రైతు రుణమాఫీ అమల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు
ప్యాక్స్‌ల బలోపేతం కోసం టెస్కాబ్‌కు రూ.5 వేల కోట్ల రుణం మంజూరు చేసిన ఎన్సీడీసీ
ఆ సొమ్మును రుణమాఫీకి వినియోగించరాదని షరతు విధించిన వైనం
ఎన్సీడీసీ రుణాన్ని ‘మాఫీ’కి సర్దుబాటు చేద్దామనుకున్న సర్కారు ఆశలన్నీ అడియాశలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ కోసం అవసరమైన రూ. 31 వేల కోట్లలో రూ. 5–6 వేల కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ఆ సంస్థ నీళ్లుచల్లింది. తెలంగాణ సర్కారు అడిగిన విధంగా రూ. 5 వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు మంజూరు చేసిన ఎన్సీడీసీ.. ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ నిధుల ధీమాతోనే...
సహకార సంఘాలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి రూ. 5 వేల కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని టెస్కాబ్ కోరింది. టెస్కాబ్, డీసీసీబీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ.. ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. వాస్తవానికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రూ. 31 వేల కోట్లు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థికశాఖ రహస్యంగానే ఉంచుతోంది. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థికశాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటివరకు మొదటి విడత 11 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కోసం రూ. 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు రూ. 25 వేల కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. రూ. 5 వేల కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతు నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడంలేదు.
రుణమాఫీకి మళ్లింపు సాధ్యమేనా?
తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాల వివరణ కోరగా రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచి్చన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నాయి. అప్పుగా ఇచి్చన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందని చెబుతున్నాయి. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకొనే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నాయి.
ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీసీబీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్‌ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేయగలమని, అది కూడా ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకపోతే ప్యాక్స్‌ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకుంటామని టెస్కాబ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment