభుత్వ మార్గదర్శకాలే..
‘రుణమాఫీకి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి. రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.
ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.
రీషెడ్యూల్డ్ రుణాలు కూడా ..
‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు.
ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment