టానిక్‌ లాంటి విజయం  | KCR Speech About Huzurnagar By Election Victory In Pragati Bhavan | Sakshi
Sakshi News home page

టానిక్‌ లాంటి విజయం 

Published Fri, Oct 25 2019 4:16 AM | Last Updated on Fri, Oct 25 2019 10:29 AM

KCR Speech About Huzurnagar By Election Victory In Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతికూల వాతావరణంలో హుజూర్‌నగర్‌ సభకు వెళ్లలేకపోయినా అద్భుత విజయం అందించారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా ఆచితూచి, ఆలోచించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఈ తీర్పు ప్రభుత్వానికి టానిక్‌ లాంటిది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ నేతలతో కలసి సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా 43 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు మా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. హుజూర్‌నగర్‌ ప్రజలు ఏ అభివృధ్ధి కోసం ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరుస్తాం. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగే కృతజ్ఞత సభకు ఎన్నికల సంఘం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ సభకు హాజరై వారి ఆశలను నెరవేరుస్తా’అని కేసీఆర్‌ ప్రకటించారు. పార్టీ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు నేతలందరూ మొక్కవోని కృషి చేయడం వల్లే హుజూర్‌నగర్‌లో విజయం సాధించామని కేసీఆర్‌ అన్నారు. 

ప్రతిపక్షాలు అహంకారం వీడాలి
‘ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని కోరుతున్నా. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. బీజేపీకి డిపాజిట్‌ కూడా రాలేదు. వాళ్లు రోజూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సద్విమర్శ చేసే ప్రతిపక్షం అవసరం. కేసీఆర్‌ను తిడితే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వంద శాతం అన్ని అంశాలను గమనిస్తున్నారు. విమర్శలు హుందాగా, విమర్శనాత్మకంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. కొన్ని పార్టీలు ఉప ఎన్నిక వాయిదా వేయించాలని చూశాయి. కేసీఆర్‌ హెలికాప్టర్‌ను తనిఖీ చేయాలని చెప్పాయి. కేసీఆర్‌ హెలికాప్టర్‌లో డబ్బులు తీసుకుపోతాడా? ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి. అహంభావం, అహంకారం లేకుండా వ్యవహరించాలి. బాధ్యతగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఈ విజయంతో గర్వం తలకెక్కించుకోకుండా మరింత బాధ్యతతో, సంస్కారవంతంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరుతున్నా. రాష్ట్రాన్ని గాడిన పెట్టడమే మా ముందున్న సవాల్‌. ఓవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా అమలు చేస్తున్నాం’అని కేసీఆర్‌ తెలిపారు. 

నవంబర్‌లోగా మున్సిపల్‌ ఎన్నికలు
‘వీలైనంత త్వరగా మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇదివరకే రెండు చట్టాలు తెచ్చింది. నియమిత విధానంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది జరిగేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ చట్టాలు రూపొందించాం. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 330 కోట్లు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. అదే తరహాలో మున్సిపాలిటీలకు కూడా రూ. 1,030 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించి నూతన పాలక మండళ్ల ద్వారా పట్టణ ప్రగతికి ప్రణాళిక అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,030 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2,060 కోట్లతో 141 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యమయ్యాయి. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పుతో మున్సిపల్‌ ఎన్నికలపై 99 శాతం స్పష్టత వచ్చింది. 2, 3 రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదన ప్రభు త్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లోగా మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’అని కేసీఆర్‌ తెలిపారు. 

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత  గల్ఫ్‌ దేశాలకు
‘గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణవాసులను స్వదేశానికి రప్పించేందుకు మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. కేరళ అనుసరిస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెళ్లి తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే 4–5 గల్ఫ్‌ దేశాల్లో పర్యటిస్తాం. ఇక్కడ న్యాక్‌ ద్వారా వారికి భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇప్పిస్తాం. మన వాళ్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్తుంటే యూపీ, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు’అని కేసీఆర్‌ వివరించారు. 

మహారాష్ట్రలో పోటీపై ఆసక్తి లేదు
‘నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహారాష్ట్రవాసులు టీఆర్‌ఎస్‌ తరపున అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలోనే దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో మేము ఆసక్తి చూపలేదు. భివండీ, షోలాపూర్‌ వంటి ప్రాంతాల్లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆశ పడటంలో తప్పులేదు. 2001లో పుట్టిన టీఆర్‌ఎస్‌ నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమించింది. ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు. అదేమీ దురాశ కాదు. అయితే లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి సరిగా ఉండాలనేది టీఆర్‌ఎస్‌ భావన’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు
‘జర్నలిస్టులకు వంద శాతం ఇళ్ల స్థలాలు ఇస్తాం. సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరలో కొలిక్కివచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టుల సంక్షేమ నిధి సత్ఫలితాలిస్తోంది. జర్నలి స్టులు, రాజకీయ నాయకులు వ్యవస్థకు పరస్పరం అవసరం. ప్రెస్‌ అకాడమీ బాగా పనిచేస్తోంది’అని సీఎం కితాబిచ్చారు. కాగా, గవర్నర్‌ కార్యాలయానికి సందర్శకులు పెరగడం గురించి విలేకరులు అడగ్గా కొత్త గవర్నర్‌ వచ్చారు కాబట్టి సందర్శకులు పెరిగారంటూ కేసీఆర్‌ తనదైన శైలిలో బదులిచ్చారు.  

రెవెన్యూ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు 
‘కొత్త రెవెన్యూ చట్టంతో ఉద్యోగాలు పోతాయనే అపోహలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి పరిస్థితే వస్తే వారిని వేరే చోట సర్దుబాటు చేస్తాం. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయితేనే వీఆర్వో వ్యవస్థ వచ్చింది. అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సమస్యలు లేకుండా ఉంటే జీడీపీ కూడా పెరుగుతుందని ఇతర దేశాల అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా భూ రికార్డుల నిర్వహణ జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement