సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వెళ్తున్నాయి. షెడ్యూల్ విడుదలైన తర్వా త తొలిసారి టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంతో ఒక సారి నియోజకవర్గాన్ని చుట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతిని ప్రకటించిన ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విపక్షాల మద్దతు కోసం యత్నిస్తున్నారు. ఏఐసీసీ నుంచి అధికారింగా పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె ప్రచారంలో దిగనున్నారు. నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
మోగిన టీఆర్‌ఎస్ ప్రచార శంఖారావం..
టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచార శంఖారావం మోగించారు. పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఘాటుగా విమర్శలు చేశారు. షెడ్యూల్ వి డుదల, సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించక ముం దే గత నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించా రు.
పనిలో పనిగా పార్టీలో భారీగా చేరికలతో జోష్ పెంచారు. ఈ కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై కేడర్‌లో ఉత్సాహం పెంచారు. మళ్లీ సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితితో గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ ఈ సారి తమదే విజయమని ధీమాగా ఉంది. గతంలో ఓటమి చెందారన్న సానుభూతి ఈ సారి తమ పార్టీ అభ్యర్థికి ఉపకరించి విజయం దక్కుతుందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
మద్దతు కూడగట్టుకోవాలని..
కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినా ఈ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆపార్టీలో దుమారం లేపాయి. రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారికంగా మళ్లీ పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రచార జోరు పెంచాలని ఆపార్టీ భావిస్తోంది. ఉత్తమ్ గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం కూడా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్ మండలాల్లో ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో విపక్షాల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
సీపీఐ, సీపీఎం నేతలతో ఇప్పటికే ఉత్తమ్ మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను ఉత్తమ్ కలిసి హుజూర్‌నగర్ ఎన్నికపై చర్చించారు. కలిసి వచ్చే పార్టీలతో వెళితే ఎంతోకొంత బలం పెరుగుతుందని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో ఎవరు కలిసి వస్తారు.. ప్రతి పక్షాలు పార్టీలు ఎవరెవరిని బరిలో దింపనున్నాయో మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది.
ఎలా ముందుకెళ్లాలని..
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములు ఏపార్టీవని రాష్ట్ర స్థాయిలో జోరుగా చర్చసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఆలోచిస్తున్నాయి. ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం, ఆయన టీపీసీసీ చీఫ్‌గా ఉండడంతో ఈ స్థానం ఈ సారి తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. మండలానికి ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను ఇన్‌చార్జిగా పెట్టాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ నిర్ణయించింది. నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మొత్తంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి భుజానకెత్తుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని ఇక విజయం తమదేనని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. హుజూర్‌నగ్ ఉప ఎన్నికతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగం అందుకున్నారు.
‘ఉత్తమ్, జానా.. నేను కలిసిపోయామని, మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు’ అని ఇటీవల జిల్లా పర్యటనలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలపై.. ఉత్తమ్‌కు ఉమ్మడి జిల్లా నేతలు బాసటగా నిలిచారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లా నేతల ఐక్యత, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆపార్టీ›నేతలు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలను ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి దింపాలని ఏఐసీసీ సూచనలతో ఉత్తమ్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీలు పోటీలో ఉంటాయా..? ఎటు వైపు వెళ్తాయన్నది తేలాల్సి ఉంది. పోలింగ్‌కు ఇంకా 28 రోజుల సమయం ఉంది. వచ్చే నెల 19న ప్రచారం ముగుస్తుంది. ఈ తక్కువ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొని గెలుపు తీరం చేరాలని ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పై ఎత్తుల్లో మునిగారు.
ముహూర్తం చూసుకొని రెండు మూడు రోజుల్లో నామినేషన్
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు నియోజకవర్గంలో చేపట్టదలచిన ప్రచారంపై పలు సూచనలు చేశారు. భారీ మెజార్టీతో గెలిచిరావాలని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కవద్దన్నారు. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేయనున్నట్లు సైదిరెడ్డి సాక్షికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment