ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్‌.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్‌ | Ktr Speech In Nalgonda Rythu Maha Dharna | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్‌.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్‌

Jan 28 2025 1:48 PM | Updated on Jan 28 2025 3:40 PM

Ktr Speech In Nalgonda Rythu Maha Dharna

సాక్షి, నల్గొండ: కాంగ్రెస్‌ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్‌ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. 

ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించింది.

‘కేసీఆర్‌ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్‌, రైతుబంధు అంటే కేసీఆర్‌ గుర్తొస్తారు. రుణమాఫీ,రైతుబంధు, వరికి బోనస్‌ అన్నింటిలో మోసాలే. మోసం చేయడంలో కాంగ్రెస్‌ నేతలు చరిత్ర సృష్టించారు.పంజాబ్,హరియాణాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్‌ వన్ చేశారు కేసీఆర్. 

జనవరి‌ 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్  రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు.నల్గొండ రైతులు అవస్థలకు,పిల్లలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.

రుణమాఫీ 25 శాతం కూడా కాలేదు.గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నాం. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్టుగా ఉంది: కేటీఆర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement