రుణమాఫీపై మాట మార్చిన ప్రభుత్వం
రేపు మొదటి విడత లక్ష లోపు రుణాల మాఫీ
తదుపరి విడతపై కొరవడిన స్పష్టత
వానాకాలం సీజన్‌లో కొత్త రుణాలు కష్టమేనన్న అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును ఒకేసారి రైతుల ఖాతాల్లో వేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. దశల వారీగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
లక్షకు పైన ఉంటే ఎదురుచూపులే..!
రుణమాఫీని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరో పద్ధతిలో చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు లక్షన్నర రూపాయల రుణం ఉంటే... 18వ తేదీన ఆ రైతుకు లక్ష వరకు మాఫీ చేయరు. కేవలం లక్ష రూపాయలలో పు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రు ణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.
ఆ డేటా ఆధారంగానే ఈసారి 18వ తేదీన రైతులకు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డు వెరిఫికేషన్, పీఎం కిసాన్ నిబంధన ప్రకారం అనర్హులను 18వ తేదీ రుణమాఫీ సందర్భంగా ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గురువారం ఒక్క రోజులోనే లక్ష లోపు రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం సెలవు అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అ లాగే బ్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment