సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే, రాష్ట్రంలో పంట రుణ మాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఖమ్మంలోని వేంసూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది. సహకార బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్‌షిప్ ఉండాలి. ఓట్ల కోసం మెంబర్‌షిప్ ఇవ్వకూడదు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. రైతులకు కావల్సిన అన్నింటినీ రివైజ్‌డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీ లోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నాం.
రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కోరిక. గత ఐదేళ్లలో పంట వేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది. దానివల్ల 25వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. 10, 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది.
రుణమాఫీ పూర్తి అయిన తరువాత రైతు భరోసా ప్రారంభిస్తాం. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా ముఖ్యమంత్రితో మాట్లాడాం. రైతు బీమా కూడా కొనసాగించాలి అని చెప్పాం. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలి. భవిష్యత్‌లో పామాయిల్‌ను ఎక్స్‌పోర్ట్ చేసే స్థితికి వెళ్లాలి. పామాయిల్‌కు రూ.17 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడాం. పామాయిల్ రైతు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment