
చాడను ఆత్మీయంగా హత్తుకుంటున్న కేశవరావు. చిత్రంలో వినోద్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతును కూడగట్టేందుకు ఆ పార్టీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం సీపీఐ నేతలతో చర్చలు జరిపింది. టీఆర్‌ఎస్ నేతలు, ఎంపీ కె.కేశవరావు, వినోద్‌కుమార్ తదితరులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే అక్టోబరు 1న జరగనున్న కార్యవర్గ సమావేశంలో చర్చించి తమ నిర్ణయం చెబుతామని ఈ సందర్భంగా చాడ ప్రకటించారు. అనంతరం కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ తరపున సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు తాము సీపీఐ నాయకులను కలిశామన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదని తెలిసి, తమకు మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. సీపీఐ నేతలు సానుకూలంగా స్పందించారని, కొన్ని విషయాలపై చర్చ జరిగిందన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్‌ను దెబ్బ తీయకూడదని ఘనపూర్, పరకాలలో తాము మద్దతు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment