హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శానంపూడి
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ముంగింట చేరికలు తారస్థాయికి చేరాయి. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నేతల జంపింగ్‌ల పర్వం ఊపందుకుంది. ఉదయం ఒక పార్టీలో ఉన్న నేత, మరుసటి రోజు మరో పార్టీ జెండా పట్టుకుంటున్నారు. చేరికలతో తమ బలం పెరుగుతుందని, తమకే కలిసివస్తుందని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ కొత్త నేతల రాకతో పాత నేతలు అలకబూనుతున్నారు.
షెడ్యూల్ విడుదలకు ముందే..
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చేరికల రాజకీయం హుజూర్‌నగర్‌లో షురూ అయింది. నోటిఫికేష న్ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్ని మండలాల్లో పార్టీ పరంగా పర్యటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గిన మండలాల్లో నజర్ పెట్టడంతో రెండు పార్టీల్లోనే భారీగా చేరికలు జరిగాయి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలువురు నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అటు టీఆర్‌ఎస్.. ఇటు కాంగ్రెస్ బాట పట్టారు.
ఒక నేత పార్టీని వీడితే మరో నేతను పార్టీలో చేర్పించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మూడు రోజులుగా ఈ చేరికలు మరింత జోరందుకున్నాయి. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం చినవెంకట్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆపార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన మళ్లీ హస్తం గూటికి చేరారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలకవీడు నుంచి మలోతు బుజ్జి విజయం సాధించారు.
ఆమెతో పాటు భర్త, బెట్టెతండా సర్పంచ్ మాలోతు మోతీలాల్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజధానిలో నాలుగు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప ఎన్నిక సమయం సమీపిస్తుండడంతో ఇలా ముఖ్య నేతల చేరికలే టార్గెట్‌గా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పావులు కదుపుతున్నాయి.
ఎవరి బలం పెరిగేనో?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఎక్కడో పొరపాటు జరిగిందని ఆతర్వాత టీఆర్‌ఎస్ విశ్లేషించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న చేరికలతో గతంలో కన్నా మెరుగ్గా ఫలితం ఉంటుందని అభ్యర్థులు, నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఏకంగా 40 వేల మెజారిటీతో గెలవబోతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భారీ మెజారిటీ దక్కనుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఈ చేరికలతో ఎవరి బలం పెరిగింది, ఎవరి బలం తగ్గిందోనని మండల స్థాయిలో నేతలు లెక్కలు వేస్తున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఇరు పార్టీల నుంచి జంప్ అయిన నేతలు ఎవరు..?, వారికి ఉన్న జనాదరణ ఎంత..? అని ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఏ నేత, ప్రజా ప్రతినిధి ఎటు వెళ్తున్నారు.., ఎవరితో మంతనాలు చేస్తున్నారోనని ముఖ్య నేతలు ప్రత్యేకంగా మండలాల్లో వేగులు పెట్టుకున్నట్లు ఆయా పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీల్లోకి నేతలు మారినా వచ్చే నెల 24న ఓట్ల లెక్కింపుతోనే ఎవరి బలం పెరిగిందో తేలనుంది.
పాత నేతల అలక..
చేరికలతో కొత్త నేతలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. వీరి చేరికతో ఇంతకు ముందే ఆ పార్టీలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు అలకబూనుతున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడయ్యాడని, మళ్లీ పార్టీలోకి మమ్ముల్ని సంప్రదించకుండా ఎలా తీసుకుంటారని తమ ఆక్రోశాన్ని బహిరంగంగా కాకుండా తమ అనుచరగణం ముందు వెలిబుచ్చుతున్నారు. జంపింగ్‌లతో ఒక్క పార్టీలోనే ఒక్కో మండలం, గ్రామంలో రెండు మూడు గ్రూపులు తయారయ్యాయి. పైకి అంతా సయోధ్యగా ఉన్నట్లు కనిపించినా గ్రూప్‌ల వార్ మాత్రం కొనసాగుతోంది.
పార్టీ ముఖ్య నేతల వద్దకు ఈ గ్రూపుల లొల్లి వెళ్లడంతో వారిని బుజ్జగిస్తున్నారు. పాత, కొత్త నేతల మధ్య ఐక్యత లేకపోతే ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదని పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. చేరికలు తమకు లాభమేనని నేతలు ధీమాగా ఉన్నా ఎంత వరకు కలిసివస్తాయన్నది వారికి అంతుచిక్కడం లేదు. గత ఎన్నికల్లోనూ జోరుగా చేరికలు జరిగినా కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ రాలేదు.. టీఆర్‌ఎస్‌కు విజయం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment