మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు! | Uttamkumar Reddy Fires on Minister KTR | Sakshi
Sakshi News home page

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

Published Thu, Sep 26 2019 2:34 PM | Last Updated on Thu, Sep 26 2019 2:46 PM

Uttamkumar Reddy Fires on Minister KTR - Sakshi

సాక్షి, సూర్యాపేట: హుజూర్ నగర్ ఉప ఎన్నికతో రాష్ట్ర చరిత్ర మలుపు తిరగబోతుందని, ఇది అధర్మానికి, ధర్మానికి, అవినీతి,అరాచకానికి, న్యాయానికి మధ్య పోరాటమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డంపెట్టుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు  గలీజు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని, డబ్బులతో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో జర్నలిస్టుల  సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. 

తన పట్ల కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కేటీఆర్.. మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు అని అన్నారు. మీలాగా కుటుంబ, కుల, గలీజు రాజకీయాలు తాను చేయలేదన్నారు.  తరచూ నోరుజారే రాజకీయ బచ్చ కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథలో ఎన్ని కోట్లు దోచుకున్నారో కేటీఆర్‌ ప్రజలకు చెప్పాలని అన్నారు. కేటీఆర్‌ది బోగస్ సర్వే అని, 14 శాతం అధిక్యం ఉంటే.. ఇంకా కాంగ్రెస్ నాయకులను ఎందుకు కొంటున్నావని ప్రశ్నించారు. హుజూర్‌నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం యామారానికి చెందిన ఆంధ్ర వ్యక్తికి ఎలా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. 

కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాన్ని వ్యభిచారం చేస్తున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన్ని వెళ‍్లగొట్టితే  గుత్తాను  తమ సొంత డబ్బులతో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేశామన్నారు. కౌన్సిల్ చైర్మన్ అయిన గుత్తా  దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని, దీనిపై ఆధారాలతో  గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హుజూర్‌ నరగ్‌ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర బలగాలను రప్పించాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్ అంకుల్ తనపై కేసు పెడితే  కోర్టు కొట్టివేసిందని, అయినా ఈ బచ్చ మాట్లాడుతాడా అని ఉత్తమ్‌ చెప్పుకొచ్చారు. తనను కేటీఆర్ ఏకవచనంతో పిలుస్తున్నారని, ఆయన భాష మార్చు కోవాలని హితవు పలికారు. 

నామినేషన్‌ దాఖలు చేసిన పద్మావతి
హుజూర్‌నగర్  ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక తెలంగాణ ఆడబిడ్డనైన తనను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే మోహరించిందని విమర్శించారు. హుజూర్‌నగర్‌ ఓటర్లు తనను ఆదరించి.. ఓటువేసి గెలిపించాలని ఆమె కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement