Huzurnagar Bye-Election 2019
-
ఉత్తమ్‌కు కేసీఆర్ దెబ్బ రుచి చూపించాం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన సొంత గడ్డపైనే కేసీఆర్ దెబ్బ ఏంటో రుచి చూపించాం. హుజూర్నగర్ అంటే గతంలో ఉత్తమ్ గడ్డ అనే వారు. కానీ ఇప్పుడు ఆ గడ్డపైనే టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది’అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటో తేదీన మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గం పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచిన సైదిరెడ్డి బుధవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో పాటు పలువురు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతోపాటు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సైదిరెడ్డి నివాళి అరి్పంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌గా జీవన్‌రెడ్డి శాసనసభ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఆర్మూరు శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీవన్‌రెడ్డిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు అభినందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. -
హుజూర్‌నగర్‌కు కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి : కారుకే జై హుజూర్!) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్ సారొస్తుండు!
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజూర్నగర్ రావాల్సి ఉండగా వర్షంతో సభ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంతో కృతజ్ఞత సభ నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇవ్వాలని ముఖ్యనేతలు కోరడంతో ముఖ్యమంత్రి ఈ సభకు హాజరవుతున్నారు. అయితే ఈ సభలో సీఎం నియోజకవర్గానికి ఏం వరాలు ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. భారీగా నిర్వహించేందుకు.... ఇటీవల సభ రద్దయిన ప్రాంతంలోనే వేదికను సిద్ధం చేశారు. ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో సభ నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ నలు మూలల నుంచి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని మండలాల నుంచి జనసమీకరణకు వాహనాలను కేటాయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై నియోకవర్గ నేతలతో శుక్రవారం సమీక్షించారు. కృతజ్ఞత సభ నియోజకవర్గ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చేయాలని ముఖ్యనేతలు నిర్ణయించినట్లు సమాచారం. సభ ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్‌లు పరిశీలించారు. సిద్ధమవుతున్న సభా వేదిక ఈ సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని... నియోజకవర్గంలోని పలు సమస్యలపై సీఎం ఈ సభా వేదికగా ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టణ పరిధిలోని ఫణిగిరి గుట్ట సమీపంలో 4వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటికి కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి కానున్నాయి. హుజూర్నగర్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా చేయడం, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడం, రింగ్‌రోడ్డు పూర్తి చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలను కోదాడ కోర్టు నుంచి హుజూర్నగర్ కోర్టు పరిధిలోకి తేవడం, చింతలపాలెం, మఠంపల్లి మండలంలో టేలాండ్ భూములకు కృష్ణానది నుంచి ఎత్తిపోతలతో నీళ్లు తేవాలన్న డిమాండ్లు ఎన్నికల ప్రచారంలో కూడా బాగా జరిగాయి. ఇవన్నింటిపై ముఖ్యమంత్రి సభావేదికపై వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం టూర్ ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి మధ్యాహ్నం 11 గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి 1.30 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటారు. ఇక్కడ త్రివేణి ఫంక్షన్హాల్లో ముఖ్యనేతలతో కలిసి భోజనం ముగించుకుని సాయంత్రం 3 గంటలకు హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. 4 గంటలకు హుజూర్నగర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై కేసీఆర్ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. -
‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్: గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు. -
టానిక్ లాంటి విజయం
సాక్షి, హైదరాబాద్: ‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతికూల వాతావరణంలో హుజూర్నగర్ సభకు వెళ్లలేకపోయినా అద్భుత విజయం అందించారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా ఆచితూచి, ఆలోచించి టీఆర్ఎస్కు ఓటు వేశారు. ఈ తీర్పు ప్రభుత్వానికి టానిక్ లాంటిది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ నేతలతో కలసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా 43 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు మా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. హుజూర్నగర్ ప్రజలు ఏ అభివృధ్ధి కోసం ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరుస్తాం. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగే కృతజ్ఞత సభకు ఎన్నికల సంఘం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ సభకు హాజరై వారి ఆశలను నెరవేరుస్తా’అని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు నేతలందరూ మొక్కవోని కృషి చేయడం వల్లే హుజూర్‌నగర్‌లో విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు అహంకారం వీడాలి ‘ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని కోరుతున్నా. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. వాళ్లు రోజూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సద్విమర్శ చేసే ప్రతిపక్షం అవసరం. కేసీఆర్‌ను తిడితే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వంద శాతం అన్ని అంశాలను గమనిస్తున్నారు. విమర్శలు హుందాగా, విమర్శనాత్మకంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. కొన్ని పార్టీలు ఉప ఎన్నిక వాయిదా వేయించాలని చూశాయి. కేసీఆర్ హెలికాప్టర్‌ను తనిఖీ చేయాలని చెప్పాయి. కేసీఆర్ హెలికాప్టర్లో డబ్బులు తీసుకుపోతాడా? ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి. అహంభావం, అహంకారం లేకుండా వ్యవహరించాలి. బాధ్యతగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఈ విజయంతో గర్వం తలకెక్కించుకోకుండా మరింత బాధ్యతతో, సంస్కారవంతంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరుతున్నా. రాష్ట్రాన్ని గాడిన పెట్టడమే మా ముందున్న సవాల్. ఓవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా అమలు చేస్తున్నాం’అని కేసీఆర్ తెలిపారు. నవంబర్‌లోగా మున్సిపల్ ఎన్నికలు ‘వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇదివరకే రెండు చట్టాలు తెచ్చింది. నియమిత విధానంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది జరిగేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ చట్టాలు రూపొందించాం. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 330 కోట్లు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. అదే తరహాలో మున్సిపాలిటీలకు కూడా రూ. 1,030 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించి నూతన పాలక మండళ్ల ద్వారా పట్టణ ప్రగతికి ప్రణాళిక అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,030 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2,060 కోట్లతో 141 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యమయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో మున్సిపల్ ఎన్నికలపై 99 శాతం స్పష్టత వచ్చింది. 2, 3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదన ప్రభు త్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత గల్ఫ్ దేశాలకు ‘గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాసులను స్వదేశానికి రప్పించేందుకు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. కేరళ అనుసరిస్తున్న ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెళ్లి తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే 4–5 గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తాం. ఇక్కడ న్యాక్ ద్వారా వారికి భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇప్పిస్తాం. మన వాళ్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్తుంటే యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు’అని కేసీఆర్ వివరించారు. మహారాష్ట్రలో పోటీపై ఆసక్తి లేదు ‘నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహారాష్ట్రవాసులు టీఆర్ఎస్ తరపున అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలోనే దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో మేము ఆసక్తి చూపలేదు. భివండీ, షోలాపూర్ వంటి ప్రాంతాల్లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆశ పడటంలో తప్పులేదు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమించింది. ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు. అదేమీ దురాశ కాదు. అయితే లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి సరిగా ఉండాలనేది టీఆర్ఎస్ భావన’అని కేసీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు ‘జర్నలిస్టులకు వంద శాతం ఇళ్ల స్థలాలు ఇస్తాం. సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరలో కొలిక్కివచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టుల సంక్షేమ నిధి సత్ఫలితాలిస్తోంది. జర్నలి స్టులు, రాజకీయ నాయకులు వ్యవస్థకు పరస్పరం అవసరం. ప్రెస్ అకాడమీ బాగా పనిచేస్తోంది’అని సీఎం కితాబిచ్చారు. కాగా, గవర్నర్ కార్యాలయానికి సందర్శకులు పెరగడం గురించి విలేకరులు అడగ్గా కొత్త గవర్నర్ వచ్చారు కాబట్టి సందర్శకులు పెరిగారంటూ కేసీఆర్ తనదైన శైలిలో బదులిచ్చారు. రెవెన్యూ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు ‘కొత్త రెవెన్యూ చట్టంతో ఉద్యోగాలు పోతాయనే అపోహలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి పరిస్థితే వస్తే వారిని వేరే చోట సర్దుబాటు చేస్తాం. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయితేనే వీఆర్వో వ్యవస్థ వచ్చింది. అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సమస్యలు లేకుండా ఉంటే జీడీపీ కూడా పెరుగుతుందని ఇతర దేశాల అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా భూ రికార్డుల నిర్వహణ జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి -
పొలిటికల్ కారిడర్ 24th Oct 2019
-
రివ్యూ టైం
-
భావోద్వేగానికి లోనైన పద్మావతి
సాక్షి, సూర్యాపేట: ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని హుజుర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్నగర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికినా ఓడిపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మొదటి రౌండ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థికి 2 వేల ఆధిక్యం అనగానే తనకు అనుమానం వచ్చిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తమ బంధువులు వేసిన ఓట్లు కూడా పడలేదని స్వతంత్ర అభ్యర్థులు తనదో చెప్పారని, దీనిబట్టి చూస్తే ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈవీఎంలను మేనేజ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, ఈ ఫలితం కరెక్ట్ కాదని పద్మావతి అన్నారు. (చదవండి: హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...) -
మొదటి రౌండ్లోనే డౌట్ వచ్చింది
-
ఆర్టీసీని ఎవరూ రక్షించలేరు
-
‘బెదిరింపులు ఎక్కువకాలం పనిచేయవ్’
సాక్షి, హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధైర్యపడరని తెలిపారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయనప్పటికీ సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమైందని వివరించారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవిపై మాట్లడటానికి పొన్నాల నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘హుజూరు నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడరు. ఉపఎన్నికల్లో అధికారపార్టీకి వెసులబాటు ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సర్వసాధారణమే. కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటోంది. మహారాష్ట్ర ,హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా గతంతో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల అస్త్రంగా వాడుకొని ప్రచారం చేసిన బీజేపీ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు రాలేదు. సెంటిమెంట్, బెదిరింపులు శాశ్వతంగా పనిచేయవు. ప్రజలు మార్పు కోరుకుంటారు’ అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? ఆర్టీసీ కార్మికుల ఎత్తుకున్నది పిచ్చిపంథా. అనవరమైన, అర్థపర్థంలేనటు వంటి పద్దతిని అవలంభించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై నాకంటే ఎక్కువ అనుభవం లేదు. గతంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశా. అప్పుడు ఆ సంస్థ 13కోట్ల 80లక్షల నష్టంలో ఉంది. నేనే కష్టపడి ఆ సంస్థను 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. నేను ముఖ్యమంత్రి అయ్యాక వైస్రాయి హోటల్లో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించాను. వారికి సలహాలు ఇచ్చా. 44శాతం జీతాలు పెంచాం. ఎన్నికలకు కొద్దిరోజు ముందు 14 శాతం ఐఆర్ ఇచ్చా. మొత్తంగా 67శాతం జీతాం పెంచాం. చరిత్రంలోనే ఇలా ఎవరూ పెంచలేదు. ఇంత పెంచిన తర్వాత కూడా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? వారి తర్వాత మిగతా 57 సంస్థలు కూడా ప్రభుత్వంలో కలపమంటే ఎలా? ఇదే కోర్టులు అప్పుడు మళ్లి మమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ఇదేనా రాజకీయం. బాధ్యతమైన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా? సమ్మె ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తోంది ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో లేదు. 35 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఆర్టీసీని మూయలేదా? అక్కడ 200 బస్సులు మాత్రమే ప్రభుత్వానివి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ ఆర్టీసీని మూయలేదా? వీళ్ల సమ్మె ఏం సమ్మె? అర్థం, ఆలోచన ఉండి చేసిన సమ్మెనా? ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె చేస్తారు. దిక్కుమాలిన యూనియన్ ఎన్నికల కోసం ఇలాంటి సమ్మెలు చేస్తారు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తుంది. ఈ రోజుకి 5వేల కోట్లు అప్పు ఉంది. ఒక నెల కిస్తీ కట్టకుంటే ఆర్టీసీ ముగుస్తుంది. ఫీఎఫ్ డబ్బులు కార్మికులకు ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. నెలకు 100 కోట్ల నష్టం. ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఎందుకు అలా? ఇదేనా యూనియన్లు చేసే పని. అద్దెబస్సులు తొలగించండి అంటారు.. టైం ప్రకారం బస్సులు నడిపించాలి. ఆర్టీసీ ని ఎలా కాపాడుతారు. సందర్భం వస్తే ఓ గంట పనిచేస్తే ఏమవుతుంది. టైంప్రకారం పని దిగిపోతా అంటే ఎలా? ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. గత ప్రభుత్వాలు 712 కోట్లు ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 4250కోట్లు విడుదల చేశాం. అది కాక ఓ చట్టం తీసుకొచ్చాం. దానిద్వారా 330 కోట్లు వచ్చాయి. ఏడాదికి 900 కోట్లుకు పైగా ఇచ్చాం. ఇంకేం ఇస్తారు? ఈ ఏడాది 550 కోట్లు పెట్టాం. 425 కోట్లు విడుదల చేశాం. ఇంకెన్ని ఇవ్వాలి? హైకోర్టు ఏం చేస్తది? సాధారణంగా పండగల సమయంలో డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఆర్టీసీకి బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం. అటువంటి సమయంలో సమ్మెకు పోయారు. ఇదేనా పద్దతి. పలికిమాలిన డిమాండ్లను పెట్టారు. వారి డిమాండ్లపై కమిటీ వేశాం. సీఎస్ అధ్యక్షతన చర్చలు జరిపాం. అయినా వినలేదు. ఆర్టీసీ ప్రభుత్వం కలపాలన్నారు. కమిటీ కాదని సమ్మెకు పోయారు. ఇప్పుడు ఏమైంది. ఏం ఫలితం? సమ్మెకు ముందు ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేశారు. వాటిలో 7 కోట్లు మాత్రమే ఇప్పుడు ఆర్టీసీ దగ్గర ఉన్నాయి. సమ్మె కారణంగా ప్రస్తుతం కూడా నష్టమే వస్తున్నాయి.సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేసులు వేశారు. ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. డబ్బులు లేవని చెప్పాం. హైకోర్టు ఏం చేస్తది కొడుతదా? బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి ఆర్టీసీ యూనియన్లు మహానేరం చేస్తున్నారు. అమాయక కార్మికలు గొంతు కోస్తున్నారు. వారిని ఎవరూ కాపాడలేరు. వందశాతం ఆర్టీసీ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాని సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. ఆర్టీసీలో పోటీని పెంచాలని సూచించారు. ఆర్టీసీకి పోటీదారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తాం. హైకోర్టుకు తీర్పు చెప్పే హక్కు లేదు. లేబర్ కోర్టుకు వెళితే ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వమంటారు. అప్పుడు బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వదు. బుద్దిఉన్న ఏ వ్యక్తి ఇలాంటి సమ్మె చేయరు. నా దృష్టింలో ఆర్టీసీ పని అయిపోయింది. వారిపై ఎస్మా ఉన్నా కూడా సమ్మెకు పోయారు. ఇది చట్టవిరుద్ధ చర్య. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బుల్లేవు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదు. ఈ యూనియన్లే ఆర్టీసీని ముంచాయి. ఇకపై కూడా ఇలాంటి యూనియన్లు ఉండి ఇదే గొంతెమ్మ కోరికలు కోరితే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. కార్మికులతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పనిచేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఆర్టీసీ సమ్మెకు ముంగింపు ఆర్టీసీ ముగింపే జవాబు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులే కాదు అందరూ పనిచేశారు. కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటాం. ఆర్టీసీ సంఘాలు తక్షణం దిగిరావాలి లేదంటే ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిషన్లు ఇస్తాం’ కేసీఆర్ హెచ్చరించారు. -
హుజూర్నగర్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు
-
రోజూ పెడబొబ్బలు.. ఆ పార్టీకి డిపాజిటే గల్లంతైంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలకు ఆ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగే కీలక తీర్పు కాకపోయినా.. పనిచేసే ప్రభుత్వానికి ఇదొక టానిక్‌లా పనిచేస్తుందని అన్నారు. ఇదొక కీలక ఉప ఎన్నిక అని, ఈ ఎన్నికలో అద్భుతమైన ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని కొనియాడారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైడిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోవాలి హుజూర్నగర్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు చాలా దుష్ప్రచారం చేశాయని, తమపై నీలాపనిందలు వేశారని కేసీఆర్ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పచ్చి అబద్ధాలతో ప్రజలను గోల్మాల్ చేసే రాజకీయాలు చేయడం మంచిది కాదని కేసీఆర్ ప్రతిపక్షాలకు సూచించారు. తలాతోక లేని ఆరోపణలు చేస్తే బూమరాంగ్ అవుతుందని హెచ్చరించారు. ఏదిపడితే అది మాట్లాడితే.. ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ప్రజలు ఆమోదించబోరని హుజుర్నగర్ ఫలితాలు చాటుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకుంటే మంచిదన్నారు. ప్రతిపక్షం ఉంటేనే మంచిదని, అది నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు. బీజేపీకి డిపాజిట్ కూడా గల్లంతయినట్టు తెలుస్తోందని, రోజూ ఆ పార్టీ పెట్టే పెడబొబ్బలకు, అరుపులకు.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య పోలిక చూసుకుంటే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వ్యక్తిగతంగా, చీప్ విమర్శలు చేయడం, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో సహనం మంచిదని, అహంభావం, అహంకారం మంచిది కాదని అన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరూ అహంభావానికి లోనుకాకుండా మరింతగా కష్టపడాలని సూచించారు. ఎల్లుండి థ్యాంక్స్ సభ ఇప్పుడు హుజూర్‌నగర్‌లో సుమారు 43వేల మెజారిటీతో సైదిరెడ్డి విజయం సాధించారని, గతంలో ఏడువేల ఓట్ల తేడాతో ఈ సీటులో తాము ఓడిపోయామని అన్నారు. తాజా ఫలితాలతో దాదాపు 50వేల ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని తేలిందని, హుజూర్నగర్ ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు. హుజూర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎల్లుండి (శనివారం) సాయంత్రం టీఆర్ఎస్ సభ నిర్వహిస్తోందని, ఈ సభలో తాను పాల్గొని ప్రజలకు థ్యాంక్స్ చెప్తానని తెలిపారు. -
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయి. హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్ సింబల్.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది. -
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం
-
ఉత్తమ్ పని అయిపోయినట్టేనా ?
సాక్షి, హైదరాబాద్ : హూజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హూజూర్‌నగర్ ఓటమితో పీసీసీ మార్పు తప్పనిసరి అంటూ కాంగ్రెస్ మరో వర్గం ప్రచారం చేస్తోంది. హూజర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉన్నట్లు బయట ప్రచారం చేసినా.. లోపల మాత్రం ఓడిపోవాలన్న భావనతోనే ఉన్నారనే కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధిష్టానానికి హూజూర్‌నగర్ గెలిపించుకుంటాననే భరోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశముంది. హూజర్‌నగర్ ఓటమితో ఉత్తమ్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని కాంగ్రెస్‌లోని మరోవర్గం ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పట్ల ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ భవిష్యత్ ను కూడా దెబ్బకొట్టారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ పగ్గాలపై ఆశలుపెట్టుకున్న నేతలే.. ఉత్తమ్ కొంపముంచారనే ప్రచారముంది. పీసీసీ చీఫ్ ఉండి ఎమ్మెల్యేల వలసలను ఆపలేకపోయారని కాంగ్రెస్ సభాపక్ష నేత బట్టి విక్రమార్క కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ పగ్గాలు అందిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నల్గొండలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దళిత కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్‌లు పీసీసీ పగ్గాల కోసం పోటీపడుతున్నారు. ఇక సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పీసీసీ పగ్గాల కోసం నేను సైతం అంటున్నారు. టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యంలో అందుకు తగ్గరీతిలో పార్టీని నడిపే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం మరికొన్ని రోజుల్లోనే కీలకనిర్ణయం తీసుకునే అవకాశం స్సష్టంగా కనిపిస్తోంది. -
హుజుర్నగర్ ఓటర్లు పట్టించుకోలేదా?
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆర్టీసీ సమ్మె ప్రభావం పడలేదని ఫలితాన్ని బట్టి తెలుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కార్మికులు ఈనెల 5 నుంచి సమ్మె బాట పట్టారు. 6వ తేదీ సాయంత్రానికి విధుల్లో చేరని కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ మొండి వైఖరిని ప్రతిపక్షాల సహా వివిధ సంఘాలు తప్పుబట్టాయి. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వ్యవహారశైలి ప్రభావం హుజుర్నగర్ ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఓటర్లు అధికార టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. సొంత నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఆర్టీసీ సమ్మె కలిసివస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ కూడా అనుకున్నారు. అయితే ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో హుజుర్నగర్ ప్రజలు గెలిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల పోరాట కార్యచరణ ఎలా ఉండబోతుందో చూడాలి. ఆర్టీసీ సమ్మెపై మున్ముందు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. తాజా ఓటమి నుంచి కాంగ్రెస్ ఎలాంటి గుణపాఠాలు నేర్చకుంటుందో చూడాలి. (చదవండి: మాది న్యాయ పోరాటం!) -
కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆదిపత్యంలో దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కు మొజార్టీ పెంచుకుంటూ.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇదిలా ఉంటే.. హుజూర్‌నగర్‌లో గెలిచి సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు.ఆయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్నగర్ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్‌నగర్‌లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి ఉత్తమ్‌రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. -
ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
షాక్ తిన్న కాంగ్రెస్..
-
కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ రెపరెపలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే 20వేలకు పైచిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా పాతడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు. తీవ్ర ఉత్కంఠను రేపిన హుజూర్.. హుజూర్నగర్ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి కనిపిస్తోంది. అటు, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్‌నగర్‌లో పోటీచేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. టీపీసీసీ చీఫ్ నియోజకవర్గం అయిన హుజూర్నగర్ పూర్తిస్థాయిలో టీఆర్ఎస్కు పట్టం కట్టినట్టు కనిపిస్తోంది. హస్తం పార్టీకి గట్టి పట్టున్న మండలాల్లోనూ గులాబీకి ఆధిక్యం దక్కడం ఇక్కడ టీఆర్ఎస్ జోరును చాటుతోంది. బెట్టింగ్‌రాయుళ్ల జోరు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరిగాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పందాలు కాశారు. వేయి నుంచి లక్షల రూపాయల వరకు పందాలు సాగాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతోపాటు పోలింగ్ సరళిలోనూ టీఆర్ఎస్కు సానుకూలత ఉండటంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పందాలు కాసిన వారికి భారీ ఆఫర్లు ఊరించాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడిచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే పెద్ద ఎత్తున పందాలు సాగాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్ఎస్కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బెట్టింగ్చేసిన వాళ్లు పెద్ద ఎత్తున నష్టపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక, టీఆర్ఎస్ గెలుపు, మెజారిటీలపై బెట్టింగ్ కాసినవాళ్లు లాభపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగులు సాగాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్నగర్ ఫలితంపై పందాలు జోరుగా సాగాయి. -
సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
-
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యం