పునర్నిర్మాణ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో పునర్నిర్మాణ ఉద్యమం మొదలైందని, రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ర్టం ప్రస్తుతం సంధి కాలం(ట్రాన్సిట్ టైమ్)లో ఉందని, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి పాటుపడాలని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ‘టీఆర్‌ఎస్ రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు కూడా ఉద్యమ పార్టీనే. తెలంగాణ పునర్నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లేవు. ఐదేళ్లపాటు కేవలం అభివృద్ధే మన ఎజెండా’ అని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం దేశానికి, ప్రపంచానికి ధీరత్వం చూపించాల్సిన అవసర ముందని నేతలకు, కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఖమ్మం జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటే దాదాపు జిల్లా టీడీపీ శ్రేణులన్నీ గులాబీ దళంలోకి మారిపోయాయి.
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం టీడీపీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర్‌రావు, ఖమ్మం జెడ్పీచైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మొవ్వ విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్యతో పాటు జిల్లాకు చెందిన 16 మంది జెడ్పీటీసీలు, 16 మంది ఎంపీపీలు, 168 మంది ఎంపీటీసీలు, 32 మంది పీఏసీఎస్ చైర్మన్లు, 162 మంది సర్పంచ్‌లు, వివిధ స్థాయిల్లోని టీడీపీ నాయకులు, నల్లగొండ జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అందరినీ ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘తుమ్మల 1982 నుంచి నాకు ఆప్తమిత్రుడు. మేం టీడీపీ వ్యవస్థాపక సభ్యులం. అనేక ఒత్తిళ్లకు లోనయ్యాం. ఖమ్మం జిల్లాను వందకు వంద శాతం అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
తెలంగాణకే ఖమ్మం తలమానికం
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని సీఎం అభివర్ణించారు. ‘ఖమ్మం జిల్లాను విభజించి కొత్తగూడెం కేంద్రంగా ఇంకో జిల్లాను ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి రాష్ర్టంలో ఖమ్మం వివక్షకు గురైంది. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా ఆశ్చర్యపోయేలా అందరం కలసి జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. కృష్ణా జలాలు ఖమ్మం లోని గార్ల వరకు రాకుండా ప్రజల నోట్లో మట్టికొట్టారు. ఇప్పుడు అంగుళం భూమిని వదల కుండా సాగు జలాలతో కళకళలాడేలా చేసుకోవాలి’ అని కేసీఆర్ అన్నారు. బయ్యారం ఖనిజ నిల్వల విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ఖనిజం తక్కువ గ్రేడుదన్న ప్రచారంలో నిజం లేదని, అది చాలా నాణ్యమైనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అక్కడ రూ. 30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ముందుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2 వేల కోట్లతో అందులో వాటా తీసుకుంటే.. 10 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని సెయిల్ అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ, కార్పొరేట్ ఆసుపత్రి, ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు.
ముంపు ప్రాంతాలపై పునరాలోచించాలి
తుమ్మల మాట్లాడుతూ కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. టీఆర్‌ఎస్‌లో చేరి సీఎంకు అండ గా నిలవడం ద్వారా ఖమ్మం జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా చేసేందుకు, విద్యుత్, నీరు, బొగ్గు, ఇతర రంగాల్లో పురోభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మం డలాలను తెలంగాణలోనే కలపాలని, దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజల గురించైనా ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజనులు వద్దంటున్నా మొండిగా, మూర్ఖంగా వారిని ఏపీలో చేర్చారని మండిపడ్డారు. విడిపోయినప్పటికీ పక్కనున్న తమ్ముళ్లకు కావాల్సిన సహాయం చేసేందుకు, శక్తికి మించి దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణను అభివృద్ధిలో గుజరాత్ కంటే ముందు వరసలో కేసీఆర్ నిలపాలని తుమ్మల అభిలషించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, కోరం కనకయ్య తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వరంగల్ మహిళ రహీమున్నీసా బేగం.. సభ ముగిసిన తర్వాత హఠాత్తుగా వచ్చి ముఖ్యమంత్రి పాదాలపై పడ డం కాస్త కలకలం సృష్టించింది. గతంలో తాను చేసిన తప్పులను క్షమించాలని ఆమె కోరారు.