సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.
హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్‌ఎస్ ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్‌ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది.
(చదవండి : మోగిన ఎన్నికల నగారా)
టీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్షే
హుజూర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అగ్ని పరీక్ష అని చెప్పాలి. హుజూర్ నగర్ నియోజక వర్గము ఏర్పాటు అయిన తరువాత ఒక్కసారి కూడా టీఆర్‌ఎస్ విజయం సాధించలేదు. 2009 నుంచి హుజూర్ నగర్ లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు చేదు ఫలితమే ఎదురైంది. మంత్రి జగదీశ్ రెడ్డి 2009 లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాసోజు శంకరమ్మకు టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వా త జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని పోటీకి దింపింది. కానీ భంగపాటు మాత్రం తప్పలేదు. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభావంలోఉన్న టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ సీటును దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. మండలానికి ఒక మంత్రిని పెట్టి గెలిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment