సాక్షి, హైదరాబాద్ : హూజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హూజూర్‌నగర్ ఓటమితో పీసీసీ మార్పు తప్పనిసరి అంటూ కాంగ్రెస్ మరో వర్గం ప్రచారం చేస్తోంది. హూజర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉన్నట్లు బయట ప్రచారం చేసినా.. లోపల మాత్రం ఓడిపోవాలన్న భావనతోనే ఉన్నారనే కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధిష్టానానికి హూజూర్‌నగర్ గెలిపించుకుంటాననే భరోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశముంది. హూజర్‌నగర్ ఓటమితో ఉత్తమ్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని కాంగ్రెస్‌లోని మరోవర్గం ప్రచారం చేస్తున్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పట్ల ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ భవిష్యత్ ను కూడా దెబ్బకొట్టారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ పగ్గాలపై ఆశలుపెట్టుకున్న నేతలే.. ఉత్తమ్ కొంపముంచారనే ప్రచారముంది. పీసీసీ చీఫ్ ఉండి ఎమ్మెల్యేల వలసలను ఆపలేకపోయారని కాంగ్రెస్ సభాపక్ష నేత బట్టి విక్రమార్క కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ పగ్గాలు అందిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నల్గొండలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దళిత కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్‌లు పీసీసీ పగ్గాల కోసం పోటీపడుతున్నారు. ఇక సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పీసీసీ పగ్గాల కోసం నేను సైతం అంటున్నారు.
టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యంలో అందుకు తగ్గరీతిలో పార్టీని నడిపే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం మరికొన్ని రోజుల్లోనే కీలకనిర్ణయం తీసుకునే అవకాశం స్సష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment