huge meeting
-
డిసెంబర్ 2 లేదా 3న కాంగ్రెస్ భారీ సభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెల 7 నాటికి సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ శివారులో ఈ సభను నిర్వహించాలని, సభకు జాతీయ నాయకులను ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంతకంటేముందు ప్రజా పాలన విజయోత్సవ సంబరాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ యోచిస్తున్నారు. ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టబోతోంది. వాటికి సమాంతరంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 వేల ఉద్యోగాల భర్తీతోపాటు మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీలాంటి అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది.గ్రామ, మండల, బ్లాక్, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ కేడర్‌ను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ శుక్రవారం ఖరారయ్యే అవకాశం ఉందని, శనివారం నుంచి అన్ని స్థాయిల్లో ఏడాది పాలన విజయోత్సవాలు ప్రారంభమవుతాయని టీపీసీసీ ముఖ్య నాయకుడు ఒకరు ’సాక్షి’కి చెప్పారు. -
బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో బీఆర్ఎస్నిర్వహించనున్న బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. గాంధీ భవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించగా అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. సభకు ప్రియాంక గాం«దీని ఆహ్వనించడం ద్వారా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ప్రియాంక సభలోనే మరో రెండు గ్యారంటీలైన గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్సిలిండర్పథకాలను ప్రకటించాలని నిర్ణయించారని తెలిసింది. నేటి మధ్యాహ్నంలోగా ఎంపీ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ఆశావహుల పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన 306 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో సామాజిక న్యాయం, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు పేర్లను టిక్ పెట్టనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి పీఈసీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్‌ను సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు. టికెట్ల ఖరారు ఎజెండాగా మరోసారి ఈ నెల 15న భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కదం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతోపాటు పీఈసీ సభ్యులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, వి.హనుమంతరావు, కె. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జె. గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, సునీతారావు, అజహరుద్దీన్, శివసేనారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో చర్చకొచ్చిన అంశాలివే.. ► సోనియాగాం«దీని ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కోరగా ఆమె ఎక్కడ పోటీ చేయాలన్నది ఏఐసీసీ అభీష్టమని, వారి నిర్ణయం ప్రకారం ముందుకు వెళదామని రేవంత్ సూచించారు. ► లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతోపాటు సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలను పేర్కొంటూ ఓ నివేదికను పీఈసీ సభ్యులకు అందజేశారు. ఇందులో బీసీలను ఇత రుల కేటగిరీలో చేర్చడంపై సీనియర్ నేత వీ హెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని సూచించారు. క్లీన్‌స్వీప్ చేయబోతున్నాం: ఉత్తమ్ లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీఈసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు మోసం చేసినందుకు కేసీఆర్ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్ తదితరులు -
10లక్షల మందితో టీఆర్స్ భారీ బహిరంగ సభ
-
వేదిక నిర్మాణంషురూ
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణంలో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగసభ జరుగనున్న క్రమంలో బుధవారం నాటికి ప్రాంగణం చుట్టూ బారికేడ్ల నిర్మాణం పూర్తయింది. ప్రాంగణం చివరి భాగంలో వేదిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. మొత్తం మూడు వేదికల నిర్మాణం, వీవీఐపీల గ్యాలరీ, వీఐపీ, ప్రెస్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి వీలుగా బుధవారం యూనివర్సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. గురువారం సాయంత్రానికల్లా ఏర్పాట్లు మొత్తం పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశించారు. సభావేదిక నిర్మాణ పనులు మందకొడిగా సాగడంపై జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో కూడా ఏర్పాట్లు కొనసాగించాలని, అవసరమైతే మరికొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రాంగణం ప్రారంభంలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రుళ్లు కూడా పనులు నిర్వహిస్తున్నారు. పనులు పరిశీలించిన నవీన్ మిట్టల్... చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బుధవారం ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్ యాదవ్, ఆర్డీవో ఆర్,రామ్మూర్తి, మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేనాపతి ఢిల్లీరావు, ప్రశాంతితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లను గురించి స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా సిబ్బందిని సమాయత్తం చేయాలని ప్రత్యేక అధికారి మిట్టల్ కలెక్టర్‌కు సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ గరికపాటి... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు బుధవారం జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవో ఆర్.రామ్మూర్తిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వీవీఐపీలు, వీఐపీలు, నాలుగు నుంచి అయిదు లక్షల మంది కార్యకర్తలు తరలిరానున్నారని చెప్పారు. -
30న ‘సమైక్య’ బహిరంగ సభ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కర్నూలులో ఈ నెల 30న రాష్ట్రస్థాయి సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ ఉద్యోగులు ఈ నెల 30న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఇందుకు దీటుగా కర్నూలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభ నిర్వహించాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. లక్షలాది ఉద్యోగులచే చేపట్టనున్న బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, అన్ని ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం, సోమవారం రాష్ట్ర జేఏసీ సమావేశం కొనసాగుతుందన్నారు. జిల్లా నుంచి తనతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశానికి హాజరవుతారన్నారు. 30న జరిగే బహిరంగ సభ విధివిధానాలు ఈ సమావేశంలో ఖరారవుతాయన్నారు.