మాకెప్పుడు మాఫీ? | When Is The Loan Waiver For Those Who Exceed 2 Lakhs: Telangana | Sakshi
Sakshi News home page

మాకెప్పుడు మాఫీ?

Published Sat, Sep 7 2024 5:28 AM | Last Updated on Sat, Sep 7 2024 5:28 AM

When Is The Loan Waiver For Those Who Exceed 2 Lakhs: Telangana

రుణమాఫీ జరగని రైతుల్లో ఆగ్రహావేశాలు

ఇంకా ఫిర్యాదులు తీసుకుంటూనే ఉన్న అధికారులు

రుణమాఫీ జరగని రైతుల కుటుంబసభ్యుల నిర్ధారణ కోసం గ్రామాల్లో సర్వే

వరదలు, వర్షాల కారణంగా చాలాచోట్ల నిలిచిన ప్రక్రియ

రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంటూ రైతుల్లో ఆందోళన

రూ.2 లక్షలకు మించిన రుణాల మాఫీపై ఇప్పటికీ కొరవడిన స్పష్టత.. మేడ్చల్‌ జిల్లాలో రైతు ఆత్మహత్యతో కలకలం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫిర్యాదులు తీసు­కుంటున్నా, గ్రామాల్లో సర్వే చేస్తున్నా తమకు న్యా­యం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తు­న్నారు. కొన్ని కారణాలతో కొందరికి రుణ­మాఫీ జరగలేదనీ ప్రభుత్వం చెబుతూ సర్వే చేస్తున్నç­³్పటికీ.. వారికి ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు రుణమాఫీ జరగడం లేదని వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తున్నా­రు. సురేందర్‌రెడ్డి అనే 52 ఏళ్ల రైతు తనకు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో శుక్రవారం మేడ్చల్‌ వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో బలవన్మర­ణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. 

మాఫీకి దూరంగా లక్షలాది మంది 
గత ఆర్థిక సంవత్సరం (2023–24) మార్చి 31 నాటికి బ్యాంకులు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్‌ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని మొదట్లో కాంగ్రెస్‌ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయంటూ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తీరా బడ్జెట్‌ కేటాయింపుల్లో దాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు.

చివరికు మూడు విడతల్లో రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే కావడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీకి 36.68 లక్షల రైతులు అర్హులు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే రూ.2 లక్షల మాఫీలో రైతుల సంఖ్య ఏకంగా 14.31 లక్షలు తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. లక్షలాది మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. 

రైతుల వివరాల సేకరణ పూర్తయ్యేదెప్పుడు?
రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్‌..బ్యాంక్‌ అకౌంట్లలో తప్పిదాలు, ఇతర సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు మాఫీకాని రైతుల కుటుంబస భ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. బ్యాంకు డేటా ఆధారంగా 4.5 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది రైతుల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్‌ నంబర్లు, వారి వయస్సులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్దతో ఫొటో తీయాల్సి ఉంది.

వారి సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయితే వరదలు, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల సేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదనే నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయిన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి రుణమాఫీ కాలేదని అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాట్‌లో ఎలాంటి కాలమ్‌ లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. 

అదనపు మొత్తంపై మార్గదర్శకాలెప్పుడు?
ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపై ఒక్క రూపాయి అదనంగా రుణం తీసుకుని ఉన్నా మాఫీ వర్తింపజేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణం సొమ్మును రైతులు చెల్లించాకే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అవుతుందని అంటున్నారు. అయితే ఇందుకు వ్యవసాయాధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే అదనపు మొత్తం చెల్లించి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్న అధికారులు, కనీసం అవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

రుణమాఫీ కాలేదని..
మేడ్చల్‌లో దుబ్బాక రైతు ఆత్మహత్య
బ్యాంకులో తల్లి, కుమారుడికి వేర్వేరుగా పంట రుణాలు
ఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లూ ఉండటం, ఇద్దరి రుణాలూ కలిపి రూ.3 లక్షలకు పైగా ఉండటంతో జరగని రుణమాఫీ
మనస్తాపంతో వ్యవసాయ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం

మేడ్చల్‌/దుబ్బాక రూరల్‌: రుణమాఫీ కాలేదని మనో వేదనకు గురైన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని బలవ­న్మరణా­నికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) మేడ్చల్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో భార్య మంజుల, కుమారుడు నితిన్‌రెడ్డితో కలిసి నివాసముంటున్నాడు. కండ్లకోయలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో ఆయన పేరుపై 4.5 ఎకరాల భూమి, తల్లి సుశీల పేరిట రెండు ఎకరాల భూమి ఉంది. ఇద్దరూ చిట్టాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్‌æ గ్రామీణ వికాస బ్యాంకులో 2012లో పంట రుణం తీసు­కున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేస్తూ రాగా ప్రస్తుతం సుశీల పేరిట రూ.1,15,662, సురేందర్‌రెడ్డి పేరిట రూ.­1,92,440 పంట రుణం ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. 

కాగా సురేందర్‌రెడ్డి, సుశీల ఇద్దరి రుణాలూ కలిపి రూ.3,08,102 ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదు. దీంతో సురేందర్‌రెడ్డి పలుమార్లు బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారులను సంప్రదించాడు. తనకు మాఫీ ఎందుకు కాలేదని వారిని అడగగా.. తల్లి, కుమారుడి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయని, రుణం రూ.3 లక్షల పైచిలుకు ఉండటం వల్ల మాఫీ కాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం రేషన్‌ కార్డుకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసిందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరు రేషన్‌కార్డులు ఉండి ఉంటే మాఫీ అయ్యేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు తన సోదరుడు రవీందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డు నుంచి తల్లి పేరు తొలగించేందుకు దరఖాస్తు కూడా చేశాడు.

 సురేందర్‌రెడ్డికి గతంలోనూ రుణమాఫీ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ కోసమని ఇంట్లో నుండి వెళ్లిన సురేందర్‌రెడ్డి మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయ కాంప్లెక్స్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేçహాన్ని నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు.

రెండురకాల సూసైడ్‌ నోట్‌లు
మృతుడి జేబులో నుంచి పోలీసులు రెండు రకాల సూసైడ్‌ నోట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం (ఎస్‌బీఐ)లోంచి వచ్చే స్లిప్పులపై ఇవి రాసి ఉన్నాయి. ఒక దానిపై ‘నా చావుకు కారణం నా అమ్మ’ అని రెండు సార్లు, మరో పత్రంపై ‘చిట్టాపూర్‌ బ్యాంకులో లోన్‌ మాఫీ కాలేదని, అందుకే నా ఆత్మహత్య’ అని రాసి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సురేందర్‌ రెడ్డి బ్యాంకు రుణం రూ.192440, తల్లి సుశీల బ్యాంకు రుణం రూ.115662 ఇద్దరిది కలిపి మొత్తం రూ.308102

రైతు రుణమాఫీ కాని కుటుంబాల వివరాలు నమోదు
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం రుణమాఫీ కాని రైతు కుటుంబాల ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు వందల సంఖ్యలో ఉదయం 10 గంటలకే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్‌ పనిచేయకపోవడంతో రైతులు రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మూడు ఫోన్ల ద్వారా వివరాలను అప్‌లోడ్‌ చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement