పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే యోచన
హైదరాబాద్ శివారులోనే నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెల 7 నాటికి సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ శివారులో ఈ సభను నిర్వహించాలని, సభకు జాతీయ నాయకులను ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంతకంటేముందు ప్రజా పాలన విజయోత్సవ సంబరాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ యోచిస్తున్నారు.
ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టబోతోంది. వాటికి సమాంతరంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 50 వేల ఉద్యోగాల భర్తీతోపాటు మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీలాంటి అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది.
గ్రామ, మండల, బ్లాక్, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ కేడర్‌ను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ శుక్రవారం ఖరారయ్యే అవకాశం ఉందని, శనివారం నుంచి అన్ని స్థాయిల్లో ఏడాది పాలన విజయోత్సవాలు ప్రారంభమవుతాయని టీపీసీసీ ముఖ్య నాయకుడు ఒకరు ’సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment