సస్పెన్షన్ల చిచ్చు... | thummala category concerned in district party | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్ల చిచ్చు...

Published Wed, Feb 5 2014 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

thummala category concerned in district party

 ఖమ్మం కార్పొరేషన్/ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. తమవారిని సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారని,  సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే తుమ్మలనాగేశ్వరరావు వర్గం ఆందోళనకు దిగింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావారణం చోటుచేసుకుంది. చివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు  కొండబాల కోటేశ్వరరావు వచ్చి చర్చలు జరిపి, నాయకులపై విధించిన  సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో  వివాదం సద్దుమణిగింది.

ఇందుకు సంబంధించిన వివరాలు...
 పాలేరు నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నాయకులు వీరవెల్లి నాగేశ్వరరావు, ఆలుదాసు ఆంజనేయులు, రామసహాయం వెంకటరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ  టీడీపీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి ప్రకటించడం తుమ్మల వర్గీయులకు ఆగ్రహాన్ని కలిగించింది.  తమను సస్పెండ్ చేసే అధికారం స్వర్ణకుమారికి ఎక్కడిదంటూ నాగేశ్వరరావు, అంజనే యులు, వెంకటరెడ్టి బహిరంగ విమర్శలకు దిగారు. అంతేకాకుండా మంగళవారం పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తుమ్మల వర్గీయులు దాదాపు 200మంది నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

తుమ్మల జిందాబాద్, తుమ్మల నాయకత్వం వర్థిలాలి అంటూ నినాదాలు చేశారు.  సస్పెన్షన్‌లు రద్దు చేయాలని, స్వర్ణకుమారిని ఇన్‌చార్జిగా తొలగించాలని, లేదంటే తాము ఎంపీ నామానాగేశ్వరరావు ఇంటి ముందు ఆందోళన చేస్తామనిమంటూ హెచ్చరించారు.  ఆందోళన  సమాచారం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరాావు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తుమ్మల వర్గీయులతో కార్యాలయంలో తన ఛాంబర్‌లో  సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నందున  ఈ పరిస్థితుల్లో గొడవలు చేయడం మంచిది కాదని, ఇప్పటికే పార్టీ పరిస్థితి జిల్లాలో దారుణంగా మారిందని, ఇలాగే ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నాయకులతో కొండబాల అన్నట్లు సమాచారం.

 అన్ని వివాదాలను వదిలి అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని వారిని బుజ్జగించినట్లు తెలిసింది. ఎంపీ ఇంటి ముందు ఆందోళన చేయడం సరికాదని, సమస్యను తాను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే స్వర్ణకుమారిపై తాము గతంలో  ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదని, ఇలాగే ఉంటే భవిష్యత్‌లో పార్టీపరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని వారు కొండబాలకు వివరించినట్లు తెలిసింది. స్వర్ణకుమారిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

  సస్పెన్షన్లు రద్దు చేసిన కొండబాల..
 వీరవల్లి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అంజనేయులపై  విధించిన సస్పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు కొండబాల కోటేశ్వరరావు ఈసందర్భంగా నాయకులకు తెలిపారు.  కాకి వెంకటరెడ్డి, మద్ది మల్లారెడ్డిలకు జారీ చేసిన షోకాజ్ నోటీసులు కూడా రద్దు చేస్తున్నట్లు వివరించారు.  

 టీడీపీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల హల్‌చల్...
 టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు హల్‌చల్ చేశారు. రఘునాధపాలెం మండలానికి చెందిన ఉపసర్పంచ్ పురం నాగేశ్వరరావు సోమవారం టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు,ఉపసర్పంచ్ బంధువులు  రాత్రి సుమారు 11 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకుని.... కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి ఎలా పోతవంటూ నాగేశ్వరరావుతో వాదనకు దిగినట్లు సమాచారం. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం . చివరకు అతనిని బలవంతంగా గ్రామానికి తీసికెళ్లి తాను ఏ పార్టీలోకి పోవడం లేదంటూ కాంగ్రె స్‌లోనే ఉంటానని చెప్పించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement