
వేదిక నిర్మాణంషురూ
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా ప్రాంగణంలో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగసభ జరుగనున్న క్రమంలో బుధవారం నాటికి ప్రాంగణం చుట్టూ బారికేడ్ల నిర్మాణం పూర్తయింది. ప్రాంగణం చివరి భాగంలో వేదిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. మొత్తం మూడు వేదికల నిర్మాణం, వీవీఐపీల గ్యాలరీ, వీఐపీ, ప్రెస్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి వీలుగా బుధవారం యూనివర్సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. గురువారం సాయంత్రానికల్లా ఏర్పాట్లు మొత్తం పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశించారు. సభావేదిక నిర్మాణ పనులు మందకొడిగా సాగడంపై జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో కూడా ఏర్పాట్లు కొనసాగించాలని, అవసరమైతే మరికొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రాంగణం ప్రారంభంలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రుళ్లు కూడా పనులు నిర్వహిస్తున్నారు.
పనులు పరిశీలించిన నవీన్ మిట్టల్...
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బుధవారం ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్ యాదవ్, ఆర్డీవో ఆర్,రామ్మూర్తి, మెప్మా, డీఆర్‌డీఏ పీడీలు సేనాపతి ఢిల్లీరావు, ప్రశాంతితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లను గురించి స్పెషల్ ఆఫీసర్‌కు వివరించారు. ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా సిబ్బందిని సమాయత్తం చేయాలని ప్రత్యేక అధికారి మిట్టల్ కలెక్టర్‌కు సూచించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ గరికపాటి... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు బుధవారం జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, ఆర్డీవో ఆర్.రామ్మూర్తిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వీవీఐపీలు, వీఐపీలు, నాలుగు నుంచి అయిదు లక్షల మంది కార్యకర్తలు తరలిరానున్నారని చెప్పారు.