సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో విజయంపై టీఆర్‌ఎస్‌లో ధీమా వ్యక్తమవు తోంది. విజయం తమదేనని సోమవారం పోలింగ్ ముగిశాక ఆ పార్టీ నేతలు కుండ బద్దలు కొడు తున్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్‌పోల్ సర్వేలు ఇదే చెబుతుండటంతో గులాబీ విజయం సాధిస్తుందనే అభి ప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవు తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహ రచన, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే సోపానాలుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట బద్దలవు తుందనే అంచనాలు పోలింగ్ ముగిశాక వెల్లడయ్యాయి. అయితే కాంగ్రెస్ శిబిరం కూడా తామే గెలుస్తామని చెబుతోంది. సంప్రదాయ ఓటు బ్యాంకు తమను గట్టెక్కిస్తుందనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు పోటీలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఎన్ని కల బరిలో నామమాత్రపు పోటీ ఇవ్వగా, ఈ రెండు పార్టీలకు ఎన్ని ఓట్లు పోలవుతా యన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బరాబర్ బరిలో..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డాయి. టీఆర్‌ఎస్ బలగమంతా హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న కసితో పనిచేసింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పర్యవేక్షణలో పార్టీ నేతలు, కార్యకర్తలు దాదాపు 20 రోజుల పాటు శ్రమించారు. మండలాలు, గ్రామాల వారీగా ఇంచార్జులను నియమించి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ రోడ్‌షో ఈసారి ఎన్నికల ప్రచా రంలో హైలెట్ కాగా, సీఎం కేసీఆర్ సభ వర్షం కారణంగా రద్దయినా నిరాశ చెందకుండా గులాబీ దళం ప్రచార పర్వాన్ని శాయశక్తులా ఉపయోగిం చుకుంది. రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా నిలిచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, పోలింగ్ జరిగిన సోమవారమంతా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మాటే వినిపించడంతో ఈసారి హుజూర్‌నగర్ అధికార పార్టీ ఖాతాలో పడనుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
మా ఓట్లు మాకే..!
ప్రతిపక్ష కాంగ్రెస్ శిబిరంలో కూడా పోలింగ్ సరళిపై తీవ్రంగానే అంచనాలు, లెక్కలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు పటిష్ట కేడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో తమ ఓటు బ్యాంకుకు గండి పడలేదని, టీఆర్‌ఎస్ ఎన్ని చెప్పినా తమ ఓట్లు తమకే పడ్డాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సంప్రదాయంగా పట్టున్న కాంగ్రెస్‌కు విజయానికి కావాల్సిన ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ చేసిన అభివృద్ధే మళ్లీ ఇక్కడ విజయాన్ని చేకూరుస్తుందని వారంటున్నారు. పోలింగ్ సరళి కొంత అనుకూలంగా లేకపోయినా సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదు కావడమే ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తమ్మీద రెండు శిబిరాల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతున్నా ఓటరు రాజు కారువైపే మొగ్గు చూపినట్లు పోలింగ్ డే పరిస్థితులు చెబుతున్నాయి.
ఆ పార్టీలు ఏం చేస్తాయో?
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు నియోజకవర్గంలో తమ సత్తా చాటేందుకు పోటీలో ఉన్న బీజేపీ, టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి 1,555 ఓట్లు మాత్రమే రాగా, టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈసారి టీడీపీ ఒంటరిపోరు కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. బీజేపీ మంత్రం కూడా పెద్దగా పనిచేయలేదని, ఈ సారి కూడా ఆ పార్టీ నామమాత్రపు పోటీకే పరిమితం అవుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై ఓ అంచనాకు రావడం కూడా కష్టంగానే ఉందని పోలింగ్ సరళి చెబుతోంది. మొత్తమ్మీద ఈ రెండు పార్టీలకు ఎన్నెన్ని ఓట్లు వస్తాయి.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరిని నష్టపరుస్తాయి.. ఎవరికి మేలు చేస్తాయన్నది ఈనెల 24న తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment