టీఆర్‌ఎస్‌ను అగ్రగామిగా నిలుపుతా
ఖమ్మం వైరా రోడ్: జిల్లాలో టీఆర్‌ఎస్‌ను అగ్రగామిగా నిలుపుతానని ఆ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నగరంలోని బైపాస్ రోడ్డులోగల ఎంబీ గార్డెన్స్‌లో జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే మిన్నగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. నిర్మాణ దశలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయిస్తానని అన్నారు.
ఖమ్మంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడతానన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 18న పార్టీ ప్లీనరీ, 19న బహిరంగ సభ ఉంటాయన్నారు. వీటికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు, 200 నుంచి 300 వరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల బస్సులను కూడా వినియోగించుకుంటామన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కల కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు కోతలకు గత పాలకులే కారణమని అన్నారు. గత పదేళ్లుగా జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీని వారధిలా ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌బి.బేగ్, పట్టణ అధ్యక్షులు డోకుపర్తి సుబ్బారావు, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, పోరిక లక్ష్మీబాయి, మదార్ సాహెబ్, మామిళ్లపల్లి రాంబాబు, కమర్తపు మురళి, అర్వపల్లి విద్యాసాగర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, గాదె అనిల్‌కుమార్, సుధీర్, శేషు, మందడపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.