
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 1,16,508 మంది పురుషులు, 1,20,435 మంది మహిళలు కలిపి మొత్తం 2,36,943 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సోమవారం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం స్థానిక సెలవు దినంగా ప్రకటించింది.
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభకు ఎంపిక కావడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి(టీఆర్‌ఎస్), నలమాద పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ కోటా రామారావు(బీజేపీ), చావ కిరణ్మయి (టీడీపీ)తో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్‌తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. మొత్తం 1,497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.
పోలీస్ పహారాలో..
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్‌ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment