సాక్షి, నల్గొండ : హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేది టీఆరెస్సేనని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలని కోరారు. హుజూర్‌నగర్ అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలంటే టీఆర్‌ఎస్ గెలవాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
(చదవండి : హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల)
‘మెట్ట ప్రాంతాలకు కూడా సాగు నీరు అందిస్తున్నాం. ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నదీ జలాలను భగీరథ ద్వారా అందిస్తున్నాం. హుజూర్‌నగర్ ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రజా క్షేత్రంలో వారికి తగిన సమాధానం ఇవ్వాలి. ఎన్నికల్లో పంచడానికి కారులో డబ్బులు తరలిస్తూ తగుల బెట్టిన నీచ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఈ సారి బుద్ధి చెప్పాలి. సైదిరెడ్డి స్థానికుడు. అందరిలో కలిసి పోయాడు. ఈ సారి సైదిరెడ్డి గెలుపు ఖాయం’అని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment